సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు


ఈ ఇద్దరు నర్సుల పేర్లు పి.కె.వినీత, రేమ్యా రంజన్. కోల్‌కతా లో అగ్ని ప్రమాదానికి గురైన ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో వీరిరువురూ ప్రాణాలు కోల్పోయారు. వీరు నిజానికి చనిపోవలసిన అవసరం లేదు. ఆసుపత్రి యాజమాన్యం లాగానే తమ దారి తాము చూసుకున్నట్లయితే వీరు ఇప్పటికి శుభ్రంగా బతికి ఉండేవాళ్ళు. కాని వీరు తమ వృత్తి ధర్మాన్ని పాటించడానికే నిర్ణయించుకోవడంతో అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు.

ఎ.ఎం.ఆర్.ఐ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో కాలిన గాయాలకంటే ఊపిరాడక చనిపోయినవారే ఎక్కువని డాక్టర్లు చెప్పారు. సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ఆసుపత్రి కావడం వల్లన మంటలు అంటుకున్న కొద్ది సేపటికే పొగ ఎ/సి షాఫ్టుల ద్వారా వేగంగా ఆసుపత్రి అంతా వ్యాపించింది. పొగ దట్టంగా అల్లుకోవడంతో పలువురు ఊపిరాడక చనిపోయారు.

వినీత, రేమ్యలు ఇద్దరూ ఆసుపత్రి పై అంతస్ధులోని ఫిమేల్ జనరల్ వార్డులో పని చేస్తున్నారు. ఇరువురూ తమకు అప్పజెప్పిన రోగులను రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్క రోగినీ పై అంతస్ధునుండి కిందికి తెచ్చి బైటికి తీసుకు వచ్చారు. ఎనిమింది రోగులను రక్షించాక ఫ్రాక్చర్ వల్ల ఆసుపత్రిలో చేరిన తొమ్మిదవ రోగి కోసం వారు ఆసుపత్రిలోపలికి వెళ్ళారు. అప్పటికే ప్రమాదం ధాటికి విపరీతమైన వేడి వ్యాపించి పొగ దట్టంగా అల్లుకుపోవడంతో ఆ వేడికి తాళళేక, ఊపిరాడక ఇద్దరు నర్సులూ చనిపోయారు. వాళ్ళ వార్డులో కేవలం ఒక్కరు మాత్రమే చనిపోయారని ఆసుపత్రి అధికారులు చెప్పారు.


అగ్నిప్రమాదం సంభవించిన రోజూ తెల్లవారు ఝామున రేమ్య తనకు ఫోన్ చేసి ఆసుపత్రిలో మంటలు అల్లుకున్నాయని చెప్పిందని ఆమె తల్లి ఉష చెప్పింది. రోగులను రక్షించవలసి ఉండడంతో తొందర, తొందరగా మాట్లాడి ఫోన్ కట్ చేసిందని ఆమె చెప్పింది. ఉష భర్త రోజువారీ కూలీ. ఐదేళ్ళ క్రితం చనిపోయాడు. ఆంద్రప్రదేశ్ లోని ప్రవేట్ నర్సింగ్ కాలేజిలో బ్యాంకు అప్పు సాయంతో తన కూతుర్ని చదివించింది. గత సంవత్సరమే కోర్సు పూర్తి చేసి, చదువుకు చేసిన అప్పు చెల్లించడానికి కొద్ది నెలల క్రితమే నర్సుగా చేరింది.

వినీత మరణం కూడా ఆమె కుటుంబానికి పెద్ద దెబ్బ. గత నెలలోనే ఆమె తన మొదటి నెల జీతంలో మిగిలిన భాగాన్ని ఇంటికి పంపింది. తద్వారా ఆమె తన కుటుంబాన్ని ఎంతగానో సంతోషపరిచింది. రెండు నెలల క్రితమే ఆమె నర్సుగా చేరింది. తను కూడా అంధ్రప్రదేశ్ లోని ప్రవేటు నర్సింగ్ కాలేజిలో చదువుకుంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీలు. కూతురి మొదటి సంపాదన సహజంగానే వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. తమ కష్టాలు కొంతైనా తీరతాయని నమ్మారు. ఇంతలోనే తమ కూతురిని వారు కోల్పోవలసి వచ్చింది.

