మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?


(సోమా చౌధురి జనవరి 9 తేదీన తెహెల్కా పత్రికకు రాసిన వ్యాసం ఇది. తెహెల్కా పత్రికకు ఆమె మేనేజింగ్ ఎడిటర్. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రమ గారు తన వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలే దాదాపుగా ఇందులో వ్యక్తం అయ్యాయి. ప్రధాన స్రవంతి లోని పత్రికా రచయితలు దేశ సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ మాత్రం ప్రశ్నించడం ఒకింత సంతృప్తి కలిగించినా, ఆంగ్ల పత్రిక కనుక లక్ష్యిత సెక్షన్లను చేరదన్న తెలివిడి నిరాశను కలిగిస్తుంది. తెలుగు బ్లాగర్లకు అందుబాటులో ఉంచితే ఉపయోగం అన్న దృష్టితో యధాతధ అనువాదం చేసి ఇస్తున్నాను. –విశేఖర్)

ఢిల్లీ పారా మెడికల్ విద్యార్ధిని సామూహిక అత్యాచారంపై వెల్లువెత్తుతున్న క్రోధ జ్వాలలు ఆహ్వానించదగినవి. అవి మన ఉద్వేగాల వెల్లడికి దారి చూపేవి. కానీ అవి భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. దిద్దుబాటులు ఏమీ జరగకుండానే ఇవి క్రమంగా అదృశ్యం అవుతాయని భయం వేస్తోంది. కానయితే మనమంతా ఎదుర్కోవాల్సిన ప్రశ్న కూడా ఒకటుంది: మనలోని క్రోధం నిద్ర లేవడానికి మాటల్లో చెప్ప లేనంతగా అత్యంత పాశవిక ఘటన జరగవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఒక సమాజంగా మన ఉమ్మడి సహన పరిమితి గురించి అదేమని చెబుతోంది? మన అంతరాత్మకి చురుకు పుట్టించడానికి ఇతర వందల అత్యాచారాలు ఎందుకని సరిపోలేదు?

కఠిన వాస్తవం ఏమిటంటే, భారత దేశంలో అత్యాచారాలు దారితప్పి జరిగేవి కావు, విశృంఖలంగా జరిగేవి. దానికి సావకాశం కలిగించే దృష్టి భావం మన మెదడులో స్థిరపడి అతుక్కుని ఉంది. భారతదేశంలో అత్యాచారాలకు దాదాపు సాంస్కృతికంగానే అనుమతి ఇవ్వబడింది. సమాజంలోని ప్రతి పొరలోనూ సాగే మొరటు, అనాలోచిత సంభాషణల ద్వారానే అత్యాచారాలకు అవకాశం ఇవ్వబడుతోంది. ఆ సంభాషణలు ఎలాంటివి అంటే మహిళలపై జరిగే నేరాలను మహిళల బాధ్యతా కోణంనుండే అవి చూస్తాయి: వాళ్ళు సరిగా బట్టలు వేసుకున్నారా? వారి వెంట ఒక మగ రక్షకుడు ఉన్నాడా? వారు స్వచ్చమైన ముత్యం లాంటి గుణగుణాలు ఉన్నవారేనా? వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా? …ఇలా.

అత్యంత అనాగరిక క్రౌర్యానికి ఆ నవ యవ్వన యువతి బలైనందునే ప్రతి ఒక్కరూ తీవ్రమయిన కుదుపుకి లోనయ్యారా? అలా యేమీ కాదు. దేదీప్యమాన విద్యుత్ కాంతుల మధ్య మర్యాదస్తులు నివసించే దక్షిణ ఢిల్లీలో ఒక సభ్య నాగరిక యువతి తన మగ స్నేహితుడితో ఉండగా రాత్రి 9:30 గంటలకే ఇలాంటి ఘోర కృత్యం జరగొచ్చన్న భయాందోళన వారిని పట్టి కుదిపేసింది. స్థిరపడిపోయిన శిక్షరాహిత్య భావనను ఇది మరింత తీవ్రం చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ, ఇతర (అత్యాచారాల) సమయాల్లో మన స్పందనలు మొద్దుబారిపోయాయన్న గాభరా పుట్టించే నగ్న సత్యాన్ని కూడా ఇది విప్పి చూపుతోంది. బాగా రాత్రి దాటినాక, చాటుమాటు ప్రదేశాల్లో, (డబ్బు, పలుకుబడి లాంటి) అవకాశాలు లేనివారి పైన అత్యాచారాలు జరిగితేనో లేక ఒంటరిగా ఉన్న, సెక్సీ దుస్తులు ధరించిన మహిళలపైన జరిగితేనో అవి మన క్రోధానికి సరితూగవు! ఎందుకంటే భారతీయులు ఇష్టంగా అట్టిపెట్టుకున్న రెండు భావనలు దానికి తగిన భూమిక ఇచ్చాయి: ఒక స్త్రీ తన తిరుగుబోతుతనంతోనో లేక తెలివితక్కువతనంలోనో అత్యాచారాన్ని తానుగానే ఆహ్వానిస్తుంది; లేదా ఏదో ఒక విధంగా ఆమె ఆటకి అందుబాటులో ఉండేదే.

ఈ అత్యాచారం మనపైన మోపిన లోతైన పరిశీలనలు ఉన్నాయి: మనం దేనిని హింసగా పరిగణిస్తున్నాము? ఒక ఘటనను హింసగా మనం నమోదు చేయాలంటే నిజంగా ఒక మహిళ జననాంగాన్నీ, లోపలి పేగులను చిత్ర వధ చేసి నగ్నంగా రోడ్డు మీదికి విసిరేయాలా? ఒక కేవలమైన అత్యాచారంకంటే సామూహిక అత్యాచారం మాత్రమే మనల్ని ఎందుకు భయపెడుతుంది? ఒక దళిత స్త్రీ, ఒక గిరిజన స్త్రీ లేదా ఒక ఈశాన్య రాష్ట్రాల మహిళ అత్యాచారానికి గురయితే దేశం ఎందుకు షాక్ కి గురై ‘జరిగింది ఇక చాలు’ అని చెప్పదు? భరించగల హత్యలు, భరించ శక్యం కాని హత్యలు అంటూ మనం విడదీసి చూడము; కాని అత్యాచారాన్ని మాత్రం ఎందుకు పొరలు పొరలుగా విడదీసి చూస్తాము?

భారతదేశంలో ఇప్పటికే అత్యాచారాల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. దాని వెనుక కనీసం ఉందని కూడా అంగీకరించని ఒక ఇతర హింసా ప్రపంచమే దాగి ఉందని ఎవరు గుర్తించేది? కేవలం ఒక తెల్ల బస్సులోని హింసోన్మాదులే రేపిస్టులు కానవసరం లేదు: తండ్రులు, భర్తలు, సోదరులు, బాబాయిలు, స్నేహితులు వీరు కూడా. తమ సొంత ఇళ్లలోనే, నాలుగు గోడల మధ్య తమను అసహ్యంగా తాకిన, అభిమానాన్ని భంగపరిచిన, చెప్పలేని విధంగా వేధించిన, అత్యాచారానికి గురయిన కధ –చెప్పినవి, చెప్పనివీ- దాదాపు ప్రతి ఇద్దరిలోనూ ఒక స్త్రీకి ఉంటుంది. దాని గురించి వారు ధైర్యం చేసి చెప్పడం అంటూ జరిగితే, దాన్ని సమాధి చేసి భరించి ఊరుకొమ్మని చెప్పి నోరు మూయిస్తారు. స్త్రీ జీవితంలో అదొక భాగంగా మారిపోయింది. అంకుల్ తనను వేధిస్తున్నాడని ఒక మైనర్ బాలిక పేరు పెట్టి చెప్పడం అంటే అది కుటుంబాన్ని బజారుకి ఈడ్చడమే. ఇక వైవాహిక అత్యాచారాల సంగతి చెప్పుకోవాలంటే అది మన ఊహా శక్తిని దాటిపోతుంది. మహిళలకు సంబంధించి మన పశుత్వ భావనలు ఎంతదూరం వెళ్తాయంటే సమాజం చీదరించుకునే ఒంటరి బతుకుకంటే రేపిస్టును పెళ్లి చేసుకోవడమే ఉత్తమమైన విముక్తి మార్గం అని న్యాయమూర్తులే తరచుగా సలహా ఇస్తున్నారు.

కనుక ఈ భయానక అత్యాచారం మనపైన మోపుతున్న అంచనాలు ఇపుడు మూడు ఉన్నాయి. మహిళలపట్ల అంటువ్యాధి తరహాలో జబ్బు పడ్డట్లు కనిపిస్తున్న తన దృక్పథాన్ని భారత దేశం ఎలా మార్చుకుంటుంది? అత్యాచారాల నివారణకు శక్తివంతమైన నిరోధాలను ఎలా నిర్మించుకోవాలి? పోలీసు, న్యాయ వ్యవస్థల ప్రక్రియలలోకి వెళ్ళడం అంటే రెండోసారి అత్యాచారానికి గురికావడమే అన్న పరిస్ధితిని ఎలా మార్చాలి?

అత్యాచారం చుట్టూ నిర్మించబడి ఉన్న శిక్షలేమి భావనను బద్దలు కొట్టాలంటే కఠినమైన, వేగవంతమైన, దండనాత్మక చర్యలు ఖచ్చితంగా ఉండాలి, సందేహం లేదు. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న భయం శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. కానీ దిద్దుబాటు చర్యల్లో అది ఒకటి మాత్రమే. అదే స్థాయిలో జరగాల్సిందేమిటంటే భారత సమాజంలోని అన్ని స్థాయిలలోనూ లైంగిక విచక్షణను సున్నీతీకరించేందుకు మెరుపు యుద్ధం తరహాలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి: పాఠశాలలు, అంగన్‌వాడీలు, పాప్ సంస్కృతి, గ్రామీణ జాతరలు, పోలీసులు, న్యాయ చట్ట వ్యవస్థలు మొ.న అన్నింటా. ఈ సున్నితీకరించడం (sensitization) కూడా ఎంతగా పితృస్వామిక పదజాలం అంటే, ఆధునికత వైపుగా దృఢ నిశ్చయంతో కూడిన ప్రయత్నం చేయడం మనకి అత్యవసరం. ఒక ప్రక్రియ నడక అనగానే భారతీయులను స్వాభావికమైన అసహనశీలత పట్టి పీడిస్తోంది. తక్షణ దండన, ప్రాయశ్చిత్తం అనే నాటకం పైనే మనం ఎక్కువ మొగ్గు చూపుతాము: దాన్ని కోసేయాలనీ, ఉరి శిక్ష వేయాలనీ… ఇలా. మరణ శిక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న విస్తృత వాదనలను కాసేపు పక్కన పెట్టి, అసలీ కేసులను (ఏదో ఒక) తీర్పు వచ్చేదాకా అయినా ఎవరు తీసుకెళ్తారు అని అడగడమే మనం మర్చిపోతున్నాం.

గతేడు ప్రారంభంలో తెహెల్కా ఒక స్టింగ్ పరిశోధనను ప్రచురించింది. నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR) లో సీనియర్ పోలీసులు అత్యాచారాల గురించి ఏమనుకుంటున్నారో అందులో చెప్పారు. ఎముకల్ని సైతం వణికించే లోతుల్లోకి ఆ పరిశోధన వెళ్లింది. కాని పాలక వ్యవస్థ నుండి ఒక్క చర్యా కరువయింది. పోలీసు అధికారులు తాము ఏ సమాజం నుండి వచ్చారో ఆ సమాజాన్నే ప్రతిబింబించారని వాదనలు చేశారు. అంతకంటే భయం గొలిపేది మనకి మరొకటి ఉండకూడదు మరి!

9 thoughts on “మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?

 1. ఆ మధ్య మన రాష్ట్రంలోనే అర్చన అనే లంబాడీ మహిళ పిల్లలని ఎత్తుకుపోతోందనే అనుమానంతో, ఆమె చేతిలో ఉన్నది ఆమె బిడ్డా, కాదా అనే విషయం తెలుసుకోవడానికి, మాతృత్వ పరీక్ష కోసం ఒక మగ కానిస్టేబుల్ చేత ఆ రొమ్ములు నొక్కించారు. ఈ ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది.

  అసలు విషయం చెపుతాను.ఆ మహిళ ఓ రోజు కల్లు తాగిన మత్తులో తన సొంత బిడ్డని పట్టుకుని ట్రైన్‌లో ప్రయాణం చేస్తోంది. బిడ్డ పాల కోసం ఏడ్చింది. కానీ ఆ మహిళ నుంచి కల్లు వాసన రావడం వల్ల వికారం కలిగి బిడ్డ ఆమె పాలు తాగలేదు. ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఆమె ఆ బిడ్డని ఎక్కడి నుంచో ఎత్తుకువచ్చిందని అనుమానించారు. ఆమెని పట్టుకుని రైల్వే పోలీసులకి అప్పగించారు. స్త్రీకి బిడ్డ పుట్టిన తరువాతే పాల గ్రంథులలో పాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆమె వక్షోజాల నుంచి పాలు వస్తే ఆమె చేతిలో ఉన్నది ఆమె బిడ్డ అని నమ్మొచ్చు అని జనం అనుకున్నారు. ఆమెకి పాలు వస్తున్నాయో, లేదో పరీక్షించమని రైల్వే పోలీసులని కోరారు. రైల్వే పోలీసులలో మహిళా కానిస్టేబుల్‌లు లేకపోవడం వల్ల ఒక మగ కానిస్టేబుల్ చేత ఆమె రొమ్ములు నొక్కించారు. ఆమెకి పాలు వచ్చాయి. ఆమెని వదిలేశారు కానీ మగ కానిస్టేబుల్ చేత మహిళ రొమ్ములు నొక్కించడం, అందుకు అక్కడ ఉన్న జనం ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ పని జనామోదంతోనే జరిగింది కనుక రైల్వే పోలీసులపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

 2. నేను ఈ పుస్తకంలో వ్రాసిన ఒక పేరాగ్రాఫ్‌ని ఉదహరిస్తున్నాను:
  >>>>>
  “మంత్రగత్తెల వేట” యూరోపియన్‌లకి మర్చిపోయిన మధ్య యుగపు సంప్రదాయం కావచ్చు. కానీ ఉత్తర భారత దేశంలో & ఆంధ్ర ప్రదేశ్‌లో అది ఇప్పటికీ కొనసాగుతోన్న సంప్రదాయమే. చత్తీస్‌గఢ్‌లోని లచ్కేరా అనే గ్రామంలో తీరథ్ అనే మహిళ నివసిస్తోంది. ఆమె భర్త వేరే స్త్రీ మీద మోజుతో ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఒంటరిగానే జీవితం కొనసాగించింది. ఒక రోజు ఉదయం ఆమె ఇంటికి పది మంది వచ్చి తలుపు కొట్టారు. ఆమెని పంచాయితీకి రమ్మన్నారు. ఆమె పంచాయితీకి వెళ్ళింది. “నువ్వు మంత్రగత్తెవి కనుక మంత్రగత్తెవి కాదని నిరూపించుకోవాలంటే నిప్పులోకి దూకు” అని అన్నారు. మంత్రాలు అనేవి నిజంగా లేవు కానీ తాను మంత్రగత్తెని కాదు అని నిరూపించుకోవడానికి నిప్పులోకి దూకేంత ధైర్యం ఎవరికి మాత్రం ఉంటుంది? ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలని కూడా పంచాయితీకి తీసుకొచ్చారు. వాళ్ళని కూడా నిప్పులోకి దూకమన్నారు. వాళ్ళు కూడా నిప్పులోకి దూకే ధైర్యం చెయ్యలేదు. వాళ్ళు నిప్పులోకి దూకలేదని వాళ్ళ చేత బలవంతంగా లైవ్ కరెంట్ వైర్‌లు పట్టించారు. వాళ్ళ చేతులు కాలినాయి. వాళ్ళ చేతుల మీద ఏర్పడిన పొక్కులు ఎప్పటికీ తగ్గలేదు. వాళ్ళు మంత్రగత్తెలని ఒక స్థానిక భూతవైద్యుడు చెప్పాడు. ఆ భూతవైద్యుని సలహా ప్రకారం పంచాయితీ ఏర్పాటు చేసి ఆ రకం పరీక్షలు పెట్టారు. లైవ్ కరెంట్ వైర్‌ని పట్టుకుంటే చేతులు కాలుతాయనే సాధారణ నియమాన్ని అడ్డు పెట్టుకుని మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నిరూపించాలనుకున్నారు కొందరు మూర్ఖ శిఖామణులు.
  >>>>>

  ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మన అర్బన్ మిడిల్ క్లాస్‌వాళ్ళు వీటిని విమర్శించకుండా అంధ గార్ధభాలకి దంత దావనం చేశారు కదా.

 3. “మర్యాదస్తులు నివసించే దక్షిణ ఢిల్లీలో ఒక సభ్య నాగరిక యువతి తన మగ స్నేహితుడితో ఉండగా రాత్రి 9:30 గంటలకే ఇలాంటి ఘోర కృత్యం జరగొచ్చన్న భయాందోళన వారిని పట్టి కుదిపేసింది.”
  “బాగా రాత్రి దాటినాక, చాటుమాటు ప్రదేశాల్లో, (డబ్బు, పలుకుబడి లాంటి) అవకాశాలు లేనివారి పైన అత్యాచారాలు జరిగితేనో లేక ఒంటరిగా ఉన్న, సెక్సీ దుస్తులు ధరించిన మహిళలపైన జరిగితేనో అవి మన క్రోధానికి సరితూగవు! ”
  ఈ వ్యాఖ్యలు మరింత లోతుగా, విమర్శనాత్మకంగా లేవూ. ఇవి మద్య తరగతి స్వభావాన్ని బాగా చెబుతున్నాయి.

 4. ఇక్కడ రేప్‌కి గురైంది మెడికల్ కాలేజ్ విద్యార్థిని కాబట్టి రేపిస్ట్‌లని వెంటనే అరెస్ట్ చేశారు. ఇదే ఉత్సాహం పల్లెటూర్లలో దళిత స్త్రీలని రేప్ చేసేవాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ఉండదు. ఆ మెడికల్ కాలేజ్ విద్యార్థినిని రేప్ చేసినవాళ్ళకి మరణ శిక్ష పడితే రేపిస్ట్‌లు ఆ తరగతికి చెందిన అమ్మాయిలని రేప్ చెయ్యడానికైతే భయపడతారు కానీ పల్లెటూర్లలో దళిత స్త్రీలపై రేప్‌లు చేసేవాళ్ళకి ఎలాంటి భయం కలగదు.

 5. ఈ రోజు రాజ్య హింసలో స్త్రీలపై అణచివేత (అత్యాచారం) ఒక భాగం. దీన్ని మధ్యతరగతి ఎప్పుడూ సీరియస్‍గా పరిగణించలేదు. అంతేకాక స్త్రీలకు సంబంధించిన హక్కులు, ఇతర వ్యక్తీకరణలు చాలా వరకూ మధ్యతరగతి ప్రజానీకం నుండే వస్తూ ఉండడం వలన అనివార్యంగా అవి మధ్య తరగతి అవసరాలకు ప్రతిబింబాలుగా తయారవుతున్నాయి. ఇక స్త్రీలకు సంబంధించిన ఎన్.జి.వొ సంస్థలు ఫక్తు ఉన్నత, మధ్య తరగతి స్త్రీల అవసరాలకు పరిమితమవుతున్నాయి, కానీ కిందకు దిగి చూడడం లేదు. ఇవన్నీ ప్రస్తుతం స్త్రీలకు సంబంధించిన పోరాటాలకు, అవగాహనలకు, వ్యక్తీకరణలకు ఉన్న పరిమితులను సూచిస్తున్నాయి. వామ పక్ష సంస్థలకు ఉన్న బలం, ప్రభావం పరిమితమయిపోతూ ఉండడంకూడా ఇక్కడ ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల స్త్రీలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో గుర్తింపు దొరకడంలేదు.

 6. రాజ్య హింసని నేను తీవ్రంగానే వ్యతిరేకిస్తాను. మరి సాధారణ హింసనైనా మధ్యతరగతి అంతగా వ్యతిరేకించిందా అనే ప్రశ్నకి వద్దాం. ట్రైన్‌లలోని రెండో తరగతి పెట్టెలలో టిటిఇ ఉండడు. ఆ పెట్టెలు ఖాళీగా వెళ్తోన్న సమయంలో అక్కడ మహిళా ప్రయాణికురాలు ఒంటరిగా దొరికితే ఆమె నగలు లాక్కోవడమే లేదా ఆమెని రేప్ చెయ్యడమో జరుగుతుంది. రెండో తరగతి పెట్టెలో ప్రయాణించే మహిళ సాధారణంగా లో క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ అయ్యుంటుంది కాబట్టి ఆ పెట్టెలలో జరిగే అత్యాచారాల గురించి ఇంత సీరియస్‌గా ఆలోచించరు. ఢిల్లీ బస్‌లో రేప్‌కి గురైంది ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థిని కాబట్టి హైక్లాస్‌వాళ్ళు తమ వ్యక్తిగత భద్రత కూడా ఏమైపోతుందోనని భయపడిపోతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో మధ్యతరగతివాళ్ళు చేస్తున్న ఆందోళనలు వ్యక్తిగత అభద్రతాభావం నుంచి బయటపడడానికి చేస్తున్నవే కానీ సామాజిక చైతన్యం వల్ల చేస్తున్నవి కాదు.

 7. సామాజిక చైతన్యమనేది ఆకాశం నుండి ఊడి పడదు . అవసరాల నుండే వస్తుంది. ప్రస్తుత అవసరాల నుండి మధ్య తరగతి ప్రకటిస్తున్న ఆందోళనను తప్పు పట్టవలసిన పని లేదు. అయితే అది పట్టించుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి.వాటిని నొక్కి చెప్ప గలగడం వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

 8. సామాజిక చైతన్యానికి వ్యక్తిగత అవసరాలే పునాదులు వేస్తాయి, నిజమే. అలాగని ట్రైన్‌లో రెండో తరగతి ప్రయాణికురాలిపై రేప్ జరిగినప్పుడు మధ్యతరగతివాళ్ళు ఆందోళన చెందకుండా ఉండిపోయి రిజర్వేషన్ పెట్టెలో రేప్ జరిగినప్పుడు మాత్రమే ఆందోళన చెందాలా? తమ దాకా వస్తే గానీ ఏదీ పట్టించుకోని మెటాఫిజికల్ ఆలోచనా విధానంతోనే ఉంటూ సామాజిక చైతన్యాన్ని ఎంత వరకు పెంచుకోగలం?

 9. మనిషి సామాజిక జీవి కనుక సమాజంపై బాధ్యత కలిగి ఉండాలి. మన సమాజం అభివృద్ధి చెందలేదు. మనం ఇంకా వ్యక్తివాద స్థాయిలోనే ఉన్నాం. నిజమే. కానీ ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించడానికి మనం ప్రయత్నించకపోతే అది కగలదు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s