వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?


భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్ లో వ్యాపారం నిర్వహిస్తున్న హచ్ కంపెనీ కొనుగోలులో వోడాఫోన్ పై ఆదాయ పన్ను శాఖ 11,000 కోట్ల పన్ను డిమాడ్ చేయడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇందుకోసమే ప్రణబ్ ముఖర్జీ ని రాష్ట్రపతి గా సాగనంపారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో చిదంబరం ప్రకటన ప్రాముఖ్యత సంతరించుకుంది.

“వారు (ఆదాయపన్ను అధికారులు) దుడుకు చర్యలు తీసుకోబోవడం లేదు. దుడుకు నిర్ణయాలు తీసుకునేంత చిన్న మొత్తాలు కావివి” అని చిదంబరం విలేఖరులతో అన్నాడు. షోమే కమిటీ సిఫారసులతో పాటు ఇతర అన్నీ అంశాలు పరిగణలో తీసుకున్నాకే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నాడు. అనేక నెలలపాటు చర్చోపచర్చలు సాగించి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నాకే మాజీ ఆర్ధికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు ఇచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు ఆదాయపన్ను శాఖ 11,218 కోట్ల పన్ను కట్టాలని వోడా ఫోన్ కంపెనీకి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంగతిని నూతన ఆర్ధిక మంత్రి చిదంబరం పూర్వపక్షం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

2007లో హచ్-ఎస్సార్ టెలీ కంపెనీని వోడాఫోన్ కొనుగోలు చేసింది. కేమన్ ఐలాండ్ లో ఉన్న పన్నుల చట్టాలను వినియోగించుకోవడానికి పేపర్ కంపెనీ పెట్టి దాని ద్వారా ఈ కొనుగోలు జరిపింది. హచ్ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్న ఇండియాతో సంబంధం లేకుండా భారత ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను ఎగవేయడానికి వోడాఫోన్ ఈ ఎత్తుగడ వేసింది. దీనిని భారత ప్రభుత్వం అనుమతించలేదు. అక్టోబర్ 22, 2010 తేదీన వడ్డీతో సహా 11,219 కోట్లు కేపిటల్ గెయిన్స్ పన్ను కట్టాలని కంపెనీని ఆదేశించింది. పన్నుతో పాటు పెనాల్టీ 7,900 కోట్లు కట్టాలని ఏప్రిల్ 2011 లో ఆదేశించింది. కంపెనీ కోర్టుకి వెళ్లింది. వివిధ దశల్లో విచారణ జరిగాక అంతిమంగా సుప్రీం కోర్టు పన్ను కట్టనవసరం లేదని తీర్పు చెప్పింది. చట్టాలను యాంత్రికంగా అనువదించి, బహుళజాతి కంపెనీల పన్ను ఎగవేతకు మద్దతుగా నిలిచిందని కోర్టు తీర్పుపై పలు విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత ఈ విధమైన పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి, గడిచిన 50 యేళ్లకు వర్తించేలా, ప్రణబ్ ముఖర్జీ గత ఫైనాన్స్ బిల్లులో GAAR (General Anti-Avoidance Rules) చట్టాన్ని ప్రతిపాదించాడు. ఈ చట్టం ద్వారా కంపెనీల పన్ను ఎగవేత కట్టడికి ప్రయత్నం చేశాడు. బ్రిటన్, నెదర్లాండ్స్ లకు చెందిన ఒక్క వోడాఫోన్ కంపెనీయే కాకుండా అమెరికా తదితర దేశాల కంపెనీలు కూడా ఈ నూతన చట్టం పరిధిలోకి వచ్చాయి. ప్రభుత్వానికి 40,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరేందుకు ఈ చట్టం అవకాశం కల్పించింది. కానీ అనేక విదేశీ కంపెనీలకు ఈ చట్టం ఆగ్రహం తెప్పించింది. ఆయా కంపెనీల తరపున వివిధ ప్రభుత్వాలు (అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, మారిషస్, ఫ్రాన్స్ మొ.వి) రంగంలోకి దిగి భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. GAAR అమలు చేయరాదని డిమాండ్ చేశాయి. ప్రణబ్ ముఖర్జీ లొంగలేదు. ఫలితంగా ఆయన ఆర్ధిక మంత్రి పదవి పోగొట్టుకుని మధ్యేమార్గంగా రాష్ట్రపతి గా అవతరించాడు. ‘అజాత శత్రువు’ అని పొగుడుతూ (సి.పి.ఎం తో సహా) పార్టీలన్నీ కలిసి ఆయనను ఎట్టి అధికారాలూ లేని నామమాత్ర పదవికి తరలించాయి.

