సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్


స్క్రీన్ షాట్: న్యూస్ స్నిఫర్ నుండి

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్ సైట్ పసిగట్టి వెల్లడి చేసింది.

‘తిరుగుబాటు’ పేరుతో సిరియాలో టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్న సో కాల్డ్ ప్రతిపక్షాలు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరిస్తే గుర్తించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలండే సోమవారం  ప్రకటించాడు. ఈ వార్తను ప్రకటిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక, సిరియా ప్రతిపక్షాలకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ లతో సహా ఏ ఇతర పశ్చిమ దేశమూ ఇంత స్పష్టమైన ప్రకటన చేయలేదని పేర్కొంది. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను రాజీనామా చేయాలని అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాల ప్రభుత్వాలు కోరాయనీ, ప్రతిపక్షాలకు ప్రమాదరహిత సహాయం చేశాయనీ (ఆయుధ సాయం చేయలేదని చెప్పడం) కానీ ఫ్రాన్స్ లాగా ఏకంగా తాత్కాలిక ప్రభుత్వమే ఏర్పాటు చేయాలంటూ చెప్పలేదనీ టైమ్స్ తెలిపింది.

ఈ వార్తలో భాగంగా అమెరికా గూఢచారులు తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా అయ్యేలా చూశారనీ టైమ్స్ తెలిపింది. అంటే ఒక వాక్యంలో ప్రమాద రహిత (non-lethal) సహాయం అమెరికా గూఢచారులు చేశారని చెబుతూనే దాని తర్వాత వాక్యంలోనే ఆయుధాలు కూడా సరఫరా చేశారని రాసేసింది. అయితే 35 నిమిషాల తర్వాత తాను చేసిన ‘వెల్లడింపు’ ను పత్రిక గుర్తించి కొన్ని పదాలు మార్చేసింది. “ఆయుధాలు అందుకోవలసిన తిరుగుబాటు గ్రూపులను గుర్తించడంలో అమెరికా గూఢచారులు సహాయం చేశారన్న” అర్ధం వచ్చేలా పదజాలాన్ని మార్చింది. న్యూయార్క్ టైమ్స్ చేసిన మార్పులను పై ఇమేజ్ లో స్పష్టంగా చూడవచ్చు.  ఎర్ర రంగు హై లైటర్ లో ఉన్న పేరా 19:45:05 (యు.టి.సి) గంటలకు ప్రచురించగా 35 నిమిషాల తర్వాత 20:20:10 గంటలకు అర్ధం మారేలా మార్పులు చేసింది.

మార్పులు చేసిన వాక్యాన్ని మరొకసారి చూస్తే:

మార్పులకు ముందు: “…American intelligence agents have helped funnel arms to rebel groups…”

మార్పుల తర్వాత: “… American intelligence agents have helped to identify the rebel groups that receive arms…”

రెండు పదాలు తొలగించి ఐదు పదాలు కొత్తగా చేర్చి కొత్త అర్ధం వచ్చేలా టైమ్స్ చేసింది.

ఎందుకిలా?

సిరియా కిరాయి తిరుగుబాటుతో తనకు సంబంధం లేదనీ, సిరియా ప్రజలే వారి అధ్యక్షుడిపై తిరుగుబాటు చేస్తున్నారనీ, అది అసలు సిసలైన తిరుగుబాటేననీ అమెరికా, యూరప్ లు చెబుతాయి. అధ్యక్షుడు బారక్ ఒబామా దగ్గర్నుండి జూనియర్ స్ధాయి అధికారుల దాకా సిరియా ప్రజల తిరుగుబాటుని గౌరవించి అధ్యక్షుడు దిగిపోవాలని అదిలింపులు, బెదిరింపులు సాగించడం రోజువారీ తంతు. బ్రిటన్ ప్రధాని కామెరూన్, ఫ్రాన్సు అధ్యక్షుడు హాలండే కూడా సిరియా ప్రభుత్వం పై బెదిరింపులు సాగిస్తున్నవారిలో ఉన్నారు. వీళ్ళు బెదిరింపులతో సరిపెట్టుకోకుండా, తమ గూఢచారులను సిరియాలో దించి టెర్రరిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్, యెమెన్ తదితర దేశాలను అడ్డు పెట్టుకుని టెర్రరిస్టులకు ఆయుధాలు, డబ్బు అందిస్తున్నాయి.

