జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది.
ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున ఎంక్వైరీలు వెల్లువెత్తుతున్నాయని వారు చెప్పారు. సమస్య వచ్చిన పాలపొడి మార్చి, ఏప్రెల్ నెలల్లో తయారు చేయగా జులై నుండి షిప్పింగ్ చేయడం ప్రారంభించారనీ, డబ్బాలపై అక్టోబరు 2012 గడువు ముగిసే తేదీగా ప్రకటించామని కం పెనీ తెలిపింది.
మంగళవారం పాల పొడిలో రేడియో ధార్మిక సీసియం కణాలను కనుగొన్నట్లుగా కంపెనీ చెప్పింది. రేడియేషన్ స్ధాయి ప్రభుత్వం నియమించిన ప్రమాణాలా కంటె బాగా తక్కువగానే ఉందని కంపెనీ చెప్పింది. ఈ స్ధాయి రేడియేషన్ వల్ల బేబీల ఆరోగ్యానికేమీ భంగం ఉండదనీ కంపెనీ చెప్పింది. ప్రతిరోజూ తాగినా ఏమీ కాదని కంపెనీ చెప్పింది.
రేడియో ధార్మికతకు గురయ్యినపుడు పెద్దల కంటే పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతారు. క్యాన్సర్ తో పాటు ఇతర జబ్బులకు లోనవుతారని వారు చెబుతారు. ఇప్పుడు పాపలకు వచ్చిన భయమేమీ లేదని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది.
మార్చి 11 న సంభవించిన తుపాను, ఆ తర్వాత వచ్చిన సునామీ ల ఫలితంగా జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం వద్ద పేలుడు సంభవించి రేడియేషన్ వాతావరణంలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అప్పటినుండీ రేడియేషన్ విడుదలను నిపుణులు ఇంకా పూర్తిగా అరికట్టలేదు. అందువలన రేడియేషన్ ఇంకా అక్కడి గాలిలో వ్యాపించి ఉంది. అది ప్రమాదకర స్ధాయిల్లో లేదని అధికార్లు చెబుతున్నారు.