హెచ్చరిక లేకుండా దాడి చేస్తే అనుమతి కోసం చూడకుండా బదులివ్వండి -పాక్ ఆర్మీ ఛీఫ్


హెచ్చరికలు లేకుండా పై దాడి జరిగితే పాకిస్ధాన్ సైనికులు తిరిగి దాడి చేయడానికి ఇక తమ పై అధికారుల అనుమతి తీసుకోనవసరం లేదని పాకిస్ధాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ కయానీ పాకిస్ధాన్ కమేండర్లకు చెప్పాడు. పాకిస్ధాన్ చెక్ పోస్టులపై దాడి చేసి అమెరికా కమెండోలు పాక్ సైనికులను చంపడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

“ఏ ఒక్క పాకిస్ధాన్ కమాండర్ మదిలో కూడా ఈ విషయంలో, ఏ స్ధాయిలోనైనా సరే, ఎటువంటి అనుమానం ఉంచుకోరాదు. తిరిగి బదులివ్వడానికి సంబంధించిన సూత్రాలలో ఇక అనుమానాలు ఉండొద్దు. దాడి జరిగినట్లయితే అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ శక్తివంతంగా బదులివ్వడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందుకోసం మీరు అనుమతి కోరవలసిన అవసరం లేదు” అని పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ అస్ఫక్ కయానీ తన కమేండర్లకు చెప్పాడు.

ఈ నిర్ణయంతో ఆఫ్ఘన్, పాకిస్ధాన్ సరిహద్దులో మిలిటెంట్ల రాకపోకలపై కాపలాగా ఉన్న పాకిస్ధాన్ బలగాలు పాటించాల్సిన సూత్రాలలో మార్పులు వస్తాయని పాకిస్ధాన్ అధికారి చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “గతంలో, కేవలం మమ్మల్ని మేము రక్షించుకున్నాము. లేదా మిలిటెంట్లకు బదులిచ్చాము. ఇకనుండి పరిస్ధితి అలా ఉండదు. దాడికి గురయినప్పుడు పైనుండి ఆదేశాల కోసం చూడకుండా దాడికి బదులివ్వ వలసి ఉంటుంది” అని ఆ అధికారి చెప్పాడు.

తాజా నిర్ణయం సరిహద్దుల వద్ద ఉద్రిక్తలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అనుకోని పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. నిజానికి అమెరికా కాల్పులు ప్రారంభించినపుడు పాకిస్ధాన్ బదులివ్వడానికి ప్రయత్నించిందనీ కాని యుద్ధ విమానాలు సమయానికి రాలేకపొవడంతో సాధ్యపడలేదని పాక్ అధికారులు చెబుతున్నారు. “పాకిస్ధాన్ ఎయిర్ ఫోర్స్” కూడా పాకిస్ధాన్ సైనికులతో జత కలిసినట్లయితే ప్రతిస్పందన ఇంకా శక్తివంతగా ఉండేది. అయిది అది పాక్ ఎయిర్ ఫోర్స్ తప్పు కాదు” అని పాక్ అధికారి తెలిపాడని తెలుస్తోంది. కమ్యూనికేషన్స్ దెబ్బతినడంతో విమానాలు సమయానికి స్పందించలేకపోయాయని అధికారి చెప్పాడు.

అమెరికా దాడిపైన పాక్ ప్రజల ఆగ్రహావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇంకా ప్రదర్శనలు తీస్తూనే ఉన్నారు. శుక్రవారం ప్రార్ధనలు ఇందుకు కేంద్రంగా మారాయి.

 

వ్యాఖ్యానించండి