పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన


మిత్రులొకరు పురుషులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమి చెబుతారు? అని అన్నా గారి గొడ్రాలి వ్యాఖ్యపైన నేను రాసిన పోస్టు కింద అడిగారు. దానికి సమాధానం రాశాను. అది పోస్టుగా చేయగల విషయం అని భావించి ఇక్కడ ఇస్తున్నా.

*                              *                         *                              *

స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే స్త్రీలపైన పురుషుల ద్వారా అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజం ప్రత్యక్ష, పరోక్ష ఆమోదం లేకుండా స్త్రీలపైన ఇన్ని అన్యాయాలు జరగవు. అందువల్లనే ఇది పురుషాధిక్య సమాజం అని అంటున్నాం.

సమాజం స్త్రీలపైన పురుషుడికి ఆధిపత్యం ఇచ్చింది అనడానికి అనేక ఉదాహరణలు చూపించవచ్చు. ఆడపిల్లను పెంచే పద్ధతి, మగపిల్లవాడిని పెంచే పద్ధతిలో చాలా తేడాలు సమాజంలో ఉన్నాయి. ‘వాడికేం మగాడు?’ అని చాలా సార్లు స్త్రీకి సమాజం నేర్పిస్తుంది. తల్లిదండ్రుల దగ్గర్నుండి, బడి, పాఠాలు, విద్య, సంస్కృతి అన్నీ ఇలా నేర్పే సమాజంలో భాగాలే.

భార్యని కొడుతున్నపుడు అడ్డుపోతే, ‘వాడి పెళ్ళాం, వాడు కొట్టుకుంటాడు. నీకేంరా?’ అని పది మందీ అడ్డొచ్చినవాడికి అడ్డొస్తారు. ప్రాధమిక తరగతుల పాఠాల్లో నాన్న ఉద్యోగం చేసి సంపాదించేవాడిగా, అమ్మ వంట చేసి పెట్టేదిగా చూపుతున్నారు. అప్పటివరకూ పని మనిషిని పెట్టుకున్న బ్రహ్మచారి, లేదా కుటుంబం, భార్యో, కోడలో వస్తే పని మనిషిని తీసేస్తారు. భార్య స్ధానం అది మరి. మా కొలీగ్ ఈ మధ్య పనిమనిషిని తీసేశాడు. (ఆమెని నేనే మాట్లాడాన్లెండి). ఏం రా అంటే, వాడి భార్య పుట్టింటినుండి వచ్చేసిందంట. (పుట్టింటికి వెళ్ళిన కారణం వాడి వ్యక్తిగతం). ఇక పనిమనిషి ఎందుకు అని ఎదురు ప్రశ్నవేశాడు.

పోలీసులు కూడా ఇంతే. విద్యార్ధిగా ఉండగా నాకు మహిళా సంఘంతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. ఎస్.ఐ లకి, వారి వద్దకు వచ్చే కేసుల విషయంలో భార్యని కొట్టడం అభ్యంతర పెట్టగల విషయంగా కనిపించదు. అదేంటండి అతని భార్యే గదా? అనడిగేవాళ్ళు. మరి చట్టాలు భార్యని కూడా కొట్టగూడదని నిర్దేశిస్తాయి కదండీ అంటె ఆ చట్టాల్దేముందండీ అనేవారు తప్ప అది తప్పుగా అంగీకరించేవారు కాదు. అంటే భార్యలని కొట్టగల హక్కు సమాజమే పురుషుడికి దఖలు పరిచిందని అర్ధం అవుతోంది. ఎంతగానంటే, చట్టాలను కూడా తీసిపారేసేంతగా నన్నమాట. మామూలు వ్యక్తులేకాక పోలీసు అధికారి కూడా స్త్రీల చట్టాలని తీసిపారేసేంతగా పురుషుడికి అధికారాన్ని స్త్రీలపైన సమాజం ఇచ్చేసింది. 

