సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక


ఏడేళ్ళ క్రితం బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలలో సంభవించిన సునామి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఇండోనేషియా ద్వీపకల్పానికి దగ్గరగా సముద్రం లోపల 9.1 రీడింగ్ తో సంభవించిన శక్తివంతమైన భూకంపంతో ఈ రెండు సముద్రాలలో సునామి ఏర్పడి మొత్తం ఏడు దేశాలలో విలయం సృష్టించించిన సంగతి విదితమే. మొత్తం రెండు లక్షల ముప్ఫై వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఈ సునామి ప్రభావం ప్రజలపై ఇంకా చూపుతుండడమే విషాధం.

ఏడేళ్ళక్రితం, ఎనిమిదేళ్ళ వయసులో తప్పిపోయిన ఇండోనేషియా బాలిక పదిహేనేళ్ల వయసులో తల్లిదండ్రులను వెతుక్కుంటూ రావడమే కాక వారిని కలుసుకుని ఆనంద భరితురాలైన ఘటన ఇండోనేషియాలోని ‘బండా ఆఛె’ పట్నంలో జరిగింది. సాధారణంగా పిల్లలను వెతుక్కుంటూ తల్లిదండ్రులు వెళ్తుంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులను వెతుక్కుంటూ కూతురే రావడం విశేషం. సునామీలో కొట్టుకుపోయిన తమ కుమార్తెలు ఇరువురూ చనిపోయి ఉంటారనే ‘వాటి’ తల్లిదండ్రులు భావించారు. దానితో తమ పిల్లల కోసం వెతికే ప్రయత్నాలను వారు ఎప్పుడో మానుకున్నారు. తలవని తలంపుగా ప్రత్యక్షమైన తమ కూతురిని ‘వాటి’ తలిదండ్రులు సంతోషంగా స్వీకరించారు. తన కూతురిని గుర్తించడానికి డి.ఎన్.ఎ పరీక్షలు అవసరం లేదనీ చెబుతూ వారు తమ కూతురిని అక్కున చేర్చుకున్నారు.

పదిహేనేళ్ల ‘వాటి,’ ఆఛె రాష్ట్రంలోని మ్యూలాబో లో ఒక హోటల్ వద్ద రెండు రోజుల క్రితం ప్రత్యక్షమయ్యింది. తాను తన తల్లిదండ్రులని వెతుక్కుంటూ వచ్చానని అక్కడ ఉన్నవారికి తెలిపింది. తాను కొట్టుకుపోయాక కొద్ది సేపటికే తనను ఒక స్త్రీ చేరదీసిందనీ, ఆమె తనను బలవంతంగా అడుక్కొనే వృత్తిలోకి దింపిందని ‘వాటి’ తెలిపింది. ఒక్కో సారి తెల్లవారు ఝాము ఒంటి గంట వరకూ తనను బిక్షం అడుక్కోవాలని బలవంతపెట్టేదని ఆ బాలిక తెలిపింది. అడుక్కోవడం ఇష్టం లేక మానేయడంతో ఆ స్త్రీ, బాలికను తన్ని తరిమేసింది.

దానితో ‘వాటి,’ తన తల్లిదండ్రులను వెతుకుతూ బయలుదేరింది. కాని చిన్నతనంలోనే తప్పిపోవడంతో ఆమెకు తన తల్లిదండ్రుల గురించిన ఏ సమాచారమూ తెలియదు. తన తాత పేరు ఇబ్రహీం అన్న విషయం తప్ప బాలికకు మరేమీ గుర్తు లేదు. తల్లిదండ్రుల పేర్లు గానీ, ఊరి పేరు గానీ వివరాలేవీ ఆమెకు తెలియదు. అయితే హోటల్ దగ్గర ఉన్నవారు బాలికకు కొంత సహాయం అందించారు. ఇబ్రహీం అన్న పేరుగలవారినందరినీ గుర్తుకు తెచ్చుకున్నారు. వాళ్ళలో ఎవరి మనవరాలు అయి ఉంటుందో ఊహించి ఆ వ్యక్తిని పిలిచారు. కాని ఇబ్రహీం కి తన మనవరాలిని గుర్తించడం సాధ్యం కాలేదు. వెంటనే బాలిక తల్లిదండ్రులకి కబురంపాడు.

