ఇళ్ళల్లో జొరబడి 16 మంది ఆఫ్ఘన్ పౌరులను చంపిన అమెరికా సైనికులు


Kandahar massacreఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు మానవ మాత్రులు ఊహించని స్ధాయికి చేరుకుంటున్నాయి. అమెరికా సైనికుల బృందం ఒకటి కాందహార్ లో ఉన్న తమ స్ధావరానికి సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళలో చొరబడి నిద్రిస్తున్న పౌరులను అమానుషంగా కాల్చి చంపారు. కేవలం ఒక సైనికులు మాత్రమే, అదీ నేర్వస్ బ్రేక్ డౌన్ కి గురయిన సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా కమేండర్లూ, నాటో అధిపతులూ చెపుతున్నప్పటికీ, అది నిజం కాదనీ అమెరికా ప్రత్యేక బలగాలకు చెందిన సైనికులు ఉద్దేశ్య పూర్వకంగానే పౌరులపై సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని ప్రారంభ బీబీసి వార్తలూ, ఆ తర్వాత సి.ఎన్.ఎన్ ప్రచురించిన వార్తలూ తెలియజేస్తున్నాయి. ఆఫ్ఘన్ పౌరులకూ, అమెరికా సైనికులకూ మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టే ఉద్దేశ్యం ఈ హత్యాకాండలో కనిపిస్తోందని కూడా మరికొన్ని వార్తా సంస్ధలు రాస్తున్నాయి. 50 మంది వరకూ పౌరులను అమెరికా సైనికులు చంపారని తాలిబాన్ ఆరోపించినట్లుగా సి.ఎన్.ఎన్ తెలిపింది.

ఆదివారం తెల్లవారు ఝాము 3 గంటలకు ఈ సామూహిక హననం ప్రారంభమయింది. స్టాఫ్ సార్జంట్ గా భావిస్తున్న అమెరికా సైనికుడు సమీపంలో ఉన్న అల్కోజాయ్, నజీబాన్ గ్రామంలో ఉన్న ఇళ్ళల్లో జొరబడి 16 మందిని కాల్చి కంపాడని బీబీసి తెలిపింది. మూడు ఇళ్ళలో జొరబడి సైనికుడు కాల్పులకి దిగాడని అబ్దుల్ బాఖి అనే గ్రామస్ధుడిని ఉటంకిస్తూ ఏ.పి (అసోసియేటేడ్ ప్రెస్) వార్తా సంస్ధ తెలిపింది. తెల్లవారు ఝాము తనకు కాల్పుల శబ్దం వినపడిందనీ, కొంత సేపు నిశ్శబ్దంగా ఉన్నాక మళ్ళీ పెద్ద ఎత్తున కాల్పుల శబ్దం వినపడిందనీ మరి కొంతసేపటికి అదే విధంగా జరిగిందనీ సదరు గ్రామస్తుడు చెప్పాడని ఏ.పి తెలిపింది.

నజీబాన్ గ్రామంలో ఒకే ఇంటిలో 11 మందిని అమెరికా సైనికుడు కాల్చి చంపినట్లు రాయిటర్స్ తెలిపింది. కాల్చి చంపాక మృత దేహాలపైUS soldier kills Afghan civilians 2 రసాయనాలు జల్లి నిప్పు అంటించి పోయాడని చనిపోయిన 11 మంది బంధువు హాజీ సమాద్ విలపిస్తూ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “నా పిల్లలు, మనవళ్లుతో సహా 11 మందిని వాడు చంపేశాడు” అని హాజీ తెలిపాడు. హత్యాకాండ జరుపుతున్న వారిపై కుక్క మొరగడంతో దానిని కూడా కాల్చి చంపారని ఒక మహిళను ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. చాలా రోజులుగా ఇక్కడికి తాలిబాన్ రాలేదని కూడా ఆమె తెలిపింది. వాస్తవానికి ఒక సైనికుడు కంటే ఎక్కువ మందే హత్యా కాండలో పాల్గొన్నారని మరి కొన్ని రిపోర్టులు చెబుతున్నట్లుగా బి.బి.సి పేర్కొంది. అమెరికా ప్రత్యేక బలగాలు ఈ హత్యాకాండలో పాల్గొన్నాయని మొదట రాసిన బి.బి.సి ఆ తర్వాత వార్తల్లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ తెలిపింది. 