ఇటువంటివి ఇండియాలో సర్వ సాధారణం. కింది స్ధాయి ఉద్యోగుల చుట్టూ ఇటువంటి దుర్భర పరిస్ధితులే అల్లుకుని ఉంటాయి. మగ పిల్లలైతే చాలావరకు తమ కుటుంబంతో సంబంధాలు తెంచుకుని భార్యా బిడ్డలతో వేరు కాపురం పెడుతుంటారు. ఆ విధంగా తల్లిదండ్రుల కష్టంతో సంపాదించిన ఉద్యోగ ఫలితాన్ని తమ కుటుంబం వరకే పరిమితం చేయడం కద్దు. కాని ఆడపిల్లలు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తారు. తాము పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయినా తమ సంపాదనలో కొంతభాగాన్నైనా తల్లిదండ్రులకు పంపడానికి తహ తహ లాడుతారు. అవివాహితులైతే తమ పూర్తి సంపాదనను తల్లిదండ్రులకు అప్పజెప్పి అవసరాలకి తామే వారిని అడిగి తీసుకుంటారు. ఆ విధంగా ఆడపిల్ల సంపాదనపై ఆధారపడిన రెండు కుటుంబాలు ఇప్పుడు దిక్కులేనివయ్యాయి.

6 thoughts on “సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు

  1. అందరికీ అవకాశాలు లేని సమాజంలోంచి వలస బాట పట్టి ప్రపంచం నలుమూలల్లోకి వెళుతూ శ్రమైక జీవితంతో కుటుంబంకోసం ఆరాటపడుతున్న లక్షలాదిమంది సగటు కేరళ యువతులకు ప్రతీకలు వీళ్లు. రోజుకూలీ జీవితంలోంచి వచ్చి రోగుల కోసం ప్రాణత్యాగం చేసిన మహితాత్ములు వీళ్లు. వీళ్ల అసమాన త్యాగం గురించి ప్రశంసించటానికి కూడా మనలాంటి వాళ్లకు అర్హత లేదనుకుంటాను.

    గత వందేళ్లకు పైగా స్వాతంత్ర్యం కోసం, తమ తమ లక్ష్యాల కోసం ప్రాణాలు బలిపెట్టిన వారికి ఏమాత్రం తీసిపోని త్యాగ జీవితం వీళ్లది. వ్యక్తులుగా కాదు మొత్తం మన వ్యవస్థే ఇలాంటి నిజమైన త్యాగధనుల కుటుంబాలను ఆదుకోవాలి. ఉద్యోగ జీవితాన్ని తమ అంకిత భావంతో హిమశిఖరాలపైన నిలిపిన మహోన్నత యువతులను కన్న వారికి కాస్తంత ఆసరాను మన సమాజం ఇవ్వగలిగితే ఎంత బావుంటుందో…

    వినీత, రేమ్యా రంజన్… జాతి కలకాలం గుర్తుపెట్టుకోవలసిన ప్రతీకాత్మలు. నిజంగా చాలా మంచి స్మరణ.

  2. వీళ్ళిద్దరూ గనక నా ముందు నిలబడితే , వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద చల్లుకునే వాడిని.
    మదర్ తెరెసా కి ఏమాత్రం తక్కువ కాదు వీళ్ళు. ఎవడి స్వార్ధం, ఎవడి డబ్బు, ఎవడి ఆస్తి పాస్తుల కోసం మాత్రమె శ్రమిస్తూ, పక్కవాడిని తమ స్వార్ధం కోసం చంపడానికి కూడా వెనుకాడని ఈరోజుల్లో, ఇంత గొప్ప త్యాగం గురించి వినటం, కళ్ళ వెంపటి నీళ్ళను తెప్పిస్తుంది, అమ్మలారా మీ ఇద్దరికీ నా కన్నీటి వీడ్కోలు.. :(

  3. సాధారణంగా మనం పాఠ్యగ్రంధాలలోనూ, అందంగా ముద్రించబడిన రకరకాలగ్రంధాలలోనూ స్ఫూర్తిదాయకులైన వ్యక్తుల గురించి చదువుతూ ఉంటాము. కాని, అటువంటి వ్యక్తులు అంత్యంత సామాన్యలలో కూడా ఉంటారనీ, మనమధ్యే తిరుగుతూ ఉండవచ్చనీ ఊహించము.

