భారత రాయబారికి వైద్యం నిరాకరించడంపై విచారణకు చైనా అంగీకారం


తన రాయబారికి వైద్యం నిరాకరించడం విషయంలో భారత విదేశీ మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడానికి చైనా అంగీకారం తెలిపింది. భారత వ్యాపారులను విచారిస్తున్న కోర్టు వద్ద హాజరైన రాయబారికి కోర్టులో ఉండగా వైద్య సౌకర్యం పొందడానికి అక్కడ ఉన్న చైనా అధికారులు నిరాకరించారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది.

షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారి ఎస్.బాలచంద్రన్ డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘యివు’ పట్టణంలో అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న అనుమానంతో భారత వ్యాపారులిద్దరిని అరెస్టు చేసారు. వీరిని స్ధానిక కోర్టు విచారిస్తుండగా వారికి భారత రాయబార కార్యాలయం తరపున సహాయం అందించే నిమిత్తం రాయబార కార్యాలయ అధికారి బాలచంద్రన్ హాజరయ్యాడు.

విచారణ ఏక బిగిన ఐదు గంటలపాటు కొనసాగడంతో డయాబెటిస్ వ్యాధి పీడితుడయిన బాలచంద్రన్ కి వైద్య సహాయం అవసరమైంది. అయితే కోర్టులో ఉండగా వైద్య సహాయం అందించడానికి నిరాకరించారని భారత అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. విచారణ ముగిసాక తీవ్రమైన పరిస్ధితులలో ఉన్న బాలచంద్రన్ ను ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. విదేశీ రాయబారిని ఈ విధంగా అగౌరవపరచడం పట్ల భారత విదేశీ మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది.

“చైనీయులతో ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించాలని చెప్పాము. రాయబారిని చూడవలసిన పద్దతి ఇది కాదని చెప్పాము. రాయబారి కార్యాలయ అధికారికి వైద్య సౌకర్యం వారు అందించాలి” అని పేరు చెప్పడానికి ఇష్టపడని భారత అధికారి తెలిపాడని రాయిటర్స్ రాసింది. బాలచంద్రన్, విచారణలో ఉన్న వ్యాపారులను సమర్ధించినందుకు ఆగ్రహావేశాలతో ఆయనపై స్ధానికులు దాడి చేశారంటూ భారత మీడియాలో వచ్చిన వార్తలను సదరు అధికారు నిరాకరించాడని రాయిటర్స్ తెలిపింది.

ఇండియాలోని చైనా రాయబారి ఈ అంశంపై చైనా విచారణ జరుపుతుందని తెలిపాడు. “ఇరు ప్రభుత్వాలు సరైన పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరిస్తాయి. పౌరులకు-పౌరులకు మధ్య తలెత్తిన వ్యాపార తగాదాలాగా ఇది కనిపిస్తోంది” అని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి (ఛార్జ్ డి ఎఫైర్స్) ఝాంగ్ యూ తెలిపాడు. అసలేం జరిగిందీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపాడు.

మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకూ, సరుకుల హోల్ సేల్ మార్కెటింగ్ కీ ‘యివు’ పట్టణం ప్రసిద్ధి చెందిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆసియా వ్యాపారులు ఈ పట్టణంలో జరిగే వ్యాపారం పట్ల ఆకర్షితులవుతారని తెలుస్తోంది. పొరుగు దేశాల మధ్య ఇప్పటికే ఒక యుద్ధం జరగడంతో సహజంగానే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాలతో సంబంధం లేకుండానే ఉద్రిక్తతలు పెరగడం జరుగుతోంది. భారత రాయబారిపై చైనీయులు దాడి చేశారన్న వార్తలను చైనాలోని భారత అధికారి నిరాకరించడం ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకోవాలి.

వ్యాఖ్యానించండి