ప్రభుత్వాలు కూడా ఖాఫ్ పంచాయితీలేనా? -కార్టూన్


Cartoon from ‘The Hindu’

“నిన్ను ఇప్పటికిప్పుడే బదిలీ చేసేశాం. ‘అవినీతి’ కులాన్ని నువ్వు గాయపరిచావు”

వాద్రా భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా లాండ్ రిజిష్ట్రేషన్ ఉన్నతాధికారి ‘అశోక్ ఖేమ్కా’ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దానికి హర్యానా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలే కారణమని ప్రభుత్వం ఇప్పుడు బొంకుతోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ‘విచక్షణాధికార హక్కు’ అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అశోక్ బదిలీని సమర్ధించుకున్నాడు. బదిలీ పై విమర్శలు వెల్లువెత్తడంతో ఇపుడు హైకోర్టు ఆదేశాలతోనే బదిలీ చేశామని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది.

అయితే హై కోర్టు ఇచ్చిన ఆదేశం అశోక్ గతంలో చేసిన ఫిర్యాదుకు సంబంధించినది. ‘లాండ్ కన్సాలిడేషన్ అండ్ లాండ్ రికార్డ్స్’ విభాగానికి డైరెక్టర్ జనరల్ గానూ, లాండ్ రిజిష్ట్రేషన్ విభాగానికి ఇనస్పెక్టర్ జనరల్ గానూ ఉన్న అశోక్ కు సబ్ జూనియర్ అధికార పదవి అయిన ‘స్పెషల్ కలెక్టర్’ బాధ్యతలను కూడా కట్టబెట్టింది. ఈ ‘స్పెషల్ కలెక్టర్’ బాధ్యతలనుండి తప్పించాలని అశోక్ విన్నవించుకోవడంతో కోర్టు ఆ మేరకు అంగీకరించి ఆదేశాలు జారీ చేసింది. మరోకందుకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని తన నీతిమాలిన బదిలీని సమర్ధించుకోవాలని హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నమాట!

ఖాఫ్ పంచాయితీలకు దేశ రాజ్యాంగం బోధించే సమానత్వ సిద్ధాంతాలతో పనిలేదు. సెక్యులరిస్టు భావాలతో పనిలేదు. స్త్రీలు వంటింటి కుందేళ్లుగా ఉండడమే వారికి ఇష్టం స్త్రీలు భర్త ఆజ్ఞాలకు అణిగిమణికి ఉండాలన్నదే వారి నమ్మకం. “దళితులు మురికిపనులు చేయాలి. భూస్వాములు భూములు స్వాధీనంలో ఉంచుకుని బొక్కాలి. మేధావులు సిద్ధాంతాలు చెప్పాలి. కులాంతర వివావాహాలు సమాజానికి నష్టం. ప్రేమ వివాహాలు కుల వ్యవస్ధకి కలుషితం…” ఇలాంటివే వారి సిద్ధాంతాలు. అందులో న్యాయాన్యాలు ఉన్నా లేకున్నా వారికి అనవసరం. ఆధునిక సమాజం అభివృద్ధి చేసుకున్న ప్రజాస్వామిక విలువలు వారి దురహంకార ఆధిపత్యానికి అడ్డం కనుక తిరస్కరించి దరిదాపుల్లోకి కూడా రాకుండా తరిమి కొడతారు. వీలయితే కొట్టయినా, చంపయినా తమ ఆజ్ఞలను వారు అమలు చేయిస్తారు.

కానీ ప్రభుత్వం అలా కాదు. దానికి ఒక సెక్యులర్ రాజ్యాంగం ఉంది. సమానత్వ విలువలను అది ప్రభోదిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతుంది. మంత్రయినా, ఉన్నతాధికారి అయినా, ఉద్యోగి అయినా ప్రజల జీవనాన్ని సుఖవంతం చేసే పాలనా విధులను నిర్వర్తించేవారే అని చెబుతుంది. దేశ వనరులను నిస్వార్ధంగా వినియోగిస్తూ ప్రజల సొమ్ముని తిరిగి వారికి అప్పజెప్పడమే ప్రభుత్వాల విధి అని చెబుతుంది. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు, అధికారులు ధర్మకర్తలు మాత్రమేననీ వాటిని సొంతానికి వాడరాదని చెబుతుంది. మంత్రులకూ, ప్రభుత్వాధికారులకూ, ఉద్యోగులకూ వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించడానికి తగిన నియమ నిబంధనలను విధించింది.

కానీ జరుగుతున్నదేమిటి? భూములు భూస్వాముల చేతుల్లో భద్రంగా ఉన్నాయి. సహజ వనరులన్నీ ప్రవేటు కంపెనీల వినియోగానికే తప్ప ప్రజలకు అందుబాటులో లేవు. భూస్వాములకు, కంపెనీలకు అవసరం అయితే భూస్వాధీన చట్టాలు వినియోగించి ప్రజల భూములనూ, ఆస్తులనూ, ఇళ్లనూ, నీటినీ కూడా లాక్కుంటున్నారు. దోపిడీదారులకు ఉండే ఆస్తిహక్కుని చట్టాలు సమర్ధవంతంగా కాపాడుతుంటే, సామాన్య ప్రజల ఆస్తిహక్కుని ఆ చట్టాలే లాగేస్తున్నాయి. ఈ వ్యవహారాలకు అడ్డు వస్తున్న అధికారులను, ఉద్యోగులనూ, సంస్ధలను నిర్వీర్యం చేయడమే పనిగా ప్రభుత్వాలు పెట్టుకున్నాయి.

మంత్రి కొడుకు దొమ్మీ కేసులో అరెస్టయితే ఎస్.పి బదిలీ. ఎమ్మెల్యే అవినీతిని విచారిస్తే కలెక్టర్ బదిలీ. కంపెనీకి రెండేకరాల జీవానాధార భూమి అప్పగించకపోతే పోలీసు బలగాలు రెడీ. గాలి గనులని చూడ్డానికి వెళ్తే మాఫియా తుపాకులు ఎదురవుతాయి. కూడంకుళం మా బతుకుల్ని కాజేస్తుంది అని నిరసిస్తే దేశ ద్రోహ చట్టాలు మోపబడతాయి. పోస్కో కంపెనీకి తమలపాకు తోటలు ఇవ్వలేమని చెబితే పారామిలటరీ బలగాలు దిగుతాయి. కాళ్ళకింద భూమిని బాక్సైట్ దోపిడీకి అప్పగించము అని చెబితే సల్వా జూడుం లాంటి ప్రవేటు సైన్యాలను ప్రభుత్వాలే నిర్మిస్తాయి. ఈ ప్రభుత్వం ఎవరిదీ అనడిగితే నక్సలైటు ముద్ర వేసి ఎంకౌంటర్ చేస్తారు. దాడి లేకుండానే ప్రతిదాడుల్లో వేలమంది చనిపోతుంటారు.

భారత దేశంలో ప్రభుత్వానికీ, ఖాఫ్ పంచాయితీకి తేడా ఉన్నదా?

వ్యాఖ్యానించండి