    అనేక మంది స్ఫూర్తిదాయకుల గురించి మీడియా ద్వారా బయటపడటం అనేది యీ మధ్య జరుగుతున్న మంచి పరిణామం.

    ఇదే లేక పోతే స్ఫూర్తిదాయకులంతా యే విదేశాల్లోంచో, యే రాజగృహాల్లోంచో, యే గొప్ప పార్టీ నాయకుల మధ్యనుంచో, యే సినీమాయావులలోకంనుంచో ఊడి పడతూ ఉంటారన్న భ్రమలోనో జీవిస్తూనే ఉంటాం. సోనియాజీలాంటి త్యాగజీవి ఇండియాలో లేరులాంటి మాటలు విని తరించిపోతూనే ఉంటాం.

    సాహస కేరళ నర్సులకు నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి.

  4. బాగా చెప్పారు.

    అసలు సోనియా త్యాగం చేసిందనడమే పెద్ద అభాస.

    ప్రధాన మంత్రి పదవి పెద్ద బాధ్యత అన్న సంగతి మర్చిపోయి అదొక కిరీటంగాలాగానో, సంపాదనకు మార్గంలాగానో భావించడం వల్ల ఈ ‘సోనియా త్యాగం’ పుట్టుకొచ్చింది.

    నిజానికి సోనియా పదవీ త్యాగం చేసిన దాఖలాలు కూడా లేవు.
    మొదటిసారి ప్రధాన మంత్రి పదవికి ప్రయత్నించి తగిన బలం లేక విరమించుకుంది. దాన్ని త్యాగం అన్నారు.
    తర్వాత అవకాశం వచ్చినా విదేశీ ముద్రతో సొంత పార్టీనుండే వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో, అమెరికా తదితర పశ్చిమ దేశాల సలహా రూపంలోని ఆజ్ఞలతో అనివార్యంగా మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా నియమించారు. అది కాస్తా ‘అపూర్వ సోనియా త్యాగం’ గా మారిపోయింది.

    పోనీ ప్రధాని పదవి సోనియా త్యాగం చేసిందనుకున్నా, ఆ త్యాగం వల్ల లబ్ది పొందిందెవరు? త్యాగం అన్నది ఒకటుంటే ప్రజలు దానివల్ల లబ్ది పొందాలి. సోనియా బదులు మన్మోహన్ వస్తే ప్రజలు అదనంగా పొందిన లబ్ది ఏమిటి? పైగా మరిన్ని సంస్కరణలతోటి ప్రజల నడుం విరగ్గొట్టడానికే మన్మోహన్ కాచుక్కూచున్నపుడు. రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి సుతరామూ అంటున్న మన్మోహన్ ని చూస్తే ఆయన వల్ల ప్రజలకు వచ్చిన లబ్ది ఏమిటో అర్ధం అవుతుంది.

    ఇటువంటి పనికిమాలిన త్యాగాలతో కేరల సిస్టర్స్ త్యాగం పోల్చదగింది కాదు. వారి ప్రపంచం చాలా చిన్నది. వారి చిన్న ప్రపంచం పరిధిలో చూసినట్లయితే వారు చేసిన త్యాగం హిమాలయ సమానం. కాని వారు చేస్తున్నది త్యాగం అని వారికి తెలియదు. త్యాగం అని తెలియకుండా జరిగితేనే అది అసలైన త్యాగంగా రూపొందుతుందని కేరళ సిస్టర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

వ్యాఖ్యానించండి