ప్రఖ్యాత జర్మన్ రచయిత గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ ‘పర్సనా నాన్ గ్రాటా’ (ఆహ్వానించ దగని వ్యక్తి) గా ప్రకటించింది. తద్వారా తన జాత్యహంకార బుద్ధిని బహిరంగంగా చాటుకుంది. పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకుని సెటిల్ మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాన్నీ, పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉంటూ ఇరాన్ అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబు దాడులు చేస్తామని ప్రకటించడాన్నీ గంటర్ గ్రాస్ తన కవిత ద్వారా విమర్శించడమే నేరంగా ఇజ్రాయెల్ పరిగణిస్తున్నది.
“What Must Be Said” పేరుతో గంటర్ గ్రాస్ ఏప్రిల్ 4 తేదీన ఒక కవిత రాశాడు. జర్మన్ దిన పత్రిక ‘సడూశ్చ్ జీటుంగ్’ ఆ కవితను ప్రచురించింది. ప్రపంచ శాంతికి ఇజ్రాయెల్ భంగకరంగా మారిందని గంటర్ గ్రాస్ కవితలో పేర్కొన్నాడు. “అణ్వాయుధాలున్న ఇజ్రాయెల్ ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారిందని నేనిప్పుడే ఎందుకు చెబుతున్నాను…. ఎందుకంటే, రేపు చెప్పడం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది గనుక” అని గంటర్ గ్రాస్ పేర్కొన్నాడు.
85 సంవత్సరాల గ్రాస్, జర్మనీలో పెద్ద పేరున్న రచయిత. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రచయిత. ఆయన ప్రతిభ ఒక్క రచనకే పరిమితం కాలేదు. చిత్ర లేఖనం, శిల్ప కళ, పెన్సిల్ డ్రాయింగ్, నవలా రచన, కవిత్వం, నాటక రచన, గ్రాఫిక్ ఆర్ట్ మొదలయిన రంగాల్లో ఆయన నిష్ణాతుడుగా పేరు గాంచాడు. ఆయన మొదటి నవల ‘ది టిన్ డ్రమ్” ప్రఖ్యాతి పొందింది. ఈ నవలతో పాటు ‘కేట్ అండ్ మౌస్’, ‘డాగ్ ఇయర్స్’ నవలలు ఉమ్మడిగా ‘డేంజింగ్ ట్రైలాజీ’ గా పేరు పొందాయి. ఎనభైల్లో ఆరు నెలల పాటు కలకత్తా సందర్శించాడు. కాళికా మాత నాలిక ను స్ఫురిస్తూ ఆయన తన డైరీలో గీసుకున్న అనేక బొమ్మలు “Zunge zeigen” అనే పుస్తకంగా ప్రచురించబడ్డాయి.
ప్రపంచవ్యాపితంగా పేరు ప్రతిష్టలు కలిగిన గంటర్ గ్రాస్ తనను విమర్శించడంతో ఇజ్రాయెల్ వెర్రెత్తిపోయింది. తాను విమర్శలకు గురయినప్పుడల్లా హిట్లర్ కాలంలో జరిగిన ‘హోలోకాస్ట్’ ని గుర్తు చేయడం ఇజ్రాయెల్ కి అలవాటు. ఆ పేరుతో యూరప్ నోరు మూపించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. ‘హోలోకాస్ట్’ పేరు చెప్పగానే యూరప్ దేశాలు, ముఖ్యంగా జర్మనీ నోరు మూతబడిపోతుంది. పాలస్తీనీయులపై జాత్యహంకార దమనకాండను కొనసాగిస్తూ అరవైయేళ్ల క్రితం తమపై జరిగిన జాత్యహంకార హత్యాకాండని గుర్తు చేసి బ్లాక్ బెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ పేరుతో తన దుర్మార్గ విధానాలను సమర్ధించుకుంటుంది.
జర్మనీకి ఇప్పటివరకూ ఉన్న ‘గిల్టీ కాన్షియస్’ ని ఇన్నాళ్ళకు అధిగమించి ఒక ప్రఖ్యాత జర్మన్ రచయిత బహిరంగంగా ఇజ్రాయెల్ ను విమర్శించడం మామూలు విషయం కాదు. ఇక గంటర్ గ్రాస్ చూపిన చొరవను అందిపుచ్చుకుని మరింత యూరోపియన్ ప్రముఖులు ఇజ్రాయెల్ దమన నీతిని ఖండించడానికి ముందుకు వస్తారు. ఇజ్రాయెల్ భయం కూడా అదే. గంటర్ గ్రాస్ కి సమర్ధనగా జర్మనీ అంతటా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఈస్టర్ పీస్ మార్చ్ లలో పాల్గొనడానికి లక్షలాది మంది జర్మన్లు ముందుకు వచ్చారు. తమ మార్చ్ లో భాగంగా ఆఫ్ఘన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్ అణ్వాయుధ బెదిరింపులనీ నిరసిస్తూ నినాదాలిచ్చారు.
ఇరాన్ పై దాడి చేస్తానని ఇజ్రాయెల్ బెదిరింపులు సాగిస్తున్నప్పటికీ ఆ దేశానికి అణు జలాంతర్గాములు ఇవ్వడానికి జర్మనీ సిద్ధపడడాన్ని గ్రాస్ వ్యతిరేకిస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధ నేరాలకు మనం ఇప్పుడే సరఫరాలు అందజేస్తున్నామని ఆయన జర్మనీ సరఫరాను అభివర్ణించాడు. నేరం జరిగాక మామూలు సాకులు పని చేయబోవని హెచ్చరించాడు. అణ్వాయుధ సామర్ధ్యం గల ఐదు డాల్ఫిన్ క్లాస్ జలాంతర్గాములను జర్మనీ ఇజ్రాయెల్ కి సరఫరా చేసింది. అవి కాక ఆరవ జలాంతర్గాము సరఫరా చేయడానికి జర్మనీ సిద్ధంగా ఉంది. దీనిని గ్రాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.
ఆదివారం తన దేశంలోకి అడుగుపెట్టకుండా గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ హోమ్ మంత్రి ‘ఎలి యిషాయ్’ అడ్డుకున్నాడు. పాలస్తీనీయుల హక్కులకు సమర్ధనగా ఇజ్రాయెల్ కు వచ్చే వారీనందరినీ అడ్డుకుని వెనక్కి పంపించినట్లే గ్రాస్ ను కూడా వెనక్కి పంపేశారు. ఆయనను ఇజ్రాయెల్ కు ‘పర్సోనా నాన్ గ్రాటా” గా ప్రకటించారు. పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధా దేశం అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇప్పటివరకూ అంతర్జాతీయ అణు ఇధన సంస్ధ’ కు చెందిన పరిశీలకులను అనుమతించలేదు. అణ్వాయుధాలున్నా ఇజ్రాయెల్ ను వదిలి అమెరికా, యూరప్ లు అణ్వాయుధాలు లేని ఇరాన్ పైన ప్రపంచ శాంతికి భంగం అని చెబుతూ ఇప్పటికీ నాలుగు సార్లు అధికారికంగా ఆంక్షలు విధింపజేశాయి. తాముగా ప్రవేటుగా విధించిన ఆంక్షలకయితే లెక్కే లేదు.