సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఆపండి! ఒబామాకు అమెరికన్ల పిటిషన్


సిరియాలో ఆల్-నుస్రా బాంబు పేలుళ్ల భీభత్సం -ఫొటో: టెలిగ్రాఫ్

సిరియాలో ఆల్-నుస్రా బాంబు పేలుళ్ల భీభత్సం -ఫొటో: టెలిగ్రాఫ్

తిరుగుబాటు పేరుతో సిరియాలో మారణకాండకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం ఆపాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం నిర్వహించే వెబ్ సైట్ whitehouse.gov లో ఈ మేరకు వివిధ సెక్షన్ల ప్రజలు ఒక పిటిషన్ నమోదు చేశారు. ముస్లిం టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం పేర్కొన్న ఆల్-ఖైదా సంస్ధకు సిరియాలో తిరుగుబాటు నడుపుతున్న 29 సంస్ధలు విధేయతను ప్రకటించాయనీ, అలాంటి టెర్రరిస్టులకోసం అమెరికా ప్రభుత్వం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు పెట్టడం గర్హనీయమని పిటిషన్ పేర్కొంది. వైట్ హౌస్ వెబ్ సైట్ లో ని “వుయ్ ద పీపుల్” అనే సెక్షన్ లో ఈ పిటిషన్ నమోదయిందని ‘ఇన్ఫో వార్స్ డాట్ కామ్’ తెలిపింది.

పశ్చిమ దేశాలతో పాటు సౌదీ అరేబియా, కతార్, ఈజిప్టు లాంటి ముస్లిం మతఛాందస రాజ్యాల మద్దతుతో సిరియాలో రెండేళ్ళుగా కిరాయి తిరుగుబాటు నడుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న టెర్రరిస్టు సంస్ధల్లో ‘నుస్రా ఫ్రంట్’ ముఖ్యమైనది. 29 వరకూ టెర్రరిస్టు గ్రూపులు ఈ ఫ్రంట్ కింద పనిచేస్తున్నాయి. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో అనేకమంది అమెరికా సైనికులు చనిపోవడానికి నుస్రా ఫ్రంట్ బాధ్యురాలు. పశ్చిమ దేశాల మిలట్రీ కూటమి ‘నాటో’ మద్దతుతో సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ కూల్చివేతకు ప్రస్తుతం ఈ ఫ్రంట్ కృషి చేస్తోంది. సిరియా ప్రభుత్వ బలగాలతో నేరుగా తలపడుతూ బాంబు పేలుళ్లతో వేలాది సిరియా పౌరులను బలితీసుకుంటున్న ఈ టెర్రరిస్టులకు నిధులు, ఆయుధాలు సరఫరా చేయడం వెంటనే ఆపేయాలని పిటిషన్ కోరింది.

“Cease All Funding and Support for Al-Qaeda Terrorists and Extremist Rebels in Syria” అనే టైటిల్ తో నమోదయిన ఈ పిటిషన్ ఇలా పేర్కొంది.

సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆల్-ఖైదా మద్దతు ఇస్తోందని హిల్లరీ క్లింటన్ అంగీకరించింది. ఈ తిరుగుబాటుదారులకు ఒబామా ప్రభుత్వం 200 మిలియన్ డాలర్ల సహాయం అందించింది. ‘మెక్ క్లాచి న్యూస్ పేపర్స్’ వార్తా సంస్ధ ప్రకారం ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ ఆల్-నుస్రా ఫ్రంట్ ఈ గ్రూపుల్లో ఒకటి. సిరియాలో భారీ ఎత్తున ఫ్రంట్ లైన్ పోరాటంలో ఈ గ్రూపు నిమగ్నం అయి ఉందనీ, అనేక టెర్రరిస్టు దాడులను నిర్వహించిందనీ (మెక్ క్లాచీ ద్వారా) తెలుస్తోంది. సిరియా తిరుగుబాటుదారుల్లో మెజారిటీ విదేశీ తీవ్రవాదులేననీ, వారి లక్ష్యం సిరియాలో షరియా చట్టాన్ని నెలకొల్పడమేననీ డాక్టర్ జాక్వెస్ బెరెస్ లాంటి నిస్పాక్షిక పరిశీలకులు చేభ్తున్నారు. ఈ తిరుగుబాటుదారులు అమెరికా జెండాలను తగలబెడుతూ, అమెరికా వ్యతిరేక నినాదాలు ఇస్తూ ఉన్న దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. నేషనల్ డిఫెన్స్ ఆధారైజేషన్ చట్టం ప్రకారం టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం నేరం. అలాంటి కార్యకాలాపాల వల్ల గతంలోనూ 9/11 లాంటి వినాశకర పరిణామాలు ఎదుర్కొన్నాము. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ ఇచ్చే అన్నిరకాల మద్దతును వెంటనే ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.”

