అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు


కాశ్మీరులో జె.కె.ఎల్.ఎఫ్ వ్యవస్ధాపకుడు మక్బూల్ భట్ కోసం నిర్మించిన స్మారకం ప్రక్కనే అఫ్జల్ గురు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు కాశ్మీరీలు (ఫొటో: ది హిందూ)

కాశ్మీరులో జె.కె.ఎల్.ఎఫ్ వ్యవస్ధాపకుడు మక్బూల్ భట్ కోసం నిర్మించిన స్మారకం ప్రక్కనే అఫ్జల్ గురు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు కాశ్మీరీలు (ఫొటో: ది హిందూ)

భారత దేశంలోనే ప్రముఖ న్యాయ నిపుణుడుగా (జ్యూరిస్టుగా) పేరు ప్రఖ్యాతులు పొందిన ఫాలి నారిమన్ కాశ్మీరు జాతీయుడు అఫ్జల్ గురు ఉరితీత పైన స్పందించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని కడిగేశాడు. అఫ్జల్ కుటుంబానికి సరైన సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరితీసి పాతిపెట్టడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. మానవతకు భారత దేశ సాంప్రదాయంలో అత్యున్నత స్ధానం ఉన్నదని, ఫోన్ చేసి చెప్పగల సమాచారాన్ని స్పీడ్ పోస్టులో పంపడం అమానవీయం అని ఆయన సూచించారు. కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే దీనికి పరోక్ష బాధ్యుడు అని నారిమన్ స్పష్టం చేశారు.

“మనకి ఉన్న అత్యంత బద్ధ శత్రువులు కూడా మెరుగుగా చేసి ఉండడు… ఈ విషయాలను మానవతా దృక్పథం నుండి చూడాల్సి ఉంటుంది. రాష్ట్రపతి క్షమా భిక్ష పిటిషన్ ను తిరస్కరించారు కనుక మీరు ఒక వ్యక్తిని నిస్సందేహంగా ఉరి తీయవచ్చు. అదే సమయంలో, మానవతా సిద్ధాంతాలు భారత దేశానికి పరాయివి ఏమీ కావు… అది జరిగిన పద్ధతి చూస్తే, అది చాలా దురదృష్టకరం. వారు ఆలోచించి చేసిన పని కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను” అని నారిమన్, కరణ్ ధాపర్ కార్యక్రమం ‘డెవిల్స్ అడ్వొకేట్’ లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

పార్లమెంటుపై దాడి కేసు దోషిని ఫిబ్రవరి 9 తేదీన ఉరితీయనున్నారని అతని కుటుంబానికి ‘స్పీడ్ పోస్ట్’ ద్వారా తెలియజేయడం జైలు మాన్యువల్ ప్రకారమే జరిగినా, వారికి ఫోన్ ద్వారా చెప్పకుండా అధికారులను ఆపగలిగినవారు ఎవరూ లేరని ఫాలి నారిమన్ అన్నాడు. “తన డెత్ వారంట్ పైన అఫ్జల్ గురు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాడేమోనని ప్రభుత్వానికి ఇష్టుడైన వ్యక్తి ఎవరైనా భావించి ఉండాలి” అని ఆయన అంచనా వేశాడు.

అఫ్జల్ విగత శరీరాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం పైనా నారిమన్ తన అభిప్రాయం తెలిపాడు. శవాన్ని అప్పగిస్తే భారీ నిరసన ప్రదర్శనలకు దానిని వినియోగిస్తారని ప్రభుత్వానికి నిజంగా భయం ఉన్నట్లయితే జైలు మాన్యువల్ ప్రకారం శవాన్ని తమ వద్దే ఉంచుకోవడం ప్రభుత్వానికి న్యాయబద్ధమేనని ఆయన తెలిపాడు. ప్రజల కనీస అంచనా ప్రమాణాలను అందుకోవడంలో విఫలం కావడం ద్వారా భారత రాజ్యం తనను తాను తగ్గించుకుందా అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానం ఇచ్చాడు.

