దుబాయి తీరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన సైనికులు ఒక భారత జాలరిని కాల్చి చంపారు. మరో ముగ్గురు జాలర్లను తీవ్రంగా గాయపరిచారు. హెచ్చరికలు లెక్క చేయకుండా ఒక చిన్న బోటు ‘యు.ఎస్.ఎన్.ఎస్ ర్యాపేహనోక్’ ఓడ వైపుకి వేగంగా దూసుకు వచ్చిందనీ, దానితో రక్షణ కోసం కాల్పులు జరపక తప్పలేదనీ బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్ధావరం (ఫిఫ్త్ ఫ్లీట్) ప్రతినిధి ప్రకటించాడు. చనిపోయినవారు, గాయపడ్డవారు భారతీయులేనని అమెరికా ధ్రువపరిచిందని ‘ది హిందూ’ తెలిపింది. దుబాయ్ లోని భారత రాయబారి నుండి విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ సంఘటనపై నివేదిక కోరినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
ఒక మదపుటేనుగు అడ్డొచ్చిన చెట్టూ, పుట్టా అంతా పెరికి పారేస్తూ కంటికి కనపడిన జీవాలని తొండంతో విసిరేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. పొరబాటున ఎదురొచ్చిన జంతువుని కాలితో తొక్కి పారేస్తోంది. అలాంటి ఏనుగువైపుకి ఒక చీమ వేగంగా దూసుకు వస్తోంది. మదపుటేనుగు కి భయం వేసి దగ్గరికి రావద్దని చీమని హెచ్చరించింది. పాపం ఏనుగు ఘీంకారాలు ఎందుకో చీమకి అర్ధం కాలేదు. హెచ్చరికలు వినకుండా దూసుకు వస్తుండడంతో చీమ ఉద్దేశ్యపూర్వకంగానే తన దగ్గరికి వేగంగా వస్తోందనీ, దాని వల్ల తన ప్రాణాలకి ప్రమాదం ఉందని ఏనుగుకి భయం పట్టుకుంది. దగ్గరికి వచ్చిన చీమని కాలితో కసి తీరా తొక్కి పారేసింది. అది కూడా కేవలం భయంతోనే. అమెరికా చెబుతున్న కధ, సరిగ్గా ఇలాగే ఉంది.
“జెబెల్ ఆలీ పోర్టు సమీపంలో అమెరికా నేవీ ఓడ పై ఉన్న భద్రతా సిబ్బంది హెచ్చరికలను లెక్కచేయకుండా దూసుకు వస్తున్న చిన్న పడవ పై కాల్పులు జరిపారు. యు.ఎస్.ఎన్.ఎస్ ర్యాపేహనోక్ కాల్పులు జరపడానికి ముందు పడవను హెచ్చరించడానికి వరుస స్పందనలు జారీ చేసింది. పడవలోనివారిని అమెరికా సిబ్బంది పదే పదే హెచ్చరించడానికి ప్రయత్నించారు. ఊద్దేశపూర్వకంగా దూసుకు వస్తున్న పడవను వెనక్కి పంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో పడవను బెదిరించడానికి .50 కాలిబర్ మెషీన్ గన్ తో కాల్పులు జరిపారు” అని బహ్రెయిన్ లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ నౌకా స్ధావరం తన ప్రకటనలో తెలిపింది.
ఎ.పి వార్తా సంస్ధ ప్రకారం భారత జాలర్లు ఉన్న పడవపై మిలటరీ గుర్తులేవీ లేవు. పడవలో పౌరులు ప్రయాణిస్తున్నారని తేలికగా గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలో ఇలాంటి పడవలను జాలర్లు ఉపయోగించడం మామూలే. ఇక్కడి అంతర్జాతీయ జలాల్లో బద్ధ శత్రువులైన అమెరికా, ఇరాన్ ల పడవలు, నౌకలు సైతం ఎటువంటి ఉద్రిక్తలు లేకుండా పక్క పక్కనే ప్రయాణం చేయడం సాధారణం. అయినప్పటికీ, భారత జాలర్లను కాల్చి చంపడానికి అమెరికా సైనికులు వెనకాడలేదు.
ఇండియాలోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మత్తయి కి ఫోన్ చేసి సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఆమె హామీ ఇచ్చింది. అమెరికా, యు.ఏ.ఇ ప్రభుత్వ వర్గాలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పూర్తి నిజాలు సేకరిస్తామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత జాలరి మరణం పట్ల యు.ఏ.ఇ ప్రభుత్వం కూడా విచారం వ్యక్తం చేసింది.
ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ ల దురాక్రమణ ఫలితంగా అమెరికా ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంపై సైనిక కేంద్రీకరణ పెంచింది. పశ్చిమాసియాలోని ఆయిల్ వనరులు, దక్షిణాసియాలోని అపార ఖనిజ వనరులపై అది కన్నేసింది. క్రమ క్రమంగా అంతర్జాతీయ యుద్ధ సన్నాహక పరిస్ధితులను భారత దేశం ముంగిటికి అమెరికా తీసుకువస్తోంది. ‘టెర్రరిజంపై యుద్ధం’ పేరుతో దశాబ్దకాలంగా మన పొరుగునే ఉన్న పాకిస్ధాన్ ప్రజల మధ్య తిష్ట వేసి వారికి కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. పశ్చియాసియాలోని పర్షియా ప్రాంతంతో శతాబ్దాలుగా భారత దేశానికి వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఉన్న నేపధ్యంలో అక్కడ అరవై లక్షల మంది భారతీయులు జీవనం సాగిస్తున్నారు. ఆ విధంగా అగ్ర రాజ్య యుద్ధోన్మాదం, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ ల మీదుగా ఇప్పుడు భారత దేశ సముద్ర జలాలకు కూడా పాకింది.
ఈరోజు దుబాయ్ తీరంలో అగ్రరాజ్య సైనిక దురహంకారానికి భారతీయులు బలయ్యారు. రేపు భారత తీరంలోనే ఆ పరిస్ధితి దాపురిస్తుంది. ఎల్లుండి భారత భూభాగంలోనే అంతర్జాతీయ హత్యలు చోటు చేసుకుంటాయి. భారత దేశంలో కూడా సి.ఐ.ఏ గూఢచారులు, అమెరికా ప్రత్యేక బలగాలు రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని అమెరికా సైనికాధికారులు అమెరికా సెనేట్ కమిటీ ముందు చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. వియత్నాం, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, సిరియా లలో అగ్ర రాజ్య కుతంత్రాలు, హత్యాకాండలు, పౌర హననాల గురించి తెలిస్తే భారతీయ యువతులను వివాహం చేసుకుని భారత ప్రజల మధ్యనే సి.ఐ.ఏ తిష్టవేసే రోజులు ఎంతో దూరంలో లేవని గ్రహించవచ్చు.