వైట్ హౌస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన పిటిషన్ కి కనీసం 25,000 మంది సంతకందారులు నమోదయినట్లయితే దానికి వైట్ హౌస్ స్పందించాల్సి ఉంటుంది. సదరు వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి ఉన్న అమెరికా పౌరులు మాత్రమే అందులో సంతకం చేయడానికి అర్హులవుతారు. సిరియా తిరుగుబాటులో పాల్గొంటున్న 29 టెర్రరిస్టు సంస్ధలు ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ ఆల్-నుస్రా కు విధేయత ప్రకటించిన సమయంలోనే ఈ పిటిషన్ ముందుకొచ్చింది. ఇరాక్ లో అనేకమంది అమెరికా సైనికులను ఆల్-నుస్రా చంపేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత శనివారమే తెలిపింది. తిరుగుబాటుదారుల్లో ఆల్-నుస్రా అనేది కేవలం ఒకే ఒక చెడ్డ సంస్ధ అంటూ అమెరికా ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదని న్యూయార్క్ టైమ్స్ కధనం రుజువు చేసింది.

బషర్ అస్సద్ ని కూల్చాక అమెరికా పైకి తమ పోరాటాన్ని ఎక్కుపెడతామని ఆల్-నుస్రా ప్రకటించిందని మెక్ క్లాచీ వార్తా సంస్ధ తెలిపింది. “అస్సద్ పని పట్టాక మేము అమెరికాతో పోరాడుతాం!” అని సిరియా తిరుగుబాటుదారుడు ఒకరు వ్యాఖ్యానించాడని మెక్ క్లాచి తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఆల్-ఖైదా విజయం సాధించాక అమెరికా వైట్ హౌస్ పై ఆల్-ఖైదా జెండా ఎగరవేసే లక్ష్యంతో పనిచేస్తామని వివిధ తిరుగుబాటు సంస్ధల మిలిటెంట్లు చెబుతున్న వీడియోలు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. సిరియా తిరుగుబాటుదారులు అనేక దారుణ కృత్యాలకు పాల్పడుతున్నారు. టెర్రరిస్టుదాడుల నుండి సామూహిక హత్యాకాండల వరకూ వారు పాల్పడుతున్నారు. సాధారణ పౌరులను ఆత్మాహుతి బాంబర్లుగా మారేలా ఒత్తిడి చేస్తున్నారు. క్రైస్తవ చర్చిలపైన బాంబుదాడులకు పాల్పడుతున్నారు. నిరాయుధ ఖైదీల తలలు నరికేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.

