‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి


అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా సిద్ధపడ్డారు. అనేక మంది మీడియా వ్యక్తులతో పాటు పోలీసులు కూడా ఈ రాళ్ళ దాడిలో గాయపడ్డారు.

లాయర్ల ప్రవర్తనను కర్ణాటక ముఖ్య మంత్రి సదానంద గౌడ ఖండిస్తున్నట్లు ప్రకటించాడు. సమాజంలో గౌరవనీయ వృత్తిలో ఉన్న లాయర్లు ఈ విధంగా ప్రవర్తించడం వారి వృత్తికి తలవంపులేనని ప్రకటించాడు. ఉన్నత చదువులు చదువుకున్న తరగతికి చెందినప్పటికీ లాయర్లు ఈ విధంగా దౌర్జన్యాలకు దిగడం సహించారాని విషయమనీ, సమగ్ర విచారణ జరిపి దాడులకు పాల్పడ్డ లాయర్లని కఠినంగా శిక్షించాలని కర్ణాటక మాజీ లోకాయుక్త ‘సంతోష్ హెగ్డే’ కోరాడు.

మీడియా వ్యక్తులపైనా, పోలీసుల పైనా రాళ్ళతో దాడులకి దిగిన లాయర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సదానంద తనను కలిసిన విలేఖరులకు హామీ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రానికల్లా సఘటన పై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసుల ఆదేశించినట్లు ఆయన తెలిపాడు. హై కోర్టు చీఫ్ జస్టిస్ విక్రంజిత్ సేన్ తోనూ, హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ తోనూ సమావేశమై కోర్టు ఆవరణలో తరుచుగా జరుగుతున్న లాయర్ల దౌర్జన్యాలకు అడ్డు కట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. రాళ్ళదాడికి దిగిన లాయర్లను బార్ కౌన్సిల్ నుండి తొలగించే అంశం కూడా చర్చిస్తామని తెలిపాడు.

ఓబులాపురం మైనింగ్ కంపెనీ జరిపిన అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల కేసులో ‘గాలి జనార్ధన రెడ్డి’ చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. తన కంపెనీకి కేటాయించిన గనుల్లోనే కాక గాలి కంపెనీ, ఇతర కంపెనీల గనుల్లో సైతం అక్రమ తవ్వకాలు జరిపింది. ఎ.ఎం.సి కంపెనీ జరిపిన అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన రెడ్డిని హాజరు పరచాలని బెంగుళూరు కోర్టు ఆదేశాలివ్వడంతో అతనిని పోలీసులు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. తనకు ప్రాణ భయం ఉందనీ, రక్షణ కావాలనీ, రోడ్డు మార్గంలో వెళ్లలేననీ, గాలిలోనే వెళ్తాననీ కోరినప్పటికీ కోర్టు ఒప్పుకోలేదు. జైలు నిబంధనల ప్రకారమే అతన్ని బెంగుళూరు తీసుకెళ్లాలని సి.బి.ఐ కోర్టు ఆదేశాలిచ్చింది.

ఆ విధంగా బెంగుళూరు చేరిన గాలి కోర్టుకు హాజరైనపుడు ఫోటోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలను లాయర్లు తీవ్రంగా అడ్డుకున్నారు. కోర్టులో గాలి ని వీడియోలు తీయకుండా, ఫోటోలు తీయకుండా అడ్డుకున్నారు. వారిని అడ్డు తొలగించుకుని వీడియో, ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన విలేఖరులపైన లాయర్లు దౌర్జన్యానికి దిగారు. విలేఖరులను బూతులు తిడుతూ కోర్టునుండి నెట్టేయడానికి ప్రయత్నించారు. మీడియాకు సాయ పడడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా లాయర్లు దౌర్జన్యానికి దిగారు. ఫలితంగా అనేక మంది పోలీసులు, విలేఖర్లు, ఫోటోగ్రాఫర్లు, గాయపడ్డారు. కోర్టు ఆవరణలో లాయర్లు స్వైర విహారం చేశారు. మీడియా వాహనాలపై రాళ్ళు విసిరి ధ్వంసం చేశారు. కోర్టు సమీపంలో ఉన్న కాలేజీ పైన కూడా లాయర్లు రాళ్ళు విసరడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులు కూడా లాయర్ల దౌర్జన్యంపై ఆందోళనకు దిగారు.

‘లాయర్లకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని వారు మీడియాపై దాడికి దిగడం దురదృష్టకరం’ అని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించాడు. గొడవ జరుగుతున్నంత సేపు సిటీ సివిల్ కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ రద్దయ్యాయి.

ఇంతకీ కోర్టుకు హాజరైన నేరస్ధుడు గాలి జనార్ధన రెడ్డి ఫోటోలు, వీడియోలు తీయడం వల్ల లాయర్లకు నష్టం ఏమిటి? ప్రజల సొమ్ముని అప్పనంగా మెక్కి తనపై విచారణ జరగకుండా ఉండడానికి లాయర్లను కూడా మేపినందునే గాలి పైన లాయర్లకు ప్రేమా? ఆ ప్రేమ వాదనలో చూపించకుండా భౌతిక దౌర్జన్యానికి దిగడం బహుశా గాలి నేర్పిన విద్యయే కావచ్చు. మైన్స్ లో తనిఖీలకు వచ్చిన అధికారులను మాఫియా గ్యాంగులు పెట్టి తరిమి కొట్టించిన గాలి జనార్ధన రెడ్డి కి కోర్టులపైనా, విలేఖరులపైనా గౌరవం ఉంటుందని భావించరాదని గాలి అభిమాన లాయర్లు ఈ విధంగా తెలిపారు.

3 thoughts on “‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

  1. వసంత కుమార్ గారూ, ద్రవ్యోల్బణం గురించి అంటే, భారత దేశంలో ఇప్పటి ద్రవ్యోల్బణం గురించి వివరించమనా మీ ఉద్దేశ్యం?

    ఆర్ధిక పదజాలం గురించిన పరిజ్ఞానంపై అవగాహన కొంతమేరకు ఉంటుందన్న అంచనాతో నేను ఆర్దిక వార్తలు రాస్తున్నాను. మీరు అడుగుతున్నదాన్ని (ఇంకా కొద్ది మంది పాఠకులు గతంలో అడిగారు లెండి) బట్టి ఆర్ధిక పదజాలం గురించి కూడా ఒక కేటగిరి పెట్టి వివరిస్తే మంచిదని ఆలోచన వస్తోంది.

    ఇంతకీ మీరు అడిగినదానికి సందర్భం ఉందా లేక జనరల్ గా వివరించమని అడుగుతున్నారా?

వ్యాఖ్యానించండి