చిత్రం ఏమిటంటే ఈ పురుషాధిక్య భావాజాలనికి ఎవరూ అతీతులూ కాదు. వాళ్ళు ప్రొఫెసర్లు కానియ్యండి. ఐ.టి నిపుణులు కానివ్వండి, ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు ఇలా ఒకరేమిటి… వీళ్లంతా ఆ సమాజం అనే తాను లోని ముక్కలు కావడమే అందులోని రహస్యం. వీళ్ళు ఎదిగే క్రమంలో పాత పురుషాధిక్య భావాలను వదులుకుని, స్త్రీ పురుషులంతా సమానులే అనే ఆధునిక ప్రజాస్వామిక భావాలను అలవర్చుకున్నట్లయితే తమ అలవాట్లను కూడా క్రమంగా మార్చుకుంటారు. లేదా అలాగే పాత భావాలను వ్యక్తం చేస్తూ వాటినుండి లబ్ది పొందుతుంటారు. పురుషుల్లో చాలామంది ఆదర్శాలు ఎన్ని చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి పురుషాధిక్య సమాజం ద్వారా వచ్చి పడిన సౌకర్యాలను వదులుకోలేక అలానే భార్యలను, చెల్లెళ్లను, కొండొకచో తల్లులను రాచి రంపాన పెడుతుంటారు.

క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఆంధ్ర – అమెరికా లొ ఒక సంఘటన జరిగింది. అతను పెద్ద గణిత మేధావి. బాల్యం నుండే మేధావిగా ప్రసిద్ధి కెక్కినవాడు. అత్యంత చిన్న వయసులోనే ఇంజనీరో, ఏదో అయ్యి (వివరాలు పూర్తిగా గుర్తు లేనందుకు మన్నించగలరు) అమెరికాకి వెళ్లిపోయాడు. అతనికి వచ్చిన పేరు ప్రతిష్టల కారణంగా క్లింటన్ తో కూడా అతనికి పరిచయం కలిగింది. అతను పెళ్లయ్యాక భార్యని కట్నం కోసం బాగా వేధించాడు. అతని భార్య చాలా సంవత్సరాలు భరించి ఇక భరించలేక ఇండియాకి వచ్చినపుడు కేసు పెట్టింది. ఇండియాకి రావడానికి ఆవిడ చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది. అమెరికాకి వలస వెళ్ళినా ఆమెకు కట్నం పీడ తప్పలేదు. కట్నం కోసం హింస పెడుతూ తమకు క్లింటన్ తో కూడా పరిచయం ఉందనీ కనుక తమను ఎవరూ ఏమీ చెయ్యలేరనీ వారు బెదిరించడంతో ఆమె చాన్నాళ్లూ భయపడి నోర్మూసుకుందని తర్వాత తెలిసింది. వారిని ఇండియాకి రప్పించి అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకుని సమస్య పరిష్కరించుకున్నారు. ఇప్పటికీ కట్నాల కొసం వేధిస్తున్న సాఫ్ట్ వేర్ అల్లుళ్ళు, అమెరికా అల్లుళ్ళూ చాలా మంది ఉన్నారని అప్పుడప్పుడూ వచ్చే పత్రికా వార్తలను బట్టి అర్ధం అవుతుంది.

“కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసీ విరియని ఓ చిరునవ్వా, కన్నుల మంటలు నీరై కారగ, కట్నపు జ్వాలలో సమిదై పోయవా?” అని ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాటలో ఒక్కో చరణం ఒక్కో ఆణిముత్యం అన్నమాట. ఆ పాట పాడుతుంటే ఎక్కడివారక్కడ నిలబడిపోయి ఆలకించేవారు. అంత అద్భుతమైన పాటని రాసిన కవి భార్య అతని శాడిస్టు అనుమానపు చర్యలకి తట్టుకోలేక విడాకులు తీసుకుందని తెలిస్తే ఎవరైనా షాక్ తినక మానరు. నాకైతే గుండె ఆగినంత పనయ్యింది. ఆమె ఓ మహిళా సంఘం కార్యకర్త. ఓ పెద్ద కవి గారి కూతురు కూడా. అయినా ఆమె పురుషాధిక్యతను అనుభవించక తప్పలేదు. అది కూడా ఒక అభ్యుదయవాది అయిన కవి ద్వారా. సమాజంలో పురుషాధిక్యత ఎంతగా పాతుకుపోయిందీ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను.

