జపాన్ లో మరో అణు ప్రమాదం, రేడియేషన్ నీరు లీకేజి


జపాన్ లో మరో అణు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాయవ్య జపాన్ లో నెలకొల్పిన ఇక అణు విద్యుత్ కర్మాగారంలోపల రేడియెషన్ కలిసి ఉన్న నీరు లీక్ అవుతున్నట్లు కనుగొన్నారని తెలుస్తోంది. ఈ రేడియెషన్ లీకేజి అణు విద్యుత్ కర్మాగారం లోపలి వరకే పరిమితం అయిందనీ, ఇంకా వాతావరణంలోకి వెలువడలేదనీ తెలుస్తోంది. అయితే వాతావరణంలోకి రేడియేషన్ విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకున్నదీ లేనిదీ తెలియరాలేదు.

వాయవ్య జపాన్ లో ఉన్న క్యుషు ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (కెప్కో) కి చెందిన జెంకై అణు విద్యుత్ కర్మాగారంలో తాజా ప్రమాదం సంభవించిందని ‘ది హిందూ’ తెలిపింది. సంఘటన గురించి సాధ్యమైనంత తగ్గించి చెప్పడంలో జపాన్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. కెప్కో తన కర్మాగారంలో ‘పంపు సమస్య’ తలెత్తిందని శుక్రవారం ప్రకటించింది గానీ రేడియేషన్ లీకెజీ గురించి అది ప్రస్తావించలేదు. దానితో ప్రమాద స్ధాయిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. లీకేజి గురించి స్ధానిక అధికారులకు కంపెనీ తెలియజేయకపోవడంతో అది విమర్శలు ఎదుర్కొంటోంది.

ప్లాంటులోని శుభ్రపరిచే వ్యవస్ధనుండి కనీసం 1.8  మిలియన్ టన్నుల రేడియేషన్ నీరు లీక్ అయ్యిందని జపాన్ టైమ్స్ పత్రిక తెలిపింది. లీక్ అయిన అణు రియాక్టర్ పని చేయడం లేదనీ, అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఆపివేశారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయమే లీకేజి కనిపెట్టినప్పటికీ కంపెనీ అధికారులు స్ధానిక ప్రభుత్వానికి పంపు పని చేయడం లేదని మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. తమకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల జెంకై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “దానిగురించి సరిగ్గా రిపోర్టు చేసి ఉండవలసింది. తమ కార్పొరేట్ సంస్కృతి మార్చుకోవాలని కెప్కో వారికి నేను అనేక సార్లు చెప్పాను” అని మేయర్ హిడియో కిషిమోటో అన్నాడు.

లీక్ అయిన నీటిని పూర్తిగా రికవరీ చేసినప్పటికీ ఎంత రేడియో ధార్మికత ఉన్నదీ తెలియలేదని కెప్కో తెలిపింది. శుబ్రపరిచే వ్యవస్ధ వరకే లీక్ అయినట్లయితే అది వెంటనే రేడియేషన్ ప్రమాదానికి దారితీయకపోవచ్చని అణు, పరిశ్రమల భద్రతా ఏజన్సీ తెలిపింది. అయితే లీకెజీ కారణాన్ని పూర్తిగా పరిశోధించాలని అది కెప్కోని కోరింది. గతంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ రియాక్టరును పని చేయడం నిలిపివేసినట్లు తెలుస్తోంది. కెప్కో రియాక్టర్ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు, ప్రమాదం స్ధాయి ఇంకా అందవలసి ఉంది.

వ్యాఖ్యానించండి