చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ


Ahmadi Nezad in UN General Assembly -Photo: The Hindu

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల నమ్మకాలను అవమానించడానికి వినియోగించడానికి అమెరికా దుర్వినియోగం చేస్తున్నదని ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమాని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఇరాన్ ధిక్కారాన్ని సహించలేని జాత్యహంకార ఇజ్రాయెల్ ప్రతినిధులు నిండు సభనుండి వాకౌట్ చేసి మరోసారి తమ దురహంకారాన్ని చాటుకున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ లను నేరుగా పేరు చెప్పి సంబోధించనప్పటికీ ఆయన లక్ష్యం స్పష్టమేనని పత్రికలు వ్యాఖ్యానించాయి. “ఫేక్ రెజిమ్ యొక్క అణ్వాయుధాలకు సంబంధించి భద్రతా సమితి (సెక్యూరిటీ కౌన్సిల్) లో వీటో పవర్ ఉన్న కొన్ని దేశాలు మౌనంగా ఉండడానికే నిర్ణయించుకున్నాయి. ఇంకోవైపు ఇతర దేశాల శాస్త్ర సాంకేతిక ప్రగతిని అడ్డుకుంటున్నాయి” అని ఇరాన్ అధ్యక్షుడు సమితి వేదికపై మాట్లాడుతూ అన్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ లను అంతర్జాతీయ వేదికలపై ఈ మాత్రం విమర్శించిన మరొక దేశం లేదు. ధిక్కారాన్ని తట్టుకోలేని ఇజ్రాయెల్ ప్రతినిధులు వాకౌట్ అస్త్రాన్ని ఎన్నుకున్నారు.

వందకు పైగా దేశాలనుండి హాజరైన ప్రతినిధులను ఉద్దేశిస్తూ అహ్మది నేజాద్ ప్రసంగిస్తుండగానే జాత్యహంకార ఇజ్రాయెల్ రాయబారి రాన్ ప్రోసొర్ జనరల్ అసెంబ్లీ హాలు నుండి వాకౌట్ చేశాడు. “యూదు ప్రజల భవిష్యత్తుకు తాను ప్రమాదకరమని అహ్మదినెజాద్ మరోసారి చాటుకున్నాడు. మా గతాన్ని కూడా చెరిపేయాలని ఆయన

ఇజ్రాయెల్ ప్రతినిధుల వాకౌట్ -ఫొటో: ది హిందూ

కోరుకుంటున్నాడు” అని ప్రోసోర్ ఒక ప్రకటనలో తెలిపాడని ఎ.పి తెలిపింది. “ఇరాన్ అధ్యక్షుడు లాంటి మూఢులను విస్మరిస్తే ఎంత ప్రమాదమో 3000 యేళ్ళ యూదుల చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా అణ్వాయుధాలు సొంతం చేసుకోవడానికి ఒక్కో అంగుళమూ దగ్గరయ్యేకొద్దీ ఈ ప్రమాదం పెరుగుతోంది” అని ప్రోసోర్ ప్రకటనలో తెలిపాడు.

అయితే వాస్తవానికి మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర దేశం ఇజ్రాయెల్ మాత్రమే. బి.బి.సి ప్రకారం ఇజ్రాయెల్ 300 కి పైగా అణ్వాయుధాలను గుట్టలుగా పేర్చుకుంది. ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రవర్తనపై అంతర్జాతీయ సమాజం చర్యకు దిగినట్లయితే అన్నీ దేశాలపైనా అణు బాంబులు వేయడానికి తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ నాయకులు ప్రకటించినట్లు ప్రెస్ టి.వి లాంటి వార్తా సంస్ధలు తెలిపాయి.

పాలస్తీనాను దురాక్రమించిన ఇజ్రాయెల్ అక్కడి ప్రజలకు ప్రతిరోజూ నరకం చవిచూపిస్తున్నది. ఈ సంగతిని అంగీకరిస్తూనే, అమెరికా, అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్ తరపున వీటో ప్రయోగిస్తూ కాపాడుతూ వస్తున్నది. గాజా ప్రజలపై నిత్యం వాయు, భూతల దాడులు సాగిస్తూ రాళ్ళతో తిరగబడే పాలస్తీనీయులను పశ్చిమ కార్పొరేట్ మీడియా సాయంతో టెర్రరిస్టులుగా దుష్ప్రచారం చేయడంలో ఇజ్రాయెల్ రాజ్యం పేరెన్నిక గన్నది. అలాంటి ఇజ్రాయెల్ ని కాపాడే ఐక్యరాజ్య సమితి ‘రూల్ ఆఫ్ లా’ అంటూ సదస్సు జరిపి నీతులు చెప్పడం ఒక వింత. కాగా ఇరాన్ వద్ద లేని అణుబాంబు యూదులకు, ప్రపంచానికి ప్రమాదం అని చెప్పడం అమెరికా దుర్నీతికి కొనసాగింపు.

‘రూల్ ఆఫ్ లా’ ను ప్రపంచ దేశాలన్నీ అమలు చేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సోమవారం నిర్వహించిన సమావేశంలో సమితి అధిపతి బాన్ కి మూన్ గురువింద నీతులకు పూనుకున్నాడు. 100 కు పైగా దేశాల నుండి మంత్రులు, నాయకులు పాల్గొన్న ఈ సమావేశం, ‘రూల్ ఆఫ్ లా’ పై ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా జరిపిన సమావేశమని ఎపి వార్తా సంస్ధ తెలిపింది. చట్టాలను అందరికీ సమానంగా వర్తించేలా చూడాలని సమితి అధిపతి ‘బాన్ కి మూన్’ ఈ సమావేశంలో పిలుపునిచ్చాడు. ‘రూల్ ఆఫ్ లా’ ను అమలు చేసే వివిధ సంస్ధలను సమర్ధవంతంగా పనిచేయించడంలోనూ, న్యాయాన్ని ప్రజల దరి చేర్చడంలోనూ దేశాల నాయకులు సీరియస్ గా దృష్టి సారించేలా చేయడానికి సమితి సదస్సు పురిగొల్పుతుందని బాన్ ఆశిస్తున్నట్లు ‘ది హిందూ’ తెలిపింది.

అయితే అంతర్జాతీయ పాలనా సంస్ధల్లో ‘రూల్ ఆఫ్ లా’ ను ఉల్లంఘిస్తున్నది అమెరికా, పశ్చిమ రాజ్యాలు కాగా వారికి బాన్ కి మూన్ స్వయంగా వంతపాడుతుండడం జగమెరిగిన సత్యం. సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అంతర్జాతీయ సమాజం ఒకటవ్వాలని ఒక పక్క విచ్ఛిన్నకర పిలుపునిస్తూ మరోపక్క ‘రూల్ ఆఫ్ లా’ కి భంగం కలుగుతున్నదంటూ మొసలి కన్నీరు కార్చడం బాన్ కే చెల్లింది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ చట్టాన్ని సమానంగా అమలు చేయాలని బాన్ కోరాడు. న్యాయాన్ని బలహీనపరిచే రాజకీయ స్వార్ధాన్ని అనుమతించరాదని ఆయన బోధించాడు. అయితే ఈ బోధలు, సూత్రాలు అన్నింటినీ జాతీయంగానే కాక అంతర్జాతీయ స్ధాయిలో కూడా శాయశక్తులా ఉల్లంఘిస్తున్నది అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు మాత్రమే.

One thought on “చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

  1. ఇరాన్‌పై దాడి జరిగితే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి. అప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకే అహ్మదినెజాద్‌కి అంత ధైర్యం.

వ్యాఖ్యానించండి