అమెరికాతో ఘర్షణ నేపధ్యంలో పాకిస్ధాన్ కి పూర్తి మద్దతు హామీ ఇచ్చిన చైనా


దక్షిణాసియాలో అమెరికాకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న పాకిస్ధాన్ కి అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపధ్యంలో ఆ దేశానికి చైనా నుండి పూర్తి మద్దతు లభించింది. ఆర్ధిక, రక్షణ తదితర రంగాలన్నింటిలోనూ చైనా పాకిస్ధాన్ కి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పాకిస్ధాన్ పర్యటిస్తున్న చైనా అత్యున్నత విదేశాంగ శాఖ అధికారి హామి ఇచ్చినట్లుగా ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ కౌన్సిలర్ దాయి బింగ్-గువో, తన పాక్ పర్యటన పాక్, చైనా సంబంధాలను మరింత ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళడానికి ఉద్దేశించిందని పత్రికలకు తెలిపాడు.

 శుక్రవారం సాయంత్రం దాయి, పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ను కలిసి చర్చలు జరిపాడు. ఈ సమావేశంలో ‘ఆర్ధిక, వ్యూహాత్మక, రక్షణ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాలలోనూ చైనా పాకిస్ధాన్ కి ఇస్తున్న మద్దతు, సహకారం కొనసాగిస్తుంద’ని తెలిపినట్లుగా పాక్ విదేశాంగ కార్యాలయం వెలువరించిన పత్రికా ప్రకటన పేర్కొన్నది. చైనా మద్దతుకు హీనా రబ్బాని ఖర్ సంతోషం వ్యక్తం చేసింది. నవంబరు 26 తేదీన పాక్ చెక్ పోస్టులపై దాడి చేసి ఇరవై నాలుగు మంది పాక్ సైనికులను అమెరికా మిలట్రీ చంపిన అనంతరం చైనా ఇస్తున్న సహకారం ప్రశంసనీయమని హీనా పేర్కొంది.

అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చైనా అభిప్రాయాలను ఖర్ కి చైనా అధికారి వివరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను ఇరు నాయకులూ చర్చించారనీ, అంతర్జాతీయ భద్రతా అంశాలు, పరస్పర ఆసక్తి గల అంశాలను గూడా చర్చించారని విదేశాంగ కార్యాలయం చేసిన ప్రకటన పేర్కొంది. 2011 సంవత్సరాన్ని పాకిస్ధాన్ – చైనాల స్నేహ సంవత్సరంగా పాటించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. చైనాతో బంధాలని చివరి వరకూ కొనసాగించడానికి పాకిస్ధాన్ హామి ఇచ్చిందని ప్రకటన తెలిపింది. భవిష్యత్తులో సైతం చైనా పాక్ ల సహకారం కొనసాగాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి.

అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్న నేపధ్యంలో ప్రాంతీయంగా ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న అమెరికా పాకిస్ధాన్ ను వివిధ పధకాలతో ఊరించడానికి సిద్ధపడడం అంతర్జాతీయంగానూ, ప్రాంతీయంగానూ పరిస్ధితులలో మార్పులు జరుగుతున్నాయనడానికి ఒక సూచికగా గుర్తించాలి.

వ్యాఖ్యానించండి