అఫ్జల్ గురు కుటుంబానికి రాసిన లేఖ

అఫ్జల్ గురు కుటుంబానికి రాసిన లేఖ

“అవును, కానీ ఉద్దేశపూర్వకంగా కాదు. కానీ, అటువంటి ఊహకు రావడం న్యాయబద్ధమే. కనుక ప్రభుత్వం యొక్క ఒక ఇష్టుడైన వ్యక్తికి- జీవితానికి సంబంధించిన మానవతా దృక్కోణాల గురించి ప్రజలకు బోధించే మన మొత్తం వ్యవస్థలోనే ఏదో తప్పు ఉన్నదని చెప్పవలసిన అవసరం ఉంది.” అని నారిమన్ తన నిరసనను సున్నితంగా వ్యక్తీకరించాడు. “హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేను నేరుగా కాకపోయినప్పటికీ పరోక్షంగా బాధ్యుడిని చేయవచ్చు. ఎందుకంటే ఆయన ‘బొత్తిగా మొండివాడు'” అని వ్యాఖ్యానించాడు. “వారసలు హోమ్ వర్క్ చేయలేదు… అది చాలా దురదృష్టకరం. మొత్తం పాలనా వ్యవస్థలోనే ఏదో తప్పు ఉంది” అన్నారాయన.

అఫ్జల్ ఉరి శిక్ష అమలు చేసిన విధానం భారత దేశానికి తలవంపులు తెచ్చిందని నారిమన్ అభిప్రాయపడ్డాడని ‘ది హిందూ’ తెలిపింది.

ఇదిలా ఉండగా తన ఉరికి ముందు తన కుటుంబానికి అఫ్జల్ రాసిన లేఖను ఆయన కుటుంబం పత్రికలకు ఇచ్చింది. సదరు లేఖను ది హిందూ, ఎన్.డి.టి.వి తదితర పత్రికా సంస్థలు స్కానింగ్ చేసి తమ వెబ్ సైట్ల లో ప్రచురించాయి. ఉర్దూలో రాసిన లేఖలో అఫ్జల్ తన మరణం తనకు ప్రతిష్ఠ తెచ్చిందని, ఆ ప్రతిష్టను చూసి గర్వపడాలని, ధైర్యంగా ఉండాలని తన కుటుంబాన్ని కోరాడు. తన చావుతో నష్టం వచ్చిందని అనుకోవద్దని, పశ్చాత్తాపం వద్దనీ కోరాడు. ఫిబ్రవరి 9 తేదీన ఉరి తీసిన అనంతరం ఫిబ్రవరి 11 తేదీన పోలీసులు అఫ్జల్ గురు ఆఖరి ఉత్తరాన్ని వారి కుటుంబ సభ్యులకు పోస్టులో పంపారు. దానిని ఫిబ్రవరి 12 తేదీన అందుకున్నప్పటికీ ఫిబ్రవరి 17 తేదీన మాత్రమే వారు పత్రికలకు విడుదల చేశారు. అఫ్జల్ ని ఉరి తీయనున్నారని సమాచారం ఇస్తూ కేంద్ర హోమ్ శాఖ రాసిన లేఖ మాత్రం ఉరి తీసిన రెండు రోజుల తర్వాత మాత్రమే వారికి చేరింది.

అఫ్జల్ గురు శవం తమకు ఒప్పజెప్పాలని అతని కుటుంబం డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది.

1 thoughts on “అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు

  1. నేరస్తులకు శిక్ష పడాలి అనే విషయం లో అందరిది ఒకటే అభిప్రాయం. అలాగే నేర స్వభావం తీవ్రమైనది అయినా ఉరి శిక్ష మంచిదా కాదా అనే విషయం లో భిన్న అభిప్రాయలు ఉన్నాయి. ఉరి శిక్ష నే ఒక వ్యక్తి కి విధించ గలిగే అత్యంత తీవ్రమైన శిక్ష నా ? .
    ఉరి శిక్ష కు వ్యతిరేకం గా అనుకోవడానికి రెండు కారణాలు,
    శిక్ష మనిషి లో పరివర్తన తేవాలి అంటారు ఉరి శిక్ష లో ఆ అవకాశం లేదు
    జీవితాంతం జైలు గోడల మధ్య ఉండాలి కదా , స్వేచ్చ ను కోల్పోవడం మరణం కంటే తీవ్రమైన శిక్ష కాదా?

వ్యాఖ్యానించండి