ఒకటి రెండు సవరణలైతే ఆమోదించవచ్చనీ, రాజ్యసభలో ఏకంగా నూట ఎనభై ఏడు సవరణలు లోక్ పాల్ బిల్లుకి ప్రతిపాదించడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం శనివారం వ్యాఖ్యానించాడు. మిత్రుల మద్దతు పొందడానికి ఒకటి రెండు సవరణలు బిల్లుకి చేయవచ్చనీ చిదంబరం తెలిపాడు.
“లోక్ పాల్ బిల్లుని మెరుగుపరిచి పురర్నిర్వచించవలసిన అవసరం రావచ్చు. రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి సంబంధించినంతవరకూ ఒకటి రెండు సవరణలను అనుమతించవచ్చు. ఒకటి రెండు సవరణలు చేసినా అదే బిల్లు ఉంటుంది. పెద్దగా మార్పు కనపడదు. కాని నూట ఎనభై సవరణలు చేశాక అదిక గుర్తించలేని విధంగా తయారవుతుంది” అని చిదంబరం అన్నాడు.
త్రిణమూల్ కాంగ్రెస్ వైఖరితో తాము నివ్వెరపోయామని పి.చిదంబరం అంగీకరించాడు. ఒక ప్రొవిజన్ ను తిరిగి డ్రాఫ్ట్ చేశాక ఆ పార్టీకి నచ్చజెప్పగలిగామనే భావించినట్లుగా చిదంబరం తెలిపాడు. ఐతే, ఇప్పటినుండి బడ్జెట్ సెషన్ లోగా లోక్ పాల్ డ్రాఫ్టును మెరుగుపరచడమో, కొన్ని ప్రొవిజన్లను తిరిగి రూపొందించడమో చేస్తామనీ తద్వారా త్రిణమూల్ కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకుని బిల్లుకి ఆమోద ముద్ర పొందుతామనీ ఆయన తెలిపాడు. మునుముందు ప్రభుత్వం కష్టపడవలసి ఉంది. కాని తదుపరి సెషన్ లో లోక్ పాల్ బిల్లుకి ఆమోదం పొందాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చిదంబరం తెలిపాడు.
రాజ్యసభలో జరిగిన పరిణామాలకు యు.పి.ఎ ప్రభుత్వం విమర్శలపాలయ్యింది. కాంగ్రెస్ పార్టీ కావాలనే బిల్లుపై ఓటింగ్ జరగకుండా సభను వాయిదా వేయించిందనీ తద్వారా లోక్ పాల్ బిల్లు బడ్జెట్ సెషన్ కి వాయిదా పడేలా ఎత్తు వేసిందనీ పత్రికలు, ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ చర్యను చిదంబరం సమర్ధించుకున్నాడు. ప్రభుత్వం స్వచ్ఛంగా బయటపడగల ఏకైక మార్గం చర్చను ముగించకుండా ఉంచడమేననీ తద్వారా ఆ చర్చను బడ్జెట్ సెషన్ కి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నిశ్చయించిందని చిదంబరం వివరించాడు.