అత్యంత ఘోరమయిన, హాస్యాస్పదమయిన విషయం ఏమిటంటే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటు (విదేశాంగ మంత్రిత్వ శాఖ) ఆల్-నుస్రా టెర్రరిజానికి కూడా సిరియా ప్రభుత్వాన్నే బాధ్యురాలిని చెయ్యడం. ఆల్-ఖైదా అనుబంధ టెర్రరిస్టులతో రెండేళ్లుగా తలపడుతున్న సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ సిరియాలో ఆల్-నుస్రా బలీయం కావడానికి కారకుడని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం ఆరోపించింది. ఆల్-నుస్రా ను టెర్రరిస్టు సంస్ధగా ప్రకటిస్తామనీ, దానిపై ఆంక్షలు విధిస్తామనీ విదేశాంగ శాఖ ఇప్పుడు ప్రకటిస్తోంది. సిరియాలో టెర్రరిస్టులు, లంపెనీ శక్తులు తిరుగుబాటు పేరుతో అమాయక సిరియా ప్రజలను ఊచకోత కోస్తున్నారని అధ్యక్షుడు బషర్ అస్సద్ మొదటినుండి చెబుతూనే ఉన్నాడు. తనవాదనకు మద్దతుగా అనేక సాక్ష్యాలను మీడియా ముందుకు అస్సద్ తెచ్చినప్పటికీ అమెరికా, యూరప్ లు తెలియానట్లు నటించాయి. ఐరాస అధిపతి బాన్ కి మూన్ సైతం నాటో ప్రతినిధిగా వ్యవహరిస్తూ అస్సద్ కూల్చివేతకు పరోక్షంగా పిలుపులిచ్చాడు. అలాంటి అమెరికా ఇపుడు ఆల్-నుస్రా కు తిరిగి అస్సద్ నే బాధ్యుడిగా చేయడానికి బరితెగించింది.

ఆల్-నుస్రా ను టెర్రరిస్టు సంస్ధగా ప్రకటిస్తానని చెబుతున్న అమెరికా ఇతర టెర్రరిస్టు సంస్ధల గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. నిజానికి ఇతర సంస్ధలు కూడా ఆల్-నుస్రాకు మద్దతుదారులే. ఆల్-నుస్రా చెప్పే షరియా చట్టాన్నే అవి కూడా ప్రబోధిస్తాయి. వాటికి కూడా అమెరికా నిధులు అందజేస్తున్నది. ఆల్-నుస్రా మరియు ఇతర టెర్రరిస్టు సంస్ధలకు మద్దతుగా అమెరికా నేతృత్వంలో నాటో దేశాలు త్వరలో సిరియాలో ప్రత్యక్ష జోక్యం చేసుకోబోతున్నాయని వివిధ వార్తా సంస్ధలు ఇప్పటికే చెబుతున్నాయి.

బషర్ అస్సద్ తన ప్రజలపైనే రసాయన ఆయుధాలు ప్రయోగించబోతున్నాడని అమెరికా, యూరప్ లు కాకిగోల ప్రారంభించాయి. ఈ కాకిగోలను పశ్చిమ వార్తా సంస్ధలు చిలవలు పలవలు చేసి ప్రచురిస్తున్నాయి. అస్సద్ ప్రభుత్వం వద్ద ఉన్న రసాయన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి తిరుగుబాటుదారులకు అమెరికా బలగాలు శిక్షణ ఇస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ పేరుతో అమెరికాయే స్వయంగా రసాయన ఆయుధాలను టెర్రరిస్టుల చేతికి ఇచ్చి సిరియాలో ప్రయోగింపజేసి ఆ నెపాన్ని తమపైనే నెట్టివేసే కుట్రకు పాల్పడుతున్నదని అనుమానంగా ఉన్నదంటూ అస్సద్ కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్యసమితికి లేక కూడా రాసినట్లు తెలుస్తున్నది.

ప్రాణాంతక రసాయన ఆయుధాలను ప్రయోగించిన నీచ చరిత్ర అమెరికా, యూరప్ దేశాలకు తప్ప మరొకరికి లేదు. వియత్నాం యుద్ధంలోనూ, ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలలోనూ నాపాం, తెల్ల భాస్వరం బాంబులు ప్రయోగించిన చరిత్ర అమెరికా సొంతం. పరిమిత స్ధాయిలో అణు వ్యర్ధాలను కూడా ఇరాక్ ప్రజలపై అమెరికా ప్రయోగించినట్లుగా పరిశోధనాత్మక పత్రికలు గతంలో వెల్లడి చేశాయి. అటువంటి అమెరికా సిరియా ప్రజలపై కూడా రసాయన ఆయుధాలను ప్రయోగించడం, ఆ తప్పుని సిరియా అధ్యక్షుడిపైకి నెట్టడం అత్యంత తేలికగా చేయగలదనడంలోలో సందేహం లేదు.

వ్యాఖ్యానించండి