ప్రణబ్ ముఖర్జీని సాగనంపాక ఆర్ధిక శాఖ కొద్ది రోజులు ప్రధాని చేతికి వెళ్ళి అనంతరం చిదంబరం చేతికి చేరింది. అప్పటినుండీ GAAR చట్టానికి తూట్లు పొడిచే పని ఊపందుకుంది. GAAR చట్టాన్ని సమీక్షించాలంటూ షోమే కమిటీ ని ప్రధాని నియమించాడు. GAAR చట్టం అమలును ఏకంగా మూడేళ్లు వాయిదా వేయాలని షోమే కమిటీ కొద్ది రోజుల క్రితం నిర్ణయం ప్రకటించింది. అంటే వొడాఫోన్ లాగా పన్నులు ఎగవేయడానికి మరో మూడేళ్లు కంపెనీలకు అవకాశం ఇవ్వాలన్నమాట! ఇది కాక అక్టోబర్ 2010 లో ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వులను పునర్మూల్యాంకనం చేయాలంటూ ‘ఫైనాన్స్ యాక్ట్ 2012’ లో సెక్షన్ 119 ను ప్రవేశపెట్టారు. మరోవైపు ఇండియా, నెదర్లాండ్స్ మధ్య కుదిరిన బి.ఐ.పి.ఏ (Bilateral Investment Protection Agreement) ఒప్పందాన్ని ఎత్తిచూపుతూ వోడాఫోన్ కంపెనీ ఇండియాకి ఆర్బిట్రేషన్ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు పై నిర్ణయానికి భారత ప్రభుత్వం ‘ఇంటర్-మినిస్టీరియల్ గ్రూపు’ (ఐ.ఎం.జి) ను ఏర్పరించింది. ఈ విధంగా షోమే కమిటీ, సెక్షన్ 119, ఐ.ఎం.జి నిర్ణయాలను అడ్డుపెట్టుకుని కంపెనీల అనుకూల నిర్ణయాల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని కొన్ని పత్రికలు ఆరోపిస్తున్నాయి.

“సెక్షన్ 119 ఉన్నది. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది. అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా ఉంది. ఆదాయపన్ను అధికారులు ఈ అంశాలన్నీ పరిశీలించాలి… ఈ లోపు షోమే కమిటీ నివేదిక కూడా ఉంది” అని చిదంబరం పత్రికలతో వ్యాఖ్యానించాడు. కాలయాపన కమిటీలు ఏమి తేలుస్తాయో అనేకసార్లు రుజువయింది. షోమే కమిటీ ప్రకటించిన కంపెనీల అనుకూల నిర్ణయాలు తాజా రుజువు. కంపెనీల కోసం పని చేసే మంత్రులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ గ్రూపు నిర్ణయాలు కూడా ఊహించలేనివేమీ కావు. అలాంటి వారి నిర్ణయాల కోసమే ఎదురు చూద్దామని చిదంబరం అభిలషిస్తున్నాడు.

GAAR చట్టం కొద్దిమేరకయినా పన్ను ఎగవేతలను అరికట్టడానికి తెచ్చిన చట్టం. ముఖ్యంగా టాక్స్ ప్లానింగ్ పేరుతో అనేక బహుళజాతి కంపెనీలు పాల్పడుతున్న టాక్స్-ఎవేషన్ నీ, టాక్స్-ఎవాయిడెన్స్ నీ అరికట్టడానికి ఉద్దేశించిన చట్టం. భవిష్యత్తులో జరిగే ఎగవేతలను అరికట్టడంతో పాటు గతంలొ జరిగిన ఎగవేతలను వసూలు చేయడానికి లక్ష్యించిన ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పెట్రోలు సబ్సిడీ బిల్లుని (43,580 కోట్లు) దాదాపు పూర్తిగా భరించే మొత్తం ఇది. అలాంటి చట్టాన్ని వాయిదా వేయించడానికీ, వాయిదా వేసి నీరు గార్చడానికీ మన్మోహన్, చిదంబరం తదితర కంపెనీల మిత్రులు పూనుకున్నారు. అందుకోసం కమిటీలను పురమాయించారు.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలని కంపెనీలకు కట్టబెట్టడంలో ప్రధాని నుండి మంత్రులు, అధికారులు, కమిటీలు కృతనిశ్చయంతో పని చేస్తున్నారు. అందువలన ఫిస్కల్ డెఫిసిట్ పై ప్రధాని, మంత్రులు, ఆర్.బి.ఐ లు ఆందోళన వ్యక్తం చేయడం, మొసలి కన్నీరు కార్చడం ఆపాలి. ఆ పేరుతో  ప్రజలకు ఇచ్చే నామమాత్ర సబ్సిడీలను కత్తిరించబూనుకోవడం మానుకోవాలి. ప్రజలకు నిజాలు చెప్పాలి.   

12 thoughts on “వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

  1. ఈ పోస్టు వలన తేలేది ఏమిటి? ప్రణబ్ బహుళజాతి కంపనీలు ఎగ వేయాలనుకుంటున్న పన్నును GAAR చట్టం ద్వారా అరికట్టాలనేగదా? దానికి ప్రణబ్ ని నిందించడం దేనికి? మంచి పని చేసిన వాడినే గదా రాష్ట్రపతి పదవికి పోటీ పడినపుడు మద్దతు ఇచ్చింది. సిపిఎం ప్రణబ్ ని అజాత శత్రువు అని అనలేదు. విస్త్రుత మద్దతు ఉన్నవాడు అనే అన్నది. అంతే తప్ప ఆయనని పొగడలేదు. ఆ విధంగా ప్రణబ్ కి మద్దతు సరిఅయినదే కదా?

  2. అశోక్ గారూ,

    ఈ పోస్టు లో ఒక అంశం మీరు చెప్పినట్లు ప్రణబ్ ని పొగడడం కాదు. GAAR చట్టం ద్వారా ఆయన భారత ప్రజలకు మేలు చేయాలనుకున్నాడని చెప్పడం కూడా కాదు. GAAR ని రూపొందించడంలో ప్రణబ్ కి ఉన్న లక్ష్యం ఏమిటన్నది నిజానికి ఒకింత విస్తృతాంశం. ఈ ఆర్టికల్ పరిధిలో అది లేదు.

    భారత దేశంలోని పాలకవర్గాల మధ్య అనేక ఘర్షణలు జరుగుతుంటాయి. వివిధ దేశాల సామ్రాజ్యవాదులతో కుమ్మక్కయిన పాలకవర్గాలు తమ మాస్టర్ల మధ్య వైరుధ్యాలను దేశ ఆర్ధిక రంగంలోకి తేవడం ఈ వైరుధ్యాలలో భాగమే. దేశ ప్రభుత్వరంగాన్ని అంటిపెట్టుకుని కొనసాగుతున్న పెట్టుబడిదారీ వర్గాలకూ, విదేశీ పెట్టుబడులకు నేరుగా చెంచాగిరీ చేస్తూ ఒక్క ఉదుటున ప్రపంచీకరణను దేశంలో చొప్పించాలని ఉబలాటపడుతున్న వర్గాలకూ రగులుతున్న వైరుధ్యంలో భాగమే GAAR చట్టం. ఈ చట్టం నిజంగా అమలయితే, ప్రభుత్వ ఖజానాకు డబ్బు సమకూరితే సమకూరవచ్చుగాక. ఆ డబ్బును దేశ ప్రజలకు ఉపయోగపెట్టే ప్రభుత్వాలు దేశాన్ని ఏలుతున్నాయా అన్నది ఒక సమస్య. GAAR చట్టం ద్వారా సమకూరే 40,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకే ఉపయోగపెడుతుందని సి.పి.ఎం భావించి ఆయనకు మద్దతు ఇచ్చిందా అన్నది మరో సమస్య. అసలు ప్రణబ్ కి సి.పి.ఎం ఇచ్చిన మద్దతులో GAAR చట్టాన్ని పరిగణించిందా అన్నది కూడా ఒక అనుమానం.

