ఇరాన్ పై బాంబు పడాల్సిందే -కార్టూన్


Bomb Iran

ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటుందేమోనన్న భయంతో వణికిపోతున్న ఇజ్రాయెల్ అమెరికా చేత ఇరాన్ యుద్ధం చేయించడానికి కంకణం కట్టుకుని ఉంది. అమెరికాలో అత్యంత శక్తివంతమైన ‘ఇజ్రాయెల్ అనుకూల యూదు లాబీ’ ద్వారా అమెరికా చేత అనేక ఘోరాలు చేయించిన ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ పైన కత్తి కట్టింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ, పాలస్తీనీయులపై జాత్యహంకార పాలన సాగిస్తూ మూడొందలకు పైగా అణు బాంబులు (బిబిసి ప్రకారం) నిర్మించుకుని ఉన్న ఇజ్రాయెల్ వల్ల ‘ప్రపంచ శాంతి’కి రాని ప్రమాదం ఇంకా తయారు కాని ఇరాన్ అణు బాంబువల్ల వస్తుందంటూ అమెరికా, యూరప్ లు పచ్చి అబద్ధాలు వల్లించడం వెనుక అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ప్రయోజనాలున్నాయి.

అంతకంతకూ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతున్న సామ్రాజ్యవాద కంపెనీలు, సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ప్రపంచ వ్యాపితంగా ఉన్న వనరులన్నింటినీ తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే తమ ఆజ్ఞలకు లొంగని దేశాలను వేధిస్తూ రక రకాల సాకులతో గూండాయిజానికి దిగుతున్నాయి. పశ్చిమాసియాలో తన పెత్తనానికి అడ్డుగా ఉన్న ఇరాన్ పాలకులను తొలగించుకునేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్ పాలక వర్గం పెత్తందారీ అమెరికా, యూరప్ లకు అందిరావడంతో వారి హంతక, దురాక్రమణ, యుద్ధ పిపాస కుట్రలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

ఫలితమే సిరియా ప్రజలు, భద్రతా బలగాలపై గత సంవత్సర కాలంగా సాగుతున్న హత్యలూ, విధ్వంసాలూ. అమెరికా, యూరప్ దేశాలు అందిస్తున్న ఆధునిక ఆయుధాలతో, అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల గూఢచారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సౌదీ అరేబియా, కతార్, లిబియా, యెమెన్, టర్కీ లాంటి దేశాల నుండి వచ్చిన కిరాయి గూండా మూకలు సిరియా ప్రజలపైనా, పోలీసులూ, సైన్యం పైనా సంవత్సర కాలంగా సాగిస్తున్న మారణ కాండలో మరణిస్తున్న వారినే సిరియా అధ్యక్షుడు చంపిస్తున్న వారిగా పచ్చి దుర్మార్గ ప్రచారాన్ని పశ్చిమ పత్రికలు నిస్సిగ్గుగా నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారాన్నే నెత్తికెత్తుకున్న ఐక్యరాజ్యసమితి పశ్చిమదేశాల ప్రయోజనాలకు కావలికుక్కగా మారి సిరియా, ఇరాన్ లపై దురాక్రమన చేయాలంటూ తీర్మానం చేస్తోంది.

అదే దుష్ప్రచారాన్ని అనేక సంవత్సరాలుగా ఇరాన్ పైన సాగిస్తున్న ఐక్యరాజ్యసమితి, ఐ.ఎ.ఇ.ఎ, భద్రతా సమితిలు అమెరికా యూరప్ ల ప్రయోజనాల కోసం ఇరాన్ ని ఏకాకిగా చేస్తోంది. చుట్టుముట్టి ఒంటరిని చేసి పశ్చిమదేశాల కంపెనీల ప్రయోజనాలకు అంగీకరించండి లేదా యుద్ధానికి సిద్ధం కమ్మంటూ ఇరాన్ ను ఇన్నాళ్లూ బెదిరిస్తీ వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ పై దాడులకు ఉబలాటపడుతున్న ఇజ్రాయెల్ ను అడ్డుకుంటున్నట్లు నటిస్తూ దాడులకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

వ్యాఖ్యానించండి