“అమెరికా బలగాలు ఉద్దేశ్య పూర్వకంగానే ఆఫ్ఘన్ పౌరులను హత్య చేశాయి. ఇది టెర్రరిస్టు చర్యే. క్షమించడానికి వీలు లేని టెర్రరిస్టు చర్య” అని అమెరికా నిలిపిన కీలుబొమ్మ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పేర్కొన్నాడు. అమెరికా ప్రభుత్వం యధావిధిగా సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. మరికొన్ని రోజులకు ఒబామా ఆపాలజీ చెప్పే అవకాశం లేకపోలేదు. నాటో నేతృత్వం లోని ఇంటర్నేషనల్ సెకూరిటీ అసెస్టెన్స్ ఫోర్స్ (ఐ.ఎస్.ఏ.ఎఫ్) కమేండర్ జాన్ అలెన్ బొంకడంలో మరి కొంత దూరం పోయాఆడు.”ఈ ఘోరకలి ఐ.ఎస్.ఏ.ఎఫ్, (పశ్చిమ దేశాల) కూటమి బలగాలు పాటిస్తున్న విలువలకు గానీ ఆఫ్ఘన్ ప్రజల పట్ల మేము పాటిస్తున్న గౌరవ ప్రపత్తులకు గానీ ఈ మాత్రం ప్రాతినిధ్యం వహించదు” అని ఆయన బొంకాడు. ఆఫ్ఘన్ పౌరులపై ఉన్న అత్యంత గౌరవ మర్యాదల వల్లనే ఆ దేశంపై దురాక్రమించి లక్షల మందిని పొట్టనబెట్టుకుంటూ, సకల మౌలిక సౌకర్యాలను విధ్వంసం కావిస్తూ వచ్చారని ఆఫ్ఘన్ ప్రజలు ఇంకా నమ్మాలి. ఓ పక్క దారుణ హత్యాకాండ సాగిస్తూ, ఇళ్ళల్లో జొరబడి ప్రాణాలు తీస్తూ కూడా ఆఫ్ఘన్ ప్రజలపైనా గొప్ప గౌరవ మర్యాదలున్నాయని అలెన్ చెప్పడానికి సాహసిస్తున్నాడు.

ఇంత చేసినప్పటికీ తన సైనికులు ఎంతమంది ఆఫ్ఘన్లను చంపిందీ చెప్పడానికి అమెరికా, నాటో లు సిద్ధంగా లేవు. పౌరులు చనిపోయారని చెప్పడమే తప్ప ఎంతమందీ వారు చెప్పడం లేదు. అమెరికా సైనికులు జరిపిన హత్యాకాండకి అధికారికి అనుమతి లేదని మాత్రం వారు చెపుతున్నారు. ఆఫ్ఘన్ అధికారులు సంఘటన స్ధలికి వచ్చి 16 మంది మరణించారని చెప్పేవరకూ ఎంతమంది చనిపోయిందీ ఇదమిద్ధంగా బైటికి తెలియలేదు. సంఘటనా స్ధాలాన్ని ఆఫ్ఘన్ ప్రభుత్వ బృందంలో సభ్యుడైన హాజీ ఆఘా లాలై దస్తగిరి ‘చనిపోయినవారి శవాలను నేను చూశాను. చనిపోయిన వారి కుటుంబాలవారిని కలిశాను. మొత్తం 16 మందిని చంపేశారు” అని తెలిపాడు. కాందహార్ రాష్ట్ర కౌన్సిల్ ఉప అధిపతి హాజీ మహమ్మద్ ఎహసాన్ అంతకుముందు 18 మంది చనిపోయినట్లు ప్రకటించాడు.