    ప్రణబ్ ముఖర్జీ మంచితనం ఒక్క GAAR చట్టంలోనే ఉందన్నట్లు మీ వ్యాఖ్య ఉంది. అది నిజం కాదని నా అభిప్రాయం. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితంలో ఆద్యంతం చేసిన సేవలు ఏ వర్గాలకు? సి.పి.ఎం పార్టీ లక్ష్యం కార్మికవర్గం, రైతులు, కూలీలు, ఇతర శ్రామికవర్గాలే అయినట్లయితే ఆ వర్గాలకు ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడయినా సేవలు చేశాడని ఆ పార్టీ భావిస్తున్నదా? కనీసం GAAR చట్టం అయినా భారత దేశ శ్రామికవర్గాలను దృష్టిలో పెట్టుకునే ప్రణబ్ చేశాడని సి.పి.ఎం భావిస్తున్నదా? అలా భావించే ప్రణబ్ ముఖర్జీకి సి.పి.ఎం మద్దతు ఇచ్చిందా? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధి ప్రజలకు సేవలు చేశాడా లేదా అని చూడనవసరం లేదని సి.పి.ఎం భావిస్తే అది ఆ పార్టీ ఛాయిస్ తప్ప ప్రజల ఛాయిస్ కాజాలదు.

    కాంగ్రెస్, ఎస్.పి, బి.జె.పి లతో పాటు అనేక పత్రికలు ప్రణబ్ ను ‘అజాత శత్రువు’ అన్నాయి. సి.పి.ఎం ‘విస్తృత మద్దతు ఉన్నవాడు” అని మాత్రమే అన్నట్లు మీరు చెబుతున్నారు. రెండింటికీ తేడా ఏమిటో చెప్పగలరా? ప్రణబ్ ని పొగడలేదని మీరంటున్నారు. రాష్ట్రపతి పదవి అభ్యర్ధిగా ఆయనకి మద్దతు ఇవ్వడం ఆయనను పొగడడం కంటే ఎక్కువే కదా!

    నిజానికి ఈ ఆర్టికల్ లో నేను చర్చించింది GAAR వల్ల ప్రణబ్ ని సాగనంపారని. ఆయనని సాగనంపిన లక్ష్యాన్ని చిదంబరం నెరవేరుస్తున్నాడని. ఇందులో చిదంబరం పక్కన ప్రణబ్ మంచివాడుగా కనిపిస్తే అది సాపేక్షికత వల్ల వ్యక్తమవుతున్న లక్షణమే తప్ప ఒరిజినల్ లక్షణం కాదు. ప్రణబ్ ముఖర్జీ కి ఒరిజినల్ గా లేని ‘మంచితనం’ లేదా ‘శ్రామిక వర్గాల పక్షపాతం’ అనే లక్షణాన్ని మనమే ఉత్సాహంగా అంటగట్టడం సరికాదేమో. సి.పి.ఎం రాజకీయ నిర్ణయానికి అనువుగా ప్రణబ్ ముఖర్జీ కి ‘మంచి పని చేసినవాడు’ గా ఆమోదం ఇవ్వడం ఒక కమ్యూనిస్టు పార్టీ విధానబద్ధ రాజకీయాలకు విరుద్ధంగా ఉండగలదేమో చూడండి.