“నేను మా అమ్మను చూసినపుడు, నాకు తెలుసు ఆమె మా అమ్మేనని. నాకు తెలుసంతే” అని వాటి సంతోషంగా చెప్పింది. ‘వాటి’ అన్నది బాలికను చేరదీసిన స్త్రీ పెట్టిన పేరు. బాలికకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘మేరీ యురాందా’. “తనది ఆమె తండ్రి మొఖం” అని మేరీ తల్లి ‘యూస్నియార్ బింటి ఇబ్రహీం నూర్’ తెలిపింది. తన కూతురు బతికే ఉందని నమ్మడం తానెప్పుడో మానేశానని ఆమె తెలిపింది. “ఆ తర్వాత తన కంటిపైన ఒక మచ్చ ఉంది. అది చూశాను. ఓ పిరుదుపైన పుట్టుమచ్చ గుర్తు పట్టాను. దానితో తను నా కూతురే అని స్పష్టం అయ్యింది” అని తల్లి చెప్పింది.

మేరి ఎలా తప్పిపోయిందన్న విషయంలో ఆమె చెబుతున్నదానికీ, తన తండ్రి చెబుతున్నదానికి తేడా కనిపిస్తోంది. తననూ తన చెల్లెలినీ తండ్రి ఒక పడవలో కూర్చోబెట్టగా ఆ పడవ కొట్టుకుపోయినట్లుగా తనకు గుర్తుందని బాలిక చెబుతోంది. ఆమె తండ్రి మాత్రం ఇద్దరు పిల్లలనీ ఇంటి కప్పుపై కూర్చుండ బెట్టాననీ, ఇంతలో సునామీ అల లాక్కెళ్ళిందనీ చెబుతున్నాడు. రెండవ కుమార్తె ఎక్కడ ఉన్నదీ వారికి తెలియదు. ఉందో లేదో కూడా తెలియదు.

డిసెంబరు 26, 2004 తేదీన సంభవించిన సునామీ ధాటికి అలలు ముప్ఫై మీటర్ల వరకు ఎగసి పడడంతో అది అనేకమందిని కబళించింది. కిలోమీటర్ల మేరకు భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి అందినవారిని అందినట్లు సముద్రంలోకి లాక్కొని వెళ్ళింది. అనేకమంది శవాలు కూడా లభ్యం కాలేదు. ఎవరు ఉన్నారో, ఎవరు పోయారో తెలియని పరిస్ధితి ఇంకా కొనసాగుతోంది. పత్రికా ప్రకటనల ద్వారా, ఇతర మీడియాలో ప్రకటనల ద్వారా తాము కోల్పోయినవారి కోసం అనేక ప్రయత్నాలు చేసిన జనం ఇక లాభం లేదని ఆశలు వదులుకుంటున్నారు. తిరిగి కలుసుకోవడం అన్నది చాలా అరుదు. ఇంకా తమవారు కనిపిస్తారని ఆశపడుతున్నవారి సంఖ్యకు కూడా కొదవలేదు.

ఈ కధలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. ఆడపిల్లలను పుట్టక ముందూ, పుట్టిన తర్వాతా కూడా చంపుతూ, మగ పిల్లల్ని కనలేదనీ కోడళ్లని కూడా కాల్చుకు తింటున్న ఇప్పటి సమాజంలో ఏడేళ్ళ అనంతరం తిరిగొచ్చిన కూతురిని సంతోషంగా స్వీకరించారు మేరీ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు పేదలని ఫొటోని చూస్తే అర్ధమవుతోంది. అయినా వారు సామాజిక అవలక్షణాన్ని తమ దరికి చేరకుండా నిలబడినందుకు బహుధా అభినందనీయులు.

4 thoughts on “సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక

వ్యాఖ్యానించండి