తాము ఆక్రమించిన దేశాలలో అనేక దారుణ కృత్యాలకు పాల్పడడం అమెరికా సైనికులకు మామూలు సంగతే. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, యెమెన్, పాకిస్ధాన్, వియత్నాం లాంటి దేశాల్లో వారు అనేక దారుణాలకు పాల్పడ్డారు. వియత్నాం లోని ‘మై లాయి హత్యాకాండ’ వారి దుర్మార్గాలకు ఒక మచ్చు తునక మాత్రమే.

My Lai massacre

1968 మార్చి 16 న అమెరికా సైనికులు (1 వ బెటాలియన్, చార్లీ కంపెనీ, 20 వ ఇన్ఫాంట్రీ రెజిమేన్, 11 వ బ్రిగేడ్) వియత్నాం గ్రామాలు ‘మై లాయ్’, ‘మై ఖే’ ల పై దాడి చేసి 504 నిరాయుధ పౌరులను చంపేశారు. చనిపోయినవారిలో అత్యధికులు స్త్రీలు, పిల్లలు, పసివారు, వృద్ధులు. వీరిలో అనేకమందిని కాళ్ళూ, చేతులు, ఇతర శరీర భాగాలను నరికేశారు. 26 అమెరికా సాయినికులపై నేరారోపణ చేసిన అమెరికా ప్రభుత్వం చివరికి వచ్చేసరికి ఒక్కరిపై (సెకండ్ లేఫ్టినెంట్ ఫిలియమ్ కాల్లే) మాత్రమే నేరం రుజువైనట్లు ప్రకటించింది. 22 మంది గ్రామస్దులను చంపాడని రుజువయిందని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అతను కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే, అది కూడా గృహ నిర్భంధంలో, జైలు శిక్ష అనుభవించి బైటికి వచ్చేశాడు.

ఈ హత్యాకాండ గురించి 1969 లో మాత్రమే ప్రపంచానికి తెలిసింది. తెలిసాక ప్రపంచ మంతటా ఆందోళనలు చెలరేగాయి. అమెరికా సైనికుల క్రూరత్వం చూసి ప్రపంచం నిర్హాంతపోయింది. అది చెప్పే మానవ హక్కుల కబుర్లూ, బాలల హక్కుల కబర్లూ, మత స్వేచ్చా కబుర్లూ అన్నీ ఉట్టివేననీ, అమెరికా రాజ్యమే ప్రపంచంలో అతి పెద్ద టెర్రరిస్టు సంస్ధ అనీ ప్రపంచానికి తెలిసి వచ్చింది. అమెరికాలో కూడా వియత్నాం ఆక్రమణకి వ్యతిరేకంగా ఆందోళనలు తలెత్తాయి.

మైలాయ్ గ్రామంపై బడి అమెరికా సైనికులు హత్యా కాండ సాగిస్తుండగా వారిలోనే కొందరు సైనికులు వారిని అడ్డుకున్నారు. గాయపడినవారిని కాపాడడానికి ప్రయత్నించారు. అలా మానవత్వంతో ప్రవర్తించిన సైనికులను మెచ్చుకోవలసిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు దానికి భిన్నంగా వ్యవహరించారు. హత్యాకాండను అడ్డుకున్న సైనికుల వ్యవహారాన్ని కాంగ్రెస్ సభ్యులు ఖండించారు. ఆ తర్వాత చాలా కాలంపాటు మానవతతో వ్యవహరించిన సైనికులు అమెరికాలో వేధింపులకు గురయ్యారు. వారిని ద్వేషిస్తూ అనేక ఉత్తరాలు వారికి వచ్చేవి. చంపుతామన్న బెదిరింపులతో వారు భయబ్రాంతులతో గడిపారు. చచ్చిపోయిన జంతువుల శరీర భాగాలను వారి ఇళ్లముందు పడేసి టెర్రరైజ్ చెయ్యడానికి అనేక నెలలపాటు ప్రయత్నాలు జరిగాయి.