    బూర్జువా పార్టీ నాయకుల్లో ‘శ్రామిక వర్గ పక్షపాతాన్ని’ వెతకడం సబబుకాదని మీరు అనబోరని భావిస్తున్నాను. ఒకవేళ అదే చెప్పదలిస్తే శ్రామికవర్గ పక్షపాతం వెతకనవసరం లేని రాజకీయాల్లో ఒక కమ్యూనిస్టు పార్టీ ఎలా చొరబడిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి అలా బూర్జువా రాజకీయాల్లోకి చోరబడడం వల్లనే సామ్రాజ్యవాదులకు, భారత బడా పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాలకు జీవన పర్యంతం సేవలు చేస్తూ వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కి ‘విస్తృత మద్దతు ఉన్నవాడు’ అని సర్టిఫికేట్ ఇవ్వవలసిన అగత్యానికి సి.పి.ఎం చేరిందని నా అభిప్రాయం. శ్రామిక వర్గ రాజకీయాలను వదిలి లేదా విస్మరించి పార్లమెంటరీ రాజకీయాల్లో కూరుకుపోయినందునే, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడంలో ప్రజలకు సంబంధం లేని ప్రయోజనమేదో చూసినందునే సి.పి.ఎం ఆ పరిస్ధితికి నెట్టబడిందని నా అభిప్రాయం.

  3. ‘అజాత శత్రువు’ , ‘విస్తృత మద్దతు ఉన్నవాడు‘ అనే మాటలలో తేడా ఉందని నేను భావిస్తున్నాను. మొదటిది శత్రువులు ఎవరూ లేని వారు అనీ రెండవది ఉన్న వాళ్లలో ఎక్కువ మద్దతు గలవాడు అనీ. సిపిఎం ప్రణబ్ ని శతృవుగా భావించకపోయినట్లయితే బెంగాల్ కు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడని, ఆ విధంగా భావించినందువలననే బెంగాల్ లో ఆయన నిలదొక్కుకోలేదు. సిపిఎం అనుసరిస్తున్న విధానాలు పరిశీలిస్తే నాకయితే అది శ్రామిక వర్గ రాజకీయాలను వదిలినట్లు కనిపించదు. పార్లమెంటరీ రాజకీయాల్లో కూరుకు పోయిందని నేననుకోను. పార్లమెంటుని కూడా పోరాటాలకు ఒక వేదికగానే మార్చుకునే ప్రయత్నమే తప్ప శ్రామిక వర్గ రాజకీయాలను విస్మరించడం కాదు. ఉన్న దాంట్లో ఈరోజు దేశంలో శ్రామిక వర్గ రాజకీయాలను కొంతవరకైనా భుజాన వేసుకున్న రాజకీయ పార్టీలలో సిపిఎం అగ్రభాగాన ఉంది. ఇంతకన్నఘనంగా శ్రామిక వర్గ రాజకీయాలు చేస్తున్న పార్టీ ఏదో మీరే చెప్పవచ్చుకదా?
    అసలు ఆర్టికల్ వ్రాస్తున్నపుడు ఆ బ్రాకెట్లో ’సిపిఎం తో సహా‘ అనే పదం అవసరమే లేదు అనుకుంటున్నాను. ఆ మాట లేకున్నా మీరు వ్రాసిన విషయానికి వచ్చే నష్టం ఏం లేదేమో ఒక సారి పరిశీలించండి. నాకయితే ఏ విధంగానైనా సిపిఎం పైకి ఒక రాయి విసరాలనే రాసినట్లు అనిపించింది. నాకు తోచిన అభిప్రాయాన్ని యధాతథంగా చెబుతున్నందుకు మీకు బాధ కలిగిస్తే క్షమించాలి.

  4. If you believe that CPM is a proletarian party, then read his own writings of Telakapalli Ravi. Telakapalli Ravi remarked Maoists as antisocial elements and Telangana agitators as separatists so many times in his own blog. His opinions are 100% similar to those opinions that are expressed by ruling classes on movements of masses.

  5. అశోక్ గారూ, ప్రణబ్ కి మద్దతు ఇవ్వడంలో సి.పి.ఎం చూసిన శ్రామిక వర్గ ప్రయోజనాలు ఏమిటని నేను అడిగాను. ఆ ప్రశ్నకు ఎందుకో మీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు.

    ప్రణబ్ ని శత్రువుగా చూసినందువల్లనే ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి కాలేకపోయాడనీ, కనీసం నిలదొక్కుకోలేకపోయాడనీ మీరు చెబుతున్నారు. ఇదే లాజిక్ ప్రకారం చూసినట్లయితే ప్రణబ్ ని మిత్రుడుగా చూసినందునే ఆయనకి రాష్ట్రపతిగా సి.పి.ఎం మద్దతు ఇచ్చిందని భావించవచ్చా? ఇంకా చెప్పాలంటే మమత ముఖర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అయిందంటే దానికి కారణం సి.పి.ఎం ఆమెను, ఆమె పార్టీనీ మిత్రులు గా భావించడమేనా?

