
భూకంపం, సునామీల బారినపడి ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు కర్మాగారం లో శుభ్రపరిచే పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో డజన్లమందిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద పరిస్ధితి స్ధిర దశకు (స్టబిలిటీ) వచ్చిందని జపాన్ ప్రధాని ప్రకటించిన మరుసటిరోజే కార్మికులు జబ్బుబారిన పడడం విశేషం.
అణు ప్రమాదం కారణంగా కర్మాగారంలో విడుదలైన రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరిచే కార్యక్రమంలో కార్మికులు అనేక నెలలుగా నిమగ్నమై ఉన్నారు. కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో ఈ పనులకు ఆటంకం కలిగింది. ‘నోరో వైరస్’ సోకడం వల్ల కార్మికులు స్టమక్ ఫ్లూ జబ్బు బారిన పడ్డారని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో ఎలక్ట్రిక్ కంపెనీ అధికారులు శనివారం తెలిపారు.
కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల్లో యాభై రెండు మందికి గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స జరిపారని ఎ.పి వార్తా సంస్ధను ఉటంకిస్తూ అనేక పత్రికలు తెలిపాయి. అంటే ఓ వైపు కార్మికులు జబ్బున పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కర్మాగారం స్ధిర దశకు చేరుకుందని జపాన్ ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. అణు కర్మాగారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వాలు ఇలా దాపరికంగా వ్యవహరిస్తున్నాయి.
స్టమక్ ఫ్లూ సోకిన కార్మికులలో ముగ్గురికి నోరో వైరస్ సోకినట్లుగా ధృవపడిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. స్టమక్ ఫ్లూ సోకడానికీ అణు కర్మాగారంలోని రేడియో ధార్మికతకూ సంబంధం ఉందీ లేనిదీ తెలియరాలేదు.