శరద్ పవార్ కి ఏకంగా చెంప దెబ్బే


జార్జి బుష్ పైన ఓ ఇరాక్ విలేఖరి చెప్పి విసిరిన నాటినుండి “చెప్పు విసరడం” అన్నది ఒక పెద్ద నిరసన కార్యక్రమంగా ముందుకొచ్చింది. ఈ నిరసన రూపం ప్రపంచం అంతా శరవేగంగా వ్యాపించిందంటే అతిశయోక్తి కాదు. ‘ఆ బూటు సైజు ఫలనా’ అని వ్యాఖ్యానించి అదేమంత పెద్ద విషయం కాదంటూనే జార్జి బుష్షు సదరు విలేఖరిని జైలుకి పంపి కసి తీర్చుకున్నాడు. తాజాగా భారత వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏకంగా చెంప దెబ్బే తిని జార్జి బుష్ ని మించిపోయాడు.

న్యూఢిల్లీలోని ఓ పబ్లిక్ ఆడిటోరియంలో జరుగుతున్న సాహిత్య సభకు గురువారం శరద్ పవార్ హాజరయ్యాడు. కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా విలేఖరుల మధ్యనుండి దూసుకు వచ్చిన హర్వీందర్ సింగ్ శరద్ పవార్ చెంపపైన కొట్టాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. శరద్ పవార్ అవినీతిపరుడనీ, అవినీతి, పెరుగుతున్న ధరల వల్లనే శరద్ పవార్ చెంపపై కొట్టానని ఆ తర్వాత హర్వీందర్ సింగ్ విలేఖరులతో చెప్పాడు.

మాజీ టెలికం మంత్రి సుఖ్ రాం కి గత శనివారం రోహిణి కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ సందర్భంగా కోర్టు పరిసరాలలో సుఖ్ రాం పైన దాడి చేసిన వ్యక్తి కూడా హర్వీందర్ సింగే కావడం గమనార్హం. అవినీతి కేసులో శిక్ష పడిన సుఖ్ రాం కోర్టు బైటికి వస్తుండగా ఆయనపైన దాడి చేసి చేయి చేసుకున్నాడు.

శరద్ పవార్ చెంపపై కొట్టాక శరద్ పవార్ కొంత బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి నిలదొక్కుకుని ఏమీ జరగనట్లుగానే ఆడిటోరియం గేటు గుండా బైటికి వెళ్లి కారులో కూర్చునట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. దాడి జరిపిన హర్వీందర్ ముప్ఫైలలొ ఉన్నాడని తెలుస్తోంది. ప్రవేటు సెక్యూరిటీ గార్డులు వెంటనే హర్వీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒక అధికారి హర్వీందర్ పైన పిడి గుద్దులు కురిపించి పవార్ తరపున బదులు తీర్చుకున్నాడు.

“అతను అవినీతిపరుడు” అని శరద్ పవార్ ను ఉద్దేశించి హర్వీందర్ పెద్దగా కేకలు వేశాడు. “నేను మంత్రిని కొట్టడానికి పధకం వేసుకుని వచ్చాను” అని విలేఖరులతో చెప్పాడు. “వాళ్ళంతా అవినీతిపరులే” అని హర్వీందర్ కేకలు వేశాడు. శిక్కు మత సంప్రదాయాలకు అనుగుణంగా హర్వీందర్ చిన్న కత్తిని ధరించి ఉన్నాడు. ఈ రోజు గురు తేజ్ బహదూర్ అమరులైన రోజు కాకుంటే పరిస్ధితి ఇంకా ఘోరంగా ఉండేదని హర్వీందర్ వ్యాఖ్యానించాడు.

అనంతరం సంఘటనపై విలేఖరుల ప్రశ్నలకు శరద్ పవార్ స్పందించాడు. చర్యను ‘స్టుపిడ్’ అని అభివర్ణిస్తూ అదేమంత పెద్ద విషయం కాదని అన్నాడు. కేసు పెడతారా అన్న ప్రశ్నకు అది పోలీసుల పని శరద్ పవార్ తన ఉద్దేశ్యం చెప్పేశాడు. ఇతరులు నామ మాత్రంగా ప్రకటన చేసినట్లుగా కూడా శరద్ పవార్ చెయ్యదలుచుకోలేదు కాబోలు. తనకు అతి తక్కువ భద్రత ఉంటుందని దానినే యువకుడు అనుకూలంగా తీసుకున్నాడని శరద్ పవార్ వ్యాఖ్యానించాడు.

శరద్ పవార్ అవినీతిపరుడని చెప్పడంలో అనుమానాలు అనవసరం. ఆయనకు మంత్రి పదవి కూడా సరిపోక భారత క్రికెట్ బోర్డ్ పదవిని కూడా అలంకరించి తన సరదా తీర్చుకుంటున్నాడు. ఆయన ధన దాహం అలా ఉంది. అయితే, కేంద్రమంత్రిపైన బహిరంగంగా చేయి చేసుకోవడం తగనిపని. నిరసన చేయడానికి ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అవినీతి వల్ల జీవితంలో బాగా నష్టపోయినవారు చెప్పు విసరడం లాంటి చర్యలకు దిగినప్పుడు కూడా అర్ధం చేసుకోవచ్చు. కాని చేయి చేసుకోవడం తగినది కాదు. పోలీసులతో ఘర్షణలో అటువంటి చర్యలు గుంపులో గోవిందంగా కలిసిపోతాయి. ప్రత్యేకంగా ఒక సాహితీ సభకు హాజరైనప్పుడు దాడి చేసి కొట్టడం బొత్తిగా తగనిపని.

2 thoughts on “శరద్ పవార్ కి ఏకంగా చెంప దెబ్బే

  1. nenu e cempa debbanu samardistunnanu……..elanti chempa debbalu okati antanio mino (sonia gandhi) ,Raul vinci (Rahul gandi),pigvijay singh( digvijay singh) ,bone less prime minister( manmohan singh) ku kuuda padali……….

వ్యాఖ్యానించండి