    పార్లమెంటును పోరాటాలకు వేదికగా చేసుకోవడం అన్నది అనుబంధ సూత్రం తప్ప దానికదే ప్రధాన సూత్రం కాదు. ప్రధాన పోరాటరూపంగా మిలిటెంట్ ప్రజా పోరాటాలు నిర్మిస్తూ, ఎన్నికల పోటీలను ఒక ఎత్తుగడగా మాత్రమే స్వీకరించాలన్నది మార్క్సిస్టు సూత్రం. అరవైయేళ్ల ఆచరణలో సి.పి.ఐ గానీ, నలభై యేళ్ల ఆచరణలో సి.పి.ఎం గానీ పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా ఎటువంటి కార్మికవర్గ, విప్లవ ప్రయోజనాలను ఆ పార్టీలు సాధించాయి?

    పార్లమెంటరీ ప్రభుత్వాల ద్వారా ఏమి సాధించారని ప్రశ్నించినపుడు బూర్జువా రాజ్యాంగ యంత్రం కనుక సాధించేదేమీ లేదని చెప్పడం, ఆకాడికి ఎన్నికల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నిస్తే పార్లమెంటును కూడా పోరాటాలకు వేదికగా మార్చుకునే ప్రయత్నం అని చెప్పడం సి.పి.ఎం కు అలవాటు. మీరు చెప్పిన సమాధానం కూడా అదే.

    శ్రామికవర్గ రాజకీయాలను కొంతవరమైనా భుజాన వేసుకోవడం ఏమిటి అశోక్ గారూ? కార్మికవర్గ రాజకీయాలను పూర్తిగా భుజాన వేసుకోవడానికే గదా కమ్యూనిస్టు పార్టీలను స్ధాపించేది? దోపిడీ వ్యవస్ధల్లో కార్మికవర్గ రాజకీయాలంటే వర్గ పోరాటాలే. అలాంటి వర్గపోరాటాలను కేవలం కొంతవరకు నిర్వహించడం ద్వారా సి.పి.ఎం ఏం చెప్పదలుచుకున్నది?

    ఈ రోజు చూసినట్లయితే అనేక ప్రాంతీయ, జాతీయ బూర్జువా పార్టీలు కూడా అనేక ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం లు నిర్వహిస్తున్నట్లే ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. అరెస్టులు అవుతున్నారు. కొన్నిసార్లు మిలిటెన్సీ కూడా చూపుతున్నారు. అంతమాత్రాన ఆ పార్టీలు కార్మికవర్గ పక్షపాతులనీ, కార్మికవర్గ పొరాటాలను కొంతవరకు భుజాన వేసుకున్నాయని చెప్పవచ్చా? ఉనికి కోసం, ప్రజల్లో స్ధానం పొందడం కోసం సంఘాలు, పార్టీలు ఎన్నైనా చెయ్యొచ్చు గాక! అంతకు మించిన బాధ్యతని, కార్యాచరణనీ కమ్యూనిస్టు పార్టీలు చూపకుండా కార్మికవర్గ రాజకీయాలను మోస్తున్నట్లు అవి చెప్పజాలవని నా అభిప్రాయం.

    ‘సి.పి.ఎం తో సహా’ అన్నానంటే దానికి కారణం ఆ పార్టీని ఇతర బూర్జువా పార్టీలకంటే వేరుగా చూస్తున్నానని అర్ధం. వేరుగా చూడనట్లయితే ‘తో సహా’ అనవలసిన అవసరమే తలెత్తదు. ఇతర పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలూ, కబుర్లు చెప్పవు. అందువల్ల వాటినుండి ఆశించేదేమీ లేదు. సి.పి.ఎం అలా కాదు గదా! ఇతర పార్టీలతోటే సి.పి.ఎం ను కలిపే పరిస్ధితి ఐతే, ప్రత్యేకంగా ‘సి.పి.ఎం తో సహా’ అనవలసిన అవసరం ఉండదు. కాదు గనకనే అలా అనడం. మీ సూచన ప్రకారం సి.పి.ఎం ను కూడా ఇతర అన్ని పార్టీలతో లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నాకా ఉద్దేశ్యం లేదు.