ముస్లిం మతఛాందస ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య కబుర్లతో పని లేదు. సమానత్వం, మానవ హక్కులు లాంటి విలువలను వారెప్పుడూ ప్రవచించరు. వారు చెప్పేదీ, చేసేదీ మత సూత్రాలను అడ్డు పెట్టుకుని ప్రజలను అణచివేయడమే. అయినప్పటికీ పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు తలొగ్గుతాయి గనక వారి దుర్మార్గాలతో అమెరికా, యూరప్ లకు పేచీ లేదు. సిరియా లో ఉన్న ప్రభుత్వం సాపేక్షికంగా మెరుగైన ప్రభుత్వం. సెక్యులర్ పార్టీ అయిన బాత్ పార్టీ సిరియా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ‘ముస్లిం బ్రదర్ హుడ్’ లాంటి మత ఛాందస సంస్ధలపై సిరియాలోని బాత్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుంది. మతఛాందస రాజ్యాల మధ్య ద్వీపాలలాగా ఉన్న సిరియా, లిబియా, ఇరాక్ లాంటి ప్రభుత్వాలు స్వంతంత్ర విధానాలు అమలు చేస్తూ పశ్చిమ దేశాలకు తలొగ్గడానికి నిరాకరించడంతో ఆ దేశాల్లో కిరాయి తిరుగుబాట్లు ప్రేరేపించడానికి అమెరికా, యూరప్ లు బరితెగించాయి.

ఈజిప్టులో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ తో కుమ్మక్కై ప్రజల తిరుగుబాటుని హైజాక్ చేసిన అమెరికా సిరియాలోనూ మతఛాందస టెర్రరిస్టులతో కుమ్మక్కయింది. ముస్లింలు చెప్పుకునే ‘జీహాద్’ ను క్రిమినలైజ్ చెయ్యడంలో సఫలం అయిన అమెరికా, యూరప్ లు అదే జీహాద్ పేరు చెప్పి సిరియా సెక్యులర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్-ఖైదా, తదితర ముస్లిం టెర్రరిస్టు సంస్ధలను కూడగట్టి ‘కిరాయి తిరుగుబాటు’ ప్రేరేపించాయి. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ‘జీహాద్’ చేద్దామని చెప్పి ఆసియా, ఆఫ్రికాల అరబ్, ముస్లిం దేశాల్లోని అనేకమంది యువకులను టెర్రరిస్టు సంస్ధలు కూడగట్టి సిరియాకి తరలించిన విషయాన్ని పత్రికలు అనేకసార్లు వెల్లడి చేశాయి.

‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’ (ఎఫ్.ఎస్.ఎ) పేరుతో కిరాయి తిరుగుబాటుదారులు చెలామణి అవుతున్నప్పటికీ అందులో అనేక గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో అత్యంత ముఖ్యమైనది ఆల్-ఖైదా. ఆల్-ఖైదా లేకపోతే ఎఫ్.ఎస్.ఎ ఇంతకాలం మనుగడ సాగించగలిగేదే కాదని అందరూ అంగీకరించే వాస్తవం. ‘ప్రపంచ టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై ఏకంగా ‘ప్రపంచ స్ధాయి యుద్ధం’ ప్రకటించిన అమెరికా, అదే ఆల్-ఖైదా ని వినియోగించి సిరియా అధ్యక్షుడిని కూలదోయాలని కుట్రలు పన్నుతోంది. (సిరియా కిరాయి తిరుగుబాటులో ప్రధాన పాత్ర ఆల్-ఖైదా దేనని గత నెలలో గార్డియన్ పత్రిక చేసిన వెల్లడి ఇక్కడ చూడవచ్చు.)  అమెరికా, యూరప్ రాజ్యాలకు నీతీ, జాతీ ఉండదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.

అమెరికా, యూరప్ లు సాగించే దురాక్రమణ యుద్ధాలకు, దుర్మార్గ కుట్రలకు ‘న్యాయ బద్ధత’ కల్పించే బాధ్యతను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నిర్వహిస్తాయి. అబద్ధాలు, అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడంలో ఈ కార్పొరేట్ పత్రికలు పండిపోయాయి. ‘గోబెల్స్ ప్రచారం’ అంటూ హిట్లర్ ప్రభుత్వంలోని మంత్రిని ఆడిపోసుకుంటాము గాను పశ్చిమ కార్పొరేట్ పత్రికల ముందు గోబెల్స్ ఎందుకూ పనికిరాడు. గోబెల్స్ ప్రారంభించిన కళను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అత్యున్నత స్ధాయికి అభివృద్ధి చేసాయని చెప్పడం సముచితంగా ఉంటుంది.

గోబెల్స్ కళలో భాగంగా చెప్పిన అబద్ధాల అసలు రూపం పొరబాటున రాసిన వాక్యం వెల్లడి చేయడంతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సవరించుకోబోయి దొరికిపోయింది. సి.ఐ.ఎ నేరుగా సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా గానీ, సి.ఐ.ఎ గానీ ఇంతవరకూ చెప్పలేదు. కానీ అది బహిరంగ రహస్యం. ఇతర స్వతంత్ర వార్తా సంస్ధలు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసిన సత్యమే అది. (అధునాతనమైన స్టింగర్ మిసైళ్లను సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు సి.ఐ.ఎ సరఫరా చేసిన విషయాన్ని బ్రిటన్ పత్రిక మిర్రర్ ఈ నెలలోనే వెల్లడి చేసింది. ఆ వార్త ఇక్కడ చూడవచ్చు.)  అయినప్పటికీ తాము ఇంకా చెప్పని నిజాన్ని పొరబాటునైనా ఎందుకు చెప్పాలన్నదే టైమ్స్ భావించినందున మరకను తుడవబోయి తానే మరకతో దొరికిపోయింది.