ప్రపంచ ప్రజానీకంపై అమెరికా సైనికులకూ, కాంగ్రెస్, సెనేట్ ల సభ్యులకూ, మొత్తం రాజ్యానికీ ఉన్న గౌరవం ఇలాంటిదే. ఇంత నీచ చరిత్ర ఉన్న అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ప్రజల పట్ల గౌరవం ఉందనీ, వేగంగా దర్యాప్తు చేసి దోషులను బోనెక్కిస్తామనీ నాటో కమేండార్ అలెన్ చెప్పడం పచ్చి బూటకం. ఏ ఉద్దేశ్యమూ లేకుండా, కేవలం నేర్వస్ బ్రేక్ డౌన్ వల్లనే అమెరికా సైనికుడు ఇలా చేశాడని పశ్చిమ పత్రికలు చెప్పుకుంటున్నప్పటికీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ‘ఇవి ఉద్దేశ్య పూర్వకంగా చేసిన హత్యలనీ, టెర్రరైజ్ చేయడానికి చేసిన హత్యలనీ’ ప్రకటించడం ఖచ్చితంగా పరిగణించవలసిన అంశమే. ఆఫ్ఘనిస్ధాన్ నుండి సమీప భవిష్యత్తులో అమెరికా సైన్యం వైదొలగడానికి ఇష్టపడని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు ఈ దుర్మార్గం వెనుక ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లబ్ది పొందడానికి రిపబ్లికన్ పార్టీ శక్తులు చేయించిన హత్యాకాండ కావచ్చునని వీరు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల లబ్ది కోసం పరాయి దేశంలో ఉద్రిక్తలు రెచ్చగొట్టడం, వ్యాపారాల కోసం దురాక్రమణ యుద్ధాలు చేయడం, కంపెనీల ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలను అస్ధీరపరచడం, దారుణ విధ్వంసాలకు దిగడం అమెరికా, యూరప్ లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి అనేకానేక అమానవీయ ఎత్తుగడాలలో భాగంగానే తాజా ఆఫ్ఘన్ హత్యాకాండ చోటు చేసుకున్నదాని నిస్సందేహంగా నమ్మవచ్చు.

సూడాన్ లాంటి ఆఫ్రికా బడుగు దేశాలపైనా, గాజా లాంటి ఇజ్రాయెల్ జాత్యంకార పీడిత దేశాలపైనా, అమెరికా, యూరప్ ల దురాక్రణ గుంపు దేశాలకు ఎదురోడ్డి నిలిచిన దేశాలపైనా బూటకపు ‘హక్కుల ఉల్లంఘన’ కేసుల్లో సమన్లు జారీ చేయడానికీ, అరెస్టు చేసి విచారణ చేయడానికీ అంతర్జాతీయ న్యాయ స్ధానం గొప్ప వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆఫ్రికా దేశాలలో హత్యాకాండలకు బాధ్యులైనవారిని విచారించగలిమని గొప్పలు కూడా చెప్పుకుంటుంది. అయితే, దానికి అమెరికా, యూరప్ దేశాలు సాగిస్తున్న ఇలాంటి దారుణ సామూహిక హత్యాకాండలు కనిపించవు. తాజాగా జరిగిన కాందహార్ హత్యాకాండ కూడా దానికి కనిపించకపోవచ్చు. అమెరికా దేశం అనేక మూడవ ప్రపంచ దేశాలలో సాగించిన ఘోర కృత్యాలకు మల్లేనే కాందహార్ హత్యాకాండ కూడా కొన్ని రోజులకి సమసి పోతుంది. అమెరికా దారుణాలు మాత్రం నిర్విఘనంగా కొనసాగుతుంటాయి. దీని తర్వాత ఏ సిరియాలోనో, ఇరాన్ లోనో అమెరికా తన తదుపరి ప్రజాస్వామ్య సంస్ధాపనా ఘోరకలిని కొనసాగిస్తుంది.

వ్యాఖ్యానించండి