పురుషాధిక్య సమాజంలో కూడా భర్తలపైన గయ్యాళితనం ప్రదర్శిస్తున్న పురుషులు లేరా అన్నది మీ ప్రశ్న కావచ్చు. ఉన్నారు. కాని వారి అధికారం, భర్తపై చేసె గయ్యాళితనం సమాజం స్క్రూటినీకి లొంగి ఉంటుంది. సినిమాలలో చూపిస్తారు. సినిమా అంతా భార్య నోటికి దడిసి ఉన్న భర్త చివర్లో నాలుగు డైలాగులు చెప్పి భార్యపై చేయి చేసుకోగానే హాలంతా చప్పట్లు మార్మోగుతాయి. గయ్యాళి భార్య పట్ల ప్రేక్షకులకి ఉండే వ్యతిరేకత అది. ఇక్కడే మీరొక ముఖ్య విషయం గమనించాలి. భర్తపై ఆధిపత్యం చెలాయిస్తే భార్య ‘గయ్యాళి’ అయ్యింది. కాని భార్యపై ఆధిపత్యం చెలాయించేసరికి అది ఆమోదయోగ్యంగా మారిపోయింది. భార్య గయ్యాళితనం నోటికే పరిమితం అయితే, భర్త ఆధిపత్య చేతలదాక వెళ్తుంది. ఒక్క చేతలేం ఖర్మ, ప్రాణాలమీదికి కూడా తేస్తోంది. “ఆమ్నియో సెంటసిస్” ద్వారా పిండం వదిలించుకునే దగ్గర్నుండి, పుట్టినవారిని చంపేదగ్గర్నుండి, పెరుగుతున్నంతకాలం వేధించే దగ్గర్నుండి, కట్నం కోసం, మగపిల్లల కోసం చంపేవరకూ ఇలా స్త్రీల ప్రాణాల మీదికి వస్తోంది.

భార్య గయ్యాళితనానికి ఈ సమాజంలో పరిష్కారం ఉంది. అదేంటంటె పురుషుడు తిరగబడి తన భార్యమీద న్యాయంగా ఉన్న ఆధిక్యతను తిరిగి పొందడం. కాని స్త్రీలపై పురుషుడి ఆధిపత్య సమస్యకు ఈ సమాజం పరిష్కారం చూపదు. సమాజం దృష్టిలో అదొక సమస్యే కాదు కనక ఇక పరిష్కారం అవసరం ఏముంది? ఎవరైనా పరిష్కారంగా స్త్రీలు కూడా తిరగబడాలి అంటే సమాజం ఊరుకుంటుందా? అంగీకరిస్తుందా? ఛస్తే ఊరుకోదు. మా ఆఫిసులో ఒక వ్యక్తి తన భార్యని దాదాపు రోజూ బండిపై తీసుకెళ్లి కూరగాయల్లాంటి నిత్యావసర సరుకులని కొంటుంటాడు. అతని పైన మా ఇతర కొలీగ్స్ ఛీప్ గా కామెంట్ చెయ్యడం నేను విన్నాను. ఎప్పుడూ పెళ్లాం కొంగు పట్టుకుని తిరుగుతాడనీ, ఇంట్లో అన్ని పనులూ చేయాల్సిందే అనీ ఇలా. అతను తన సొంత ఇంటి పనులే చేస్తున్నా, తన బాధ్యతలే నిర్వర్తిస్తున్నా, అతనికి ఆ బిరుదు తప్పలేదు. వీళ్ళంతా డిగ్రీలు, పి.జిలు చదివినవాళ్ళే. ఇంగ్లీషు సినిమాలు ఎగబడి చూసేవాళ్ళే. ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా ఫైటింగ్ లు అవీ చేస్తుంటె వీరు ఇష్టపడతారు కూడా. అదే భావన నిజ జీవితంలొ వారు ఆహ్వానించలేకపోతున్నారు.

కనుక తేలేదేమంటె పురుషులపైన స్త్రీల అత్యాచారాలన్నవి సామాజిక వాస్తవం కాదు. అవి జరగడం కోటికో, వెయ్యి కోట్లకో. అధవా జరిగినా అవి సమాజం ఆమోదం పొందుతున్నవి కావు. సమాజంలో వాటికి తక్షణ పరిష్కారం ఉంది. కాని స్త్రీలపైన పురుషుల ద్వారా జరుగుతున్న అన్యాయాలకీ, అత్యాచారాలకీ ఈ సమాజం పరిష్కారం చూపదు. పైన చెప్పినట్లు అది సమస్యే కాదు కనక పరిష్కారం చూపే అవసరమే లేదు.

మీరు అక్కడ ఇలా జరిగింది. ఇక్కడ మరొకలా జరిగింది. అది అన్యాయం కాదా? అది స్త్రీల అన్యాయం కాదా అని మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చూపి ప్రశ్నించవచ్చు. వాటికి కూడా నేను చెప్పే సమాధానం ఏమిటంటె, స్త్రీ అధిక్యత గానీ, స్త్రీల అన్యాయాలు గానీ ఈ సమాజపు లక్షణం కాదు. ఈ సమాజానికి స్త్రీల ఆధిక్యత అవలక్షణమే తప్ప లక్షణం కాదు. అవలక్షణంగా భావిస్తున్న స్త్రీ ఆధిక్యత (గయ్యాళి తనం) సమస్యకు పరిష్కారం పురుషులకి చక్కగా అందుబాటులో ఉంది. పురుషులపై స్త్రీల ఆధిక్యతను ఒక సమస్యగా చూపడం పురుషాధిక్య సమాజంలో సరికాదు.

5 thoughts on “పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన

  1. విశేఖర్ గారూ! ఈ సమస్యను మీరు విశ్లేషించిన తీరు బాగుంది. ‘కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా’ లాంటి కరుణరసాత్మక గీతం రాసిన కవి విషయంలో జరిగింది- చదువుతుంటే ‘నిజమా?’ అని ఆశ్చర్యమూ, బాధా కలిగాయి. సమాజం అయాచితంగా అందించే పురుషాధిక్యతను వదులుకోవటం అభ్యుదయ కవులకూ, కళాకారులకూ కూడా అంత కష్టమన్నమాట!

  2. వేణు గారూ, మీ వ్యాఖ్య కోసం మొఖం వాచి ఉన్నానంటే నమ్మండి. విషయం ఏమిటంటే, మీరు వస్తారని నేను ఊహించినపుడు మీరు ఖచ్చితంగా వచ్చేస్తున్నారు. మీ అభిరుచి తెలియడం వల్ల అలా మీ రాకను ముందే ఊహించేస్తున్నాను మరి.

  3. భార్య భర్తని వేధిస్తే భర్త భార్యకి వెంటనే విడాకులిస్తాడు. భర్త భార్యని వేధిస్తే భార్య భర్తకి వెంటనే విడాకులు ఇవ్వదు. సమాజంలో ఎవరికి ఎక్కువ అన్యాయాలు జరుగుతున్నాయో దీన్ని బట్టి తెలియడం లేదా?

  4. socieity magadiki responsibility kooda ichindi. aa point meeda touch cheyalede meeru. evo konni families lo jariginanta maatrana anadaroo alantivare anukunte ela? mottam NRI lu enta mandi? andulo katnam kosam adigevaru entamandi?
    asalu point emitante, ladies ni protect cheyyataniki techina chattaalu, nijamaina baadhituraallakante, gayyali aadavare ekkuva vadutunnaru.

  5. ప్రవీణ్ శర్మగారు ఉన్నమాట చెప్పారు. భార్య భర్తని వేధిస్తే భర్త భార్యకి వెంటనే విడాకులిస్తాడు. భర్త భార్యని వేధిస్తే భార్య భర్తకి వెంటనే విడాకులు ఇవ్వదు. కాని ఈ నిజం వెనుక మరొక ముఖ్య కోణం మరచిపోయారు. అలాంటి భర్తలను భరిస్తున్న స్త్రీలు తమ పిల్లలకోసం నిలబడిపోతున్నారు. అదీ కాక అనేకానేక కారణాలవలన (ఆర్ధిక, సామాజుక వగైరా) స్త్రీలు అంత త్వరగా న్యాయస్థానం గుమ్మం దగ్గరకు రారు.

వ్యాఖ్యానించండి