
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భారత పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. సాధారణంగా ఎంతో కొంత (ఎంత తక్కువైనా) పెరుగుదలను నమోదు చేయవలసి ఉండగా, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలను నమోదు చేయడం పరిశీలకులను నిశ్చేష్టుల్ని చేసింది. ఈ సంవత్సరం అక్టోబరు నెలలో గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి 5.1 శాతం తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫ్యాక్టరీలు, ఖనిజ తవ్వకాలు, వివిధ యుటిలిటీ కంపెనీలు మొ.న రంగాల ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తిగా పరిగణిస్తారు. రాయిటర్స్ సర్వేలో 0.5 శాతం మేరకు తగ్గుదల ఉంటుందని అంచనా వేయగా, అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 5.1 శాతం మేరకు తగ్గిపోవడం మార్కెట్ మదుపుదారులను నిరుత్సాహానికి గురి చేసింది.
దాదాపు రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు పెంచుతూ పోవడంతో దాని ప్రభావం పారిశ్రామికీ ఉత్పత్తిపై పడిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు. వడ్డీ రేట్లను ఇక తగ్గించవలసిన సమయం ఆసన్నమయ్యిందని, ఆర్.బి.ఐ అందుకు సిద్ధం కావాలనీ వారు కోరుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయిందన్న వార్తలతో భారత షేర్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ 1.25 శాతం నష్టపోయి పదహారు వేల స్ధాయికి సమీపంలో ఉంది. మరో పది పాయింట్లు తగ్గితే మరొకసారి పదహారువేల స్ధాయి దిగువకు సెన్సెక్స్ చేరుకుంటుంది.
భారత దేశ జిడిపి వృద్ధి బాగా తగ్గుతోందనడానికి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ప్రబల దృష్టాంతంగా నిలుస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనాను 9 శాతం నుండి తగ్గించుకుని 7.25 నుండి 7.75 శాతం వరకూ నమోదు కావచ్చునని గత వారమే ప్రకటించింది. ఆర్.బి.ఐ ఇక వడ్డీ రేట్లు తగ్గించగలదని భావిస్తున్నారు. ఈ వారం ఐతే తగ్గించకపోయినా కనీసం పెంచకుండా స్ధిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రారంభం నుండి ఆర్.బి.ఐ ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గించే పేరుతో ఈ విధంగా వడ్డీ రేట్లను 375 బేసిస్ పాయింట్లు లేదా 3.75 శాతం పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. ప్రణాళికా సంఘం కూడా వడ్డీ రేట్లను అతిగా పెంచుతున్నట్లుగా అభిప్రాయపడింది.
వడ్డీ రేట్లు అధికంగా ఉండడం వలన పారిశ్రామికవేత్తలు అప్పులు తీసుకోవడం బాగా తగ్గించారనీ, దానితో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయనీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్లనే పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో కొత్త పెట్టుబడులు లేక, ఉన్న పరిశ్రమలలో విస్తరణ కార్యక్రమాలు లేక పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయిందని భావిస్తున్నరు. రెండవ క్వార్టర్ లో మొత్తం జిడిపి వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యింది. రెండేళ్లలోనే ఇది అతి తక్కువ. మైనింగ్ రంగంలో ఉత్పత్తి 7.2 శాతం పడిపోయిందని తెలుస్తోంది. పెట్టుబడి సరుకుల (కేపిటల్ గూడ్స్) ఉత్పత్తి ఘోరంగా 25.5 శాతం పడిపోయింది. ఆర్ధిక వ్యవస్ధలో వస్తున్న పెట్టుబడులకు ‘కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి’ కొలబద్దగా ఉంటుంది.