ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండానే నిరాహార దీక్ష ముగించిన అన్నా హజారే, తర్వాత మూడు రోజులకే ‘అన్నా బృందం’ రద్దు అయినట్లు ప్రకటించి ఒకింత సంచలనం సృష్టించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటుని సుగమం చేయడానికే అన్నా హాజరే తన బృందాన్ని రద్దు చేసినట్లు ‘ది హిందూ’ వార్త రాసింది. అంటే ఆ వార్తలో సానుకూలత ఉందే తప్ప సంచలన కారకం ఏమీ లేదు. ఒకటో రెండో ఇతర పత్రికలు కూడా అన్నా అభిప్రాయాన్ని ఇదే విధంగా చెప్పినప్పటికీ ఇంకా అనేక పత్రికలు గానీ, చానెళ్ళు గానీ, వ్యక్తులు గాని అన్నా చేసిన ప్రకటన పట్ల తీసుకున్న వైఖరి దానికి కాస్త విరుద్ధంగా ఉంది.
“ఈ రోజు నుండి అన్నా బృందం కార్యకలాపాలను ఆపేస్తున్నాం. జన్ లోక్ పాల్ కోసం పోరాడడానికి అన్నా బృందం ఏర్పాటయ్యింది. ఇక ప్రభుత్వంతో చర్చలు జరపొద్దని కూడా మేము నిర్ణయించాం. ఈ రోజు నుండి ‘టీం అన్నా’ గానీ, ‘టీం అన్నా కోర్ కమిటీ’ గానీ ఉండవు” అని అన్నా తన బ్లాగ్ లో ప్రకటించాడు. ఆయన ఇంకా ఇలా పేర్కొన్నాడు, “జన్ లోక్ పాల్ చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎన్నిసార్లు, ఎంతకాలం నిరాహార దీక్షకు వెళ్ళాలి? దీక్ష మాని ప్రత్యామ్నాయం ఇవ్వాలని ప్రజలు ఇప్పుడు మమ్మల్ని కోరుతున్నారు. అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించదని కూడా నేను భావిస్తున్నాను.”
ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు పై అన్నా బృందంలో విభేధాలు వచ్చినందువల్లనే ఏకంగా బృందాన్నే రద్దు చేయడానికి నిర్ణయం జరిగిందని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారు. బృందంలోని ఒక సభ్యుడు, కర్ణాటక లోకాయుక్త మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే బృందం రద్దు పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయితే, అనుమానాలు నిజం కాదని బృందం సభ్యులు కొందరు చెప్పారు. “ఇది ఉమ్మడి నిర్ణయం… రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై విభేధాలున్నాయనడం అవాస్తవం” అని బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ అన్నాడు.
“కోర్ కమిటీ జన్ లోక్ పాల్ కోసం ఏర్పాటు చేయబడింది. ఆ దశ ముగిసింది… (రాజకీయ పార్టీ కోసం?) ప్రిపరేటరీ కమిటీ ఏర్పాటవుతోంది” అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో రాశాడు. ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నాడని అనేకసార్లు ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ గత అక్టోబర్ లో హిస్సార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సందర్భంలోనే ఇద్దరు సభ్యులు -రాజగోపాల్, రాజేందర్ సింగ్- బృందాన్ని విడిచిపెట్టారు. ఇపుడు మళ్ళీ రాజకీయ ప్రవేశం అనేసరికి బృందంలో విభేధాలు తలెత్తడం సహజంగానే అనేకులు భావిస్తున్నారు.