నిజానికి సి.ఐ.ఎ ద్వారా సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రికే జూన్ 21 న వార్త రాసింది. అయితే ఈ ఆయుధాలకు సౌదీ అరేబియా, కతార్, టర్కీ లు డబ్బు చెల్లిస్తున్నాయని టైమ్స్ చెప్పింది. (ఆయుధ సరఫరాతో తనకు సంబంధం లేదని టర్కీ కూడా ఇప్పటికీ చెబుతుంది. సిరియాపై అనైతిక యుద్ధానికి దిగిన అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫ్రాన్సు, సౌదీ అరేబియా తదితర దేశాలు తమలో ఉన్న వైరుధ్యాల వల్ల ఒకరి గుట్లు మరొకరు వెల్లడి చేయడం వల్ల కూడా ప్రపంచానికి కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. వైరుధ్యాల వల్లా, పొరపాటుల వల్లా తెలుస్తున్న నిజాలు ‘టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్’ మాత్రమేనన్నది గుర్తించవలసిన విషయం.) ప్రారంభంలో ఇది కూడా అమెరికా గానీ, పశ్చిమ పత్రికలు గానీ చెప్పలేదు. క్రమ క్రమంగా సిరియా ప్రభుత్వంపై ఒక్కో అబద్ధాన్ని నిర్మిస్తూ, దానితో పాటుగా తిరుగుబాటులో తమ పాత్రపై కూడా ఒక్కో నిజాన్ని వెల్లడి చేస్తూ రావడం పశ్చిమ దేశాలు, పత్రికలు అనుసరిస్తున్న ఎత్తుగడ. (లిబియా విషయంలో ఇలాగే చేశాయి) సిరియా ప్రజలపై అధ్యక్షుడు హత్యాకాండ సాగిస్తున్నాడన్న అబద్ధాన్ని శక్తివంతంగా ఎస్టాబ్లిష్ చెయ్యడంలో పశ్చిమ దేశాలు సఫలం కాలేకపోయాయి. చైనా, రష్యాలు సిరియా దురాక్రమణకు అంగీకరించకపోవడం దీనికి ఒక కారణం అయితే, స్వతంత్ర వార్తా సంస్ధలు మునుపటి కంటే ఎక్కువగా చురుకుగా ఉండడం మరొక కారణం.

గుర్తించవలసిన అంశం ఏమిటంటే పరువు తీసే పొరబాటు చెయ్యడం, సరిదిద్దుకోవడం పశ్చిమ కార్పొరేట్ పత్రికలకు కొత్త కాకపోవడమే కాదు, అదసలు వాటికి పరువు సమస్య కాకపోవచ్చు కూడా. బహిరంగ రహస్యాల చుట్టూ పశ్చిమ పత్రికల పరువు సమస్య ఉంటుందంటే అంతగా నమ్మలేని విషయం. అలాంటి పరువు ఎప్పుడయినా పోయేదే. అసలు విషయం ఏమిటంటే తాము ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్న ‘అబద్ధ నిర్మాణం’ ఇలాంటి పొరపాట్ల వల్ల తొట్రుపాటుకి గురవుతుంది. తొట్రుపాట్లు దొర్లినపుడు ‘అబద్ధ నిర్మాణం’ బలహీనపడుతుంది. పరిమిత సంఖ్యలోనైనా పాఠకుల్లో ‘విశ్వసనీయత’ దెబ్బతినడానికి తొట్రుపాట్లు దారి తీస్తాయి. ఇలాంటివి మరిన్ని జరిగితే సమాచార వ్యాపారానికి కూడా నష్టం రావచ్చు. ‘సిరియా ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుకి అమెరికా మద్దతు ఇస్తోంది’ అనే ఒక అందమైన అబద్ధాన్ని నిర్మించే పనిలో ఉన్న పశ్చిమ పత్రికలకు కొన్ని సార్లు చిన్న పోరాపాటే పెద్ద నష్టం జరగవచ్చు. ఆ ఒక్కోసారి అమెరికా సామ్రాజ్య విస్తరణకు కూడా గండి కొట్టవచ్చు. అందుకే వార్త ప్రచురించిన 35 నిమిషాలకే రెండు పదాలు తొలగించి మరో ఐదు పదాలు చేర్చి అర్ధం మార్చివేయడానికి ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రయత్నించింది.

One thought on “సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

వ్యాఖ్యానించండి