    విమర్శలను రాళ్లుగా మీరు భావిస్తే, అలాంటి రాళ్లు చాలానే ఉంటాయి. దానికి ఆ పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలి. రాయిగా చెప్పేబదులు విమర్శకి ఓపికగా సమాధానం ఇచ్చినట్లయితే ఆ పార్టీ రాజకీయాలు పాఠకులు తెలుసుకునే అవకాశం, ఎంత పరిమితంగానైనా సరే, ఇచ్చినవారవుతారు.

    భారత దేశ రాజకీయాల్లోని ప్రతి అంశంలోనూ కార్మికవర్గ ప్రయోజనాలను కమ్యూనిస్టులు వెతకవలసిందే. ఏ అంశమైనా సరే, కమ్యూనిస్టు విశ్లేషణలకు గానీ, కార్మికవర్గ ప్రయోజనాలకుగానీ అతీతంగా ఉండజాలదు.
    బూర్జువా పార్టీలు ఏ బాధ్యతనూ స్ధిరంగా నెత్తిన వేసుకోవు. వాటి బతుకే మోసం గనుక విమర్శలకు వాటికి లెక్కకాదు. కాని కమ్యూనిస్టు పార్టీలు అలా కాదు. అవి సిద్ధాంతం, ఆచరణల రీత్యా తాము చెప్పే కబుర్లకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీ అని చెప్పాక దానిపైన అన్నివైపులనుండీ బాధ్యతలు మోపబడతాయి. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది. సిద్ధాంతానికి అనుగుణమైన ఆచరణ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నదా లేదా అన్నది నిరంతరం పరీక్షకు గురవుతుంది. దానిలో భాగమే మీరు చెబుతున్న రాళ్లు.

    బాధ అన్నది మర్చిపోండి. అలాంటిదేమీ నాకు లేదు. విషయం ఉన్నంతవరకూ నిరభ్యంతరంగా చర్చించండి. ఎటొచ్చీ సి.పి.ఎం పై వచ్చే విమర్శలకి మీరే సిద్ధంగా ఉండాలి.

    గమనిక: ఇతర మిత్రులకు విజ్ఞప్తి. సి.పి.ఎం పార్టీ పైన గానీ, ఆ పార్టీ మిత్రులపై గానీ చర్చ జరిపేటపుడు విషయం వరకే పరిమితం కావాలని కోరుతున్నాను. వ్యక్తిగత దాడులకు, గుణ గణాల వర్ణనకు, సిద్ధాంత నిబద్ధతపై దాడికి దిగవద్దని కోరుతున్నాను.

  6. ప్రవీణ్ గారు, సి.పి.ఎం కి సిద్ధాంత నిబద్ధత లేదన్న విషయాన్ని సైద్ధాంతికంగా చర్చిస్తేనే ఎక్కువ ఉపయోగం. భారత దేశంలో విప్లవ కార్యాచరణకు సంబంధించి ఆ పార్టీ ప్రకటించిన కార్యక్రమాన్నీ, అనుసరిస్తున్న విధానాలనీ, ఆచరణనూ చర్చకు తెచ్చి సిద్ధాంత నిబద్ధత లేదని చెప్పగలిగితే చర్చకు ఉపయోగపడుతుంది. ఆ వైపు ప్రయత్నం చేయగలరు.

  7. పశ్చిమ బెంగాల్‌లో నయా ఉదారవాద విధానాలని అనుసరించి, ఇతర రాష్ట్రాలలో మార్క్సిజం-లెనినిజం గురించి మాట్లాడితే ప్రజలు ఆ పార్టీని నమ్ముతారా? కార్మిక వర్గాన్ని అధికారంలోకి తెస్తామని బహిరంగంగా ప్రకటించిన మావోయిస్ట్ పార్టీకి దేశంలోని 13 రాష్ట్రాలలో కార్యక్రమాలు ఉన్నాయి (పోలీసుల లెక్కల ప్రకారం). పార్టీ మీటింగ్‌లలో కార్మిక వర్గం అనే పదం ఉపయోగించకుండా పాలక వర్గం చేసే అవినీతిని విమర్శించడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చే CPMకి మూడు రాష్ట్రాలు (కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర)లో అయినా వోట్లు పడడం గొప్పే. CPM గురించి నేను పుస్తకం వ్రాయబోతున్నాను. ఆ పుస్తకం త్వరలో కినిగెలో వస్తుంది.

    ఇట్లు ప్రవీణ్
    నక్కవానిపాలెం, విశాఖపట్నం

  8. మన చర్చ పక్క దారి పడుతుందనుకుంటాను. ప్రణబ్, చిదంబరంల విధానాలె ముఖ్యం. నేను ప్రణబ్ ని సిపిఎం సమర్దించినపుడు ఆయనకు పెద్దపీఠ వేసారన్నారు. ఇప్పుడేమో అతన్ని పనికిరాని పనికిరాని పదవికి) వాడిని చేసారన్నారు. ప్రణవ్ కు మడ్దతు కేవలం ఒక ఎత్తుగడగానె చూడాలి. సిపిఎం విధానాల గురించి ఈ టపాలొ చర్చించడం అంత అవసరం కాదనుకుంటాను. టపాలో సిపిఎం తో సహా అని చేర్చినందునే నేను పై విధంగా చర్చలోకి వచ్చాను. సిపిఎం విధానాల గురించి మరోసారి చూద్దాం.

  9. “మన చర్చ పక్క దారి పడుతుందనుకుంటాను. ప్రణబ్, చిదంబరంల విధానాలె ముఖ్యం.”

    నేను మళ్ళీ ఆర్టికల్, వ్యాఖ్యలు చదివాను. మీరు చెప్పినట్లు చర్చ పక్కదారి పట్టినట్లు నాకు అనిపించలేదు. మీరు లేవనెత్తిన అంశాలే నేను కదా చర్చించినది. కాకపోతే నేను కొంత ఎక్కువ వివరణ ఇచ్చాననుకుంటా. ప్రణబ్, చిదంబరం విధానాలు vis-a-vis సి.పి.ఎం విధానాలు + మీ వ్యాఖ్యలు, ఈ పరిధిలో నా వివరణ ఉన్నది.

    “నేను ప్రణబ్ ని సిపిఎం సమర్దించినపుడు ఆయనకు పెద్దపీఠ వేసారన్నారు. ఇప్పుడేమో అతన్ని పనికిరాని పనికిరాని పదవికి) వాడిని చేసారన్నారు.”

    ఇది నాకు సరిగా అర్ధం కాలేదు. అర్ధం అయినట్లు అనిపిస్తున్నప్పటికీ వైరుధ్యం ఉందంటున్నారు కనుక పూర్తిగా అర్ధం అయ్యాక స్పందిస్తేనే ఉత్తమం అనుకుంటున్నాను.

    “సిపిఎం విధానాల గురించి ఈ టపాలొ చర్చించడం అంత అవసరం కాదనుకుంటాను.”

    అందుకే మీకు ఆ విమర్శ రాయిలా తోచినట్లుంది. కాని మీరు గుర్తించవలసిన విషయం ఒకటుంది. పైన చెప్పినట్లు బూర్జువా పార్టీల లక్ష్యం, సి.పి.ఎం పార్టీ లక్ష్యం రెండూ పార్లమెంటరీ అధికారమే అయినప్పుడు సి.పి.ఎం పార్టీ వామపక్ష సిద్ధాంతాలు చెబుతున్నది గనక ప్రతి అంశంలోనూ ఆ పార్టీ ప్రత్యేక ప్రస్తావనకు నోచుకుంటుంది. అది అనివార్యం. సిద్ధాంతమే దానికి కారణం.

    సి.పి.ఎం విధానాలపై చర్చకోసం మీరు చెప్పినట్లు మరో సందర్భం చూద్దాం.

వ్యాఖ్యానించండి