నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి


Narendra kumar IPSమధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్ దేవ్ ఆరోపించాడు. అయితే రాష్ట్ర హోమ్ మంత్రి మాత్రం ‘కోడుకు పోయిన దుఃఖంలో ఆయన మానసిక పరిస్ధితి బాగాలేదనీ, ఆయనతో తాను తర్వాత మాట్లాడతాననీ’ పత్రికలకు చెప్పాడు.

“నా కోడలుతో కూడా బి.జె.పి ఎం.ఎల్.ఏ మోహన్ శర్మ తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. ఎం.ఎల్.ఎ ప్రతి రోజూ నా కోడుకు, కోడళ్ళు ఇద్దరినీ బెదిరిస్తున్నాడు. 15 రోజుల క్రితమే నా కోడలిని బదిలీ చేశారు. నా కొడుకు హత్యను ప్రభుత్వాధికారులు మొదట నా వద్ద దాచిపెట్టారు. ఒక యాక్సిడెంట్ లో నా కొడుకు చనిపోయినట్టు వారు అబద్ధం చెప్పారు” అని కేశవ్ దేవ్ పత్రికా విలేఖరులకు తెలిపినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. నరేంద్ర కుమార్ భార్య మధురాణి తేవాటియా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఐ.ఎ.ఎస్ అధికారిగా పని చేస్తోంది. నరేంద్ర తండ్రి అలీఘర్ సబ్-ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నాడు.

సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న 32 ఏళ్ల నరేంద్ర కుమార్, 2009 బ్యాచ్ ఐ.పి.ఎస్ అధికారి. గురువారం అక్రమంగా తవ్వి తీసిన రాళ్ళను తరలించుకు వెళ్తున్న ట్రాక్టర్ ని ఆయన వెంటాడాడు. జీపులో వెంబడించి ట్రాక్టర్ ని దాటుకుని ఆపవలసిందిగా సైగ చేశాడు. అలా ఆరెండు సార్లు ట్రాక్టర్ ని దాటుకుని ఆపమని చెప్పినా ఆగకపోవడంతో నరేంద్ర కుమార్ జీపు దిగి ట్రాక్టర్ కి అడ్డుగా నిలబడి ఆపడానికి ప్రయత్నించాడు. స్వయంగా అడ్డు నిలబడితే తప్పని సరిగా ట్రాక్టర్ ఆగుతుందని నరేంద్ర కుమార్ భావించి ఉండవచ్చు. అయితే అక్రమ మైనింగ్ తో మాఫియా గా మారిన వారు హత్యలకు తెగబడతారని ఆయన ఊహించలేకపోయాడు. ట్రాక్టర్ ని ఆపడానికి బదులు నరేంద్ర కుమార్ మీదుగా నడపడంతో ఆయన ఆసుపత్రికి వెళ్ళే లోపే చనిపోయాడు.

ఐ.ఎ.ఎస్ అధికారి మధురాణి, బి.జె.పి ఎం.ఎల్.ఎ మోహన్ శర్మ ల మధ్య జరిగిన వాగ్వివాదం బి.జె.పి ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్ళింది. ఫలితమే ఐ.ఎ.ఎస్ అధికారి బదిలీ. మోహన్ శర్మ మాత్రం ఐ.ఎ.ఎస్ అధికారుల బదిలీలు సర్వ సాధారణం అని విలేఖరులకు పాఠాలు చెప్పాడు. “అవును. ఆమె పైన నేను ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ఆమె నాతో సరిగా వ్యవహరించలేదు (ఇల్-ట్రీట్)” అని మోహన్ శర్మ అన్నాడు.

అక్రమ మైనింగ్ తో సంబంధం ఉన్న ట్రక్కులను వదిలి పెట్టామని నరేంద్ర తండ్రి చెప్పడం సరికాదని హోమ్ మంత్రి ఉమా శంకర్ గుప్తా అన్నాడు. సీజ్ చేసిన ట్రక్కులను వదిలి పెట్టినట్లుగా రిపోర్టులేవీ లేవని ఆయన తెలిపాడు. అక్రమ ట్రక్కులని వదిలేస్తే దానికి రిపోర్టులు కూడా ఉంటాయని ఘనమైన మంత్రి వర్యులు సెలవిస్తున్నారు. తన కొడుకు చెప్పిన విషయాలనే కేశవ్ దేవ్ పత్రికలకు చెప్పాడు. ఆయన కొడుకు బతికి ఉండగానే సీజ్ చేసిన ట్రక్కుల్ని వదిలేశారని చెప్పాడు. హోమ్ మంత్రి వాదన ప్రకారం చూసినా అప్పటికి కొడుకు చనిపోలేదు కనుక ఆయన మానసిక పరిస్ధితి బాగానే ఉంది. మానసిక పరిస్ధితి బాగా ఉన్నపుడు ఆయన విన్న అంశాలనే ఆయన పత్రికలకు చెప్పాడని హోమ్ మంత్రికి అర్ధం కాలేదు. ప్రభుత్వం నడుపుతున్న ఎం.ఎల్.ఎ ల అక్రమ మైనింగ్ నే సురేంద్ర కుమార్ అడ్డుకోవడంతో బహుశా హోమ్ మంత్రి మానసిక పరిస్ధితే చెడిపోయినట్లు కనిపిస్తోంది. చెడిపోయిన మానసిక పరిస్ధితితో తన పోలీసు అధికారి పుత్ర శోకాన్ని ‘మానసిక పరిస్ధితి బాగో లేకపోవడం’ గా చెప్పడానికి కూడా హో మంత్రి సిద్ధపడ్డాడు.

నరేంద్ర కుమార్ హత్యతో బి.జె.పి పార్టీ అవినీతి వ్యతిరేకత ఎంత బూటకమో మరోసారి తేలిపోయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో అవినీతి రాజ్యమేలుతున్నా అది అవినీతి కాదని వారు చెబుతారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన రెడ్డి బి.జె.పి పాలకుల అవినీతి పాలనకు నిలువెత్తు దర్పణం. గాలి అవినీతిలో పాలు పంచుకున్న కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప ఆ పార్టీలో పెద్ద నాయకుడు. ఈ అవినీతి కింగులే అన్నా హజారే నడిపిన మహత్తర అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతుదారులు కూడా. భారత పాలకుల అవినీతి వ్యతిరేకత ఈ విధంగా తగలడింది.

వ్యాఖ్యానించండి