రూపాయి పతనం ఆపడానికి ఇండియా, జపాన్ ల మధ్య ‘డాలర్ల మార్పిడి’ ఒప్పందం


అదుపు లేకుండా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం అరికట్టడానికి భారత్, జపాన్ లు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు దేశాల కరెన్సీలు పతనం కాకుండా ఉండడానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి ఇరు పక్షాలు గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమై వచ్చే బుధవారం ఇరు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవచ్చునని రాయిటర్స్, హిందూస్ధాన్ టైమ్స్ పత్రికలు తెలిపాయి.

షేర్ మార్కెట్లలో ఊహాత్మక వ్యాపారం తీవ్రమైనపుడు దేశం నుండి పెట్టుబడులు తరలిపోయి కరెన్సీ విలువ పతనమయ్యే పరిస్ధితి తలెత్తకుండా ఈ విధమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం పరిపాటి. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లలో అస్ధిర పరిస్ధుతులు తలెత్తినపుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయి ‘చెల్లింపుల సమతూకం’ దెబ్బతినే ప్రమాదం తలెత్తుతుంది. అదేకాక ఊహాత్మక వ్యాపారం తీవ్రమయినప్పుడు ఎఫ్.ఐ.ఐ లు దేశం నుండి తరలిపోయి దేశీయ కరెన్సీ విలువ పడిపోతుంది. ఇది కరెన్సీ మార్కెట్లలో మరింత అస్ధిరతకు దారితీసి మరిన్ని పెట్టుబడులు తరలివెళ్ళడం కరెన్సీ విలువ ఇంకా పడిపోవడం జరుగుతుంది.

గత కొన్ని వారాలుగా రూపాయి విలువ పతనం అవుతోంది. అమెరికా వృద్ధి నెమ్మదించడం, యూరప్ రుణ సంక్షోభం కారణాలవల్ల భారత దేశ ఎగుమతులు పడిపోయి ఆర్ధిక వృద్ధి బాగా నెమ్మదించింది. దానితో భారత షేర్ మార్కెట్ల నుండి విదేశీ సంస్ధాగత పెట్టుబడులు పెద్ద ఎత్తున బైటికి తరలివెళ్తున్నాయి. దానితో విదేశీ మారక ద్రవ్యం నిలవలు తరిగిపోయి ఆ ప్రభావం రూపాయి విలువపై పడుతోంది. రూపాయి విలువ పతనాన్ని అరికట్టడానికి తాను జోక్యం చేసుకోబోనంటూనే ఆర్.బి.ఐ డాలర్లను అమ్మి రూపాయి కరెన్సీని కొనుగోలు చేయడం ద్వారా రూపాయి విలువ పతనాన్ని అరికట్టడానికి ప్రయత్నించింది. అయితే ఆర్.బి.ఐ ఎంతోకాలం ఈ విధంగా కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకోవడం కుదరిపని. అలా చేసినట్లయితే డాలర్ల రూపంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తరిగిపోయి చెల్లింపుల సమతూక సంక్షోభం (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్) ఏర్పడుతుంది. అంటే 1990 నాటి పరిస్ధితి తిరిగి తలెత్తుంది.

ఈ పరిస్ధితిని అరికట్టడానికి డాలర్ల మార్పిడి ఒప్పందం కొంతమేరకు సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఇండియాలో విదేశీమారక ద్రవ్య సంక్షోభం లేదా చెల్లింపుల సమతూక సంక్షోభం లేదా రూపాయి విలువ పతనం లాంటి సంక్షోభాలు సంభవించినపుడు జపాన్ ముందుకు వచ్చి భారత కరెన్సీ రూపాయిని డాలర్లతో మార్పిడి చేసుకుంటుంది. తద్వారా రూపాయి విలువ పతనాన్ని తాత్కాలికంగా అరికట్టబడుతుంది. అదే విధంగా జపాన్ కరెన్సీ యెన్ విలువ పడిపోయే పరిస్ధితులు తలెత్తినపుడు ఇండియా, జపాన్ వద్ద యెన్ లను తీసుకుని దానికి బదులుగా డాలర్లను సరఫరా చేస్తుంది. తద్వారా యెన్ విలువ పతనం కాకుండా సహాయపడుతుంది. ఇది పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందం.

ఈ విధమైన డాలర్ల మార్పిడి ఇరు దేశాలూ ఐదు బిలియన్ డాలర్ల వరకూ చేయాలని ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. అంటె మొత్తం మీద పది బిలియన్ డాలర్ల మేర డాలర్ల మార్పిడి ఒప్పందాన్ని భారత్, జపాన్ లు కుదుర్చుకుంటాయి. బుధవారం జరగనున్న ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం లో ఈ ఒప్పందం కుదరవచ్చని నిక్కీ వ్యాపార వార్తా పత్రిక తెలిపినట్లుగా రాయిటర్స్ తెలిపింది. దక్షీణ కొరియా తో కూడా రానున్న అక్టోబరు నెలలో ఇదే విధమైన డాలర్ల మార్పిడి ఒప్పందం ఇండియా కుదుర్చుకుంటుందని తెలుస్తోంది.

ఇటువంటి ఒప్పందాలు ఎన్ని జరిగినప్పటికీ అసలు సమస్య అయిన ప్రజల కొనుగోలు శక్తి తగ్గుదల ను పరిష్కరించకుండా మాంద్యం పరిస్ధితులు, రుణ సంక్షోభ పరిస్ధితులు చక్కబడవు. కాని పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు ఆ పరిష్కారం జోలికి కూడా పోయే అవకాశం లేదు. ఫలితంగా ప్రజల ఆర్ధిక నాడులపై ప్రభుత్వాలు మరిన్ని దాడులు చేస్తున్నాయి.

వ్యాఖ్యానించండి