ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?


పన్నులు ఎగ్గొట్టడం కంపెనీల హక్కుగా మారింది. బ్రిటన్ లో ఆరు బిలియన్ పౌండ్లు (52.2 వేల కోట్లు) పన్ను ఎగవేయడానికి నిరసనగా బ్రిటిషర్లు ఆందోళన చేస్తున్నదృశ్యం ఇది.

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆర్ధిక మంత్రిత్వ శాఖను చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణలను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. వోడా ఫోన్ లాంటి కంపెనీలు యాభై వేల కోట్లకు పైగా పన్నులు ఎగవేయడానికి ఆస్కారం కలిగించిన లూప్ హోల్ ను పూడ్చడానికి ప్రణబ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గత యాభై యేళ్లకు వర్తించేలా సవరణలను ప్రణబ్ ప్రతిపాదించడంతో జాతీయ, అంతర్జాతీయ ప్రవేటు కంపెనీలు భారత ప్రభుత్వంపై సవణకు వ్యతిరేకంగా తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ఫలితంగానే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి తరిమారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆర్ధిక శాఖ ను తిరిగి చేపట్టిన మన్మోహన్ బుధవారం మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమై ప్రణబ్ సవరణను పరోక్షంగా ప్రస్తావించాడు. సవరణ వల్ల విదేశీ పెట్టుబడులకు ప్రతికూల సందేశం ఇచ్చినట్లయిందన్నట్లుగా మన్మోహన్ వ్యాఖ్యానించాడు. సవరణ వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావారణాన్ని మార్చవలసి ఉందని ఆయన సూచించాడు. “సమీప కాలంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్లను తిరిగి ప్రోది చేయాలి” అంటూ ఆయన ప్రణబ్ సవరణను ప్రస్తావించాడు. “అనేక కారణాలు ఈ సాధారణ నెగిటివ్ మూడ్ కు దోహదం చేశాయి. పన్నుల విషయంలో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాలి” అని మన్మోహన్ సమావేశంలో వ్యాఖ్యానించాడు. పన్నుల సమస్యలంటూ మన్మోహన్ చేసిన ప్రస్తావన ప్రణబ్ సవరణ గురించేనని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

ఇండియా చట్టాలను ఉపయోగించుకుని వోడా ఫోన్ కంపెనీ హచిసన్ కంపెనీ కొనుగోలులో 11,000 కోట్ల పన్నులను ఎగవేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ పన్ను చెల్లించాలని వోడా ఫోన్ ను డిమాండ్ చేయడంతో కంపెనీ కోర్టుకి వెళ్లింది. హై కోర్టు పన్ను చెల్లించవలసిందేనని తీర్పు చెప్పినప్పటికీ, సుప్రీం కోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. కొనుగోలు జరిగిన 2007 లో అమలులో ఉన్న చట్టం ప్రకారం కంపెనీ పన్ను చెల్లించనవసరం లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

దానితో ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ బిల్లులో ఆదాయపన్ను చట్టానికి సవరణ ప్రవేశపెట్టాడు. ఈ సవరణ గత 50 యేళ్లకు వర్తించేలా ప్రతిపాదించాడు. ‘జనరల్ యాంటీ ఏవోయిడెన్స్ రూల్స్’ (GAAR) గా ఈ సవరణని పిలుస్తున్నారు. ‘వోడాఫోన్ టాక్స్’ అని కూడా దీనిని సంబోధిస్తున్నారు. ఈ సవరణ అమలులోకి వస్తే వోడా ఫోన్ కంపెనీ తో పాటు ఇతర ఎగవేత కంపెనీలన్నీ కలిపి 55,000 కోట్లకు పైగా ఆదాయ పన్ను ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుంది. ప్రజలకు బియ్యం, పెట్రోల్, గ్యాస్ తదితర నిత్యావసర సరుకులపైన సబ్సిడీలు ఇవ్వడం వల్ల ‘ఫిస్కల్ డెఫిసిట్’ (బడ్జెట్ లోటు) తడిసి మోపెడవుతోందని మన్మోహన్ తో పాటు ఇతర సంస్కరణాభిలాషులు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కానీ స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నులను వసూలు చేసి ఖజానా నింపే ప్రణబ్ సవరణని మాత్రం సమస్యగా చెప్పడాన్ని బట్టి పాలకులు ప్రజల పక్షం వహించడానికి సిద్ధంగా లేరని, కంపెనీలకే సహకరిస్తారనీ స్పష్టం అవుతోంది.

“ఈ సమయంలో ఆర్ధికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న కాలంలో ఉన్నాం. వృద్ధి రేటు పడిపోయింది; పారిశ్రామక రంగం పనితనం సంతృప్తికరంగా లేదు; పెట్టుబడుల రంగంలో విషయాలు ప్రోత్సాహకరంగా లేవు; ద్రవ్యోల్బణం సమస్య కొనసాగుతోంది. విదేశీ రంగంలో (రూపాయి) మార్పిడి రేటు పట్ల నాకు ఆందోళనగా ఉంది. పెట్టుబడిదారుల సెంటిమెంటు పడిపోగా పెట్టుబడుల ప్రవాహం ఎండిపోతోంది” అని మన్మోహన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులతో వ్యాఖ్యానించాడు. ఈ పరిస్ధితికి ప్రణబ్ ముఖర్జీ సవరణ కూడా ఒక కారణంగా మన్మోహన్ భావిస్తున్నట్లు ‘ది హిందూ’ కధనం ద్వారా తెలుస్తోంది.

ఆర్ధిక శాఖ తిరిగి చేపట్టిన ప్రధాని ప్రజల ఆర్ధిక స్ధితిగతుల గురించీ, దేశంలో ఋతుపవనాలు బలహీనంగా ఉన్న విషయం గురించీ మాట్లాడినట్లు ఏ పత్రికా చెప్పలేదు. ఋతుపవనాలు బలహీనంగా ఉండడంవల్ల ఈ సంవత్సరం వర్షపాతం సాధారణ స్ధాయి కంటే పడిపోతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షాలు తక్కువయితే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాలనీ లేకుంటే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయనీ ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు ఎం.ఎస్.స్వామినాధన్ రెండు రోజుల క్రితమే హెచ్చరించాడు. ఇవేవీ మన్మోహన్ ఆందోళనలో చోటు చేసుకోలేదు. ఆయన ఆందోళనంతా వృద్ధి రేటు, బడ్జెట్ లోటు, ప్రవేటు పెట్టుబడిదారుల సెంటిమెంటు ఇవే తప్ప ప్రజలు కాదు. ప్రవేటు పెట్టుబడిదారుల సెంటిమెంటు గురించి ఆందోళన వ్యక్తం చేయడంలో ముందుండే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఆర్ధికవేత్తలు, వాణిజ్య పత్రికలు ప్రజల సెంటిమెంట్ల గురించి ఎన్నడూ నోరు మెదపరు. ఎన్నికలు వస్తే గనక ప్రజల కుల మతాల సెంటిమెంట్లు, ప్రాంతీయ సెంటిమెంట్లు, తాగుడు సెంటిమెంట్లు, వెండి బంగారం సెంటిమెంట్లు వీరికి బాగా గుర్తుకు వస్తాయి.

ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన GAAR స్వదేశీ, విదేశీ ప్రవేటు పెట్టుబదుదారుల్లో వేడి రగిల్చింది. GAAR సవరణలో కూడా వోడా ఫోన్ టాక్స్ గురించే వీరి ఆందోళన కేంద్రీకృతం అయింది. చట్ట సవరణపైన ప్రపంచ స్ధాయి పెట్టుబడిదారుల అసోసియేషన్లు, దేశీయ కార్పొరేట్ కంపెనీల సంఘాలు తీవ్ర స్ధాయిలో లాబీయింగ్ ప్రారంభించాయి. అమెరికా, బ్రిటన్ లకు చెందిన బడా కంపెనీలు ఈ లాబీయింగ్ లో ప్రముఖ పాత్ర పోషించాయి. అయితే లాబీయింగ్ ఒత్తిడులకు ప్రణబ్ ముఖర్జీ లొంగలేదని ఆయన ఆదాయ పన్ను చట్ట సవరణకే కట్టుబడి ఉన్నాడనీ ‘ది హిందూ’ రెండు రోజుల క్రితం తెలిపింది.

ఈ సవరణ రూపకల్పనలో ఆర్ధికమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.గుజ్రాల్ కూడా ప్రముఖ పాత్రధారి. పెట్టుబడిదారుల ఆందోళన గురించి తాము వివరణ ఇస్తామని, మార్గదర్శక సూత్రాలు ప్రకటిస్తామనీ గుజ్రాల్ గురువారం ప్రకటించాడు. ఆయన ఇచ్చిన వివరణల నుండి దూరం జరగడానికి ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రయత్నించింది. ఫైనాన్స్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ ను ప్రధాని చూడలేదనీ, ఆయన చూసాకే వాటిపై ప్రధాని తన అభిప్రాయం చెబుతాడనీ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. దానర్ధం సవరణలపై వివరణలకు కూడా ప్రధాని అంగీకరించే స్ధితిలో లేడనీ, మొత్తంగా సవరణాలను వెనక్కి తీసుకోవడం పైనే ఆయన ఆసక్తి అనీ కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణ ఎంతవరకు నిజమో వేచి చూడవలసి ఉంది.

వోడా ఫోన్ కంపెనీ కూడా తన లాబీయింగ్ తాను చేస్తోంది. ఫైనాన్స్ బిల్లులో సవరణ ప్రవేశపట్టినప్పటినుండీ ఆర్ధిక శాఖ అధికారులతోనూ, ఆదాయపన్ను అధికారులతోనూ వోడా ఫోన్ కంపెనీ ప్రతినిధులు అధికారులు చర్చోపచర్చలు సాగించారు. గురువారమే కంపెనీ చీఫ్ అనల్జిట్ సింగ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో అరగంట సమావేశం అయ్యాడు. కంపెనీకి ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ ఉంటుందని అహ్లూవాలియా ఆయనకి హామీ ఇచ్చినట్లు పత్రికలు తెలిపాయి. ప్రజా వ్యతిరేక నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడంలో అహ్లువాలియా ‘తీవ్రవాది’గా పేరు పడ్డ విషయం ఈ సందర్భంగా గమనార్హం.

(వొడా ఫోన్ కంపెనీ పన్ను ఎలా ఎగవేసిందీ మరో ఆర్టికల్ లో)

వ్యాఖ్యానించండి