
పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ మెమోను తాను అమెరికాలో పాకిస్ధాన్ రాయబారి హుస్సేన్ హక్కాని ఆదేