ప్రజా ప్రతిఘటనకు ప్రతిరూపంగా హైవే నడిబొడ్డున నిలిచిన చైనా ఇల్లు


ప్రజల కనీస అవసరాలపై కూడా ఆధిపత్యం చెలాయించే ధనికవర్గ ప్రభుత్వాలకు ప్రజాసామాన్యం ఇచ్చే ప్రతిఘటనకు సంకేతాత్మక రూపం ఈ ఇల్లు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్ లింగ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కోసం ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇటీవలే నిర్మించుకున్న తన ఇంటిని కూల్చడానికి అంగీకరిస్తూ సంతకం పెట్టడానికి ఓ వృద్ధ జంట నిరాకరించడంతో ప్రధాన రోడ్డు నడి మధ్యలో ఈ ఇల్లు ఇలా నిలబడిపోయింది. యాజమానుల అంగీకారం లేకుండా ఇల్లు కూల్చివేయడానికి వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం చేసిన కొత్త చట్టం లువో బావో జెన్ దంపతులకు అక్కరకు వచ్చింది. నవంబరు చివర పత్రికలకు ఎక్కిన ఈ ఇంటి ఫోటోలు ఇంటర్నెట్ లో విపరీతమైన ప్రచారాన్ని దక్కించుకున్నాయి.

ఇండియాలో లాగానే చైనాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు ప్రభుత్వాల అండతో రైతుల భూములనూ, పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లనూ ఆక్రమించుకుని ల్యాండ్ మాఫియాగా అవతరించడం నూతన ధనికవర్గాల లక్షణంగా ఉన్నది. స్ధానిక ప్రభుత్వాలు తరచుగా బలవంతంగా ఇళ్ల స్ధలాలనూ, ఇళ్లనూ లాక్కోవడం, జనం తీవ్ర స్ధాయిలో ప్రతిఘటిస్తూ ఆందోళనలు చేయడం మామూలు వ్యవహారంగా మారింది. రెండు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వాలు దూకుడుగా అమలు చేసిన ఆర్ధిక సంస్కరణల విధానాలు కమ్యూనిస్టు పార్టీ ముసుగులో ఉన్న ధనికవర్గాలనూ, ప్రభుత్వ, పార్టీల అధికారులను శతకోటీశ్వరులుగా మార్చివేశాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్నతస్ధానాలను ఆక్రమించిన పెట్టుబడిదారీ వర్గం తమచేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించుకుని సంపదలను కొద్దిమందివద్దనే కేంద్రీకరింపజేశారు. ఈ ప్రక్రియకు దేశవ్యాపితంగా ఎదురవుతున్న ప్రతిఘటనకు ప్రతిరూపం వెన్ లింగ్ లోని బావో జెన్ దంపతుల ఇల్లు.

తాము లేనప్పుడు ఇంటిని కూల్చేస్తారన్న భయంతో 24 గంటలూ ఆ చివరా, ఈ చివరా ఉన్న గదుల్లో పడుకుని వృద్ధ దంపతులు కాపలా కాస్తున్నారని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. సాధారణ ప్రజల ఆస్తులు లాక్కునే స్ధానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారికి నష్టపరిహారం అత్యంత తక్కువ మొత్తంలో నిర్ధారించడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దానితో ప్రభుత్వాధికారులకూ, ఇళ్ల యజమానులకూ తరచుగా ఘర్షణలు తలెత్తున్నాయి. పోలీసుల అణచివేతకు దారితీసి హింసాత్మక స్వాధీనాలతో ముగుస్తున్నాయి. ఇలా ఇళ్ల స్వాధీనాన్ని గట్టిగా ప్రతిఘటించే యాజమానుల ఇళ్లను ‘నెయిల్ హౌసెస్’ (nail houses) గా పిలవడం చైనాలో పరిపాటి. అధికారం అనే సుత్తికి లొంగని మేకులుగా ఇలాంటి ఇళ్ల యజమానులను సూచిస్తూ ఈ పేరుతో పిలుస్తున్నారు.

మేకు ఇళ్ల యజమానులు తరచుగా హింసాత్మక ప్రతిఘటనకు దిగుతున్నారని హఫింగ్టన్ పోస్ట్ తెలిపింది. కొంత మంది యజమానులు బలవంతపు స్వాధీనాన్ని నిరసిస్తూ తమను తాము తగలబెట్టుకుంటున్నారు. ప్రతిక్షణం కుటుంబ సభ్యుల్లో ఒకరు మెలకువగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఇల్లు బుల్ డోజర్ల బారిన పడకుండా చైనీయులు కాపాడుకుంటున్నారు. బావో జెన్ ఉంటున్న గ్రామం 1600 మంది నివసించే చిన్న గ్రామం. ఈ గ్రామాన్ని మొత్తం చదును చేసి కొత్త బిజినెస్ డిస్ట్రిక్ట్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. మెజారిటీ యజమానులు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తీసుకోవడానికి అంగీకరించారనీ 67 యేళ్ళ లువో బావో జెన్ తో పాటు మరికొందరు ఒప్పుకోలేదనీ స్ధానిక అధికారులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.

600,000 యువాన్లు (95,000 డాలర్లు) ఖర్చు పెట్టి లువో ఇటీవలనే తన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు స్వాధీనం చేసుకున్నందుకుగాను ప్రభుత్వం అతనికి కేవలం 220,000 యువాన్లు (35,000 డాలర్లు – ఇండియాలో ఇది చాలా ఎక్కువ) మాత్రమే ఇవ్వజూపింది. ఆ మొత్తాన్ని లువో ఒప్పుకోలేదు. ఈసారి మొత్తాన్ని 260,000 యువాన్లకు పెంచినప్పటికీ లువో ప్రతిఘటన కొనసాగుతోంది. అతని ఇంటికి అటూ ఇటూ ఆనుకుని ఉన్న ఇళ్లను యంత్రాలతో కూల్చివేసిన అధికారులు లువో ఇంటిని అలాగే ఉండనిచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

శతకోటీశ్వరుల రియల్ ఎస్టేట్ ఆస్తిపరులకు వారి వారి పొలాలపైనా, ఇళ్లపైనా ఉండే పవిత్రమైన ఆస్తి హక్కు సామాన్య ప్రజల వద్దకి వచ్చేసరికి అత్యంత బలహీనంగా మారిపోవడం ప్రపంచవ్యాపితంగా సాధారణ ప్రజలు ఎదుర్కొనే సాధారణ అనుభవం. పెత్తందారుల ఆస్తి హక్కులు కాపాడడానికి లక్ష వంకరలు తిరిగే హైవేలు పేద రైతాంగం బతుకులపైకి మాత్రం నేరుగా, దర్జాగా నడిచివెళ్తాయి. చంద్రబాబు హయాంలో ప్రాణం పోసుకుని, రాజశేఖర రెడ్డి హయాంలో హైద్రాబాద్ చుట్టూ ఉనికిలోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండే చేదు అనుభవం. చైనా ప్రజలు కూడా అదే పరిస్ధితిలో ఉన్నారని లువో ఇల్లు చాటి చెబుతోంది.

2 thoughts on “ప్రజా ప్రతిఘటనకు ప్రతిరూపంగా హైవే నడిబొడ్డున నిలిచిన చైనా ఇల్లు

  1. >>> పెత్తందారుల ఆస్తి హక్కులు కాపాడడానికి లక్ష వంకరలు తిరిగే హైవేలు పేద రైతాంగం బతుకులపైకి మాత్రం నేరుగా, దర్జాగా నడిచివెళ్తాయి.

    చాలా బాగా చెప్పారండీ! మీ వాక్య నిర్మాణం చాలా బాగుంటుంది. (ప్రత్యేకించి ముగింపు దగ్గర!) సచిన్ ఎంతో ఆదర్సనీయమైన పరిపూర్ణ వ్యక్తి అనుకున్న నాకు మీరు చెప్పిన విషయాలు జీర్ణం కావటం లేదు. (నేను క్రికెట్ చాలా అరుదుగా చూస్తాను. ఐనా సరే!) గతం లో మిమ్మల్ని రిజర్వేషన్ల గురించి అడిగాను. మీరు చెప్పినట్టే రిజర్వేషన్ రిజర్వేషన్లు రిజర్వేషన్స్ అని ప్రయత్నించి వెతికాను. ఏమీ దొరకలేదు. దయ చేసి సహాయం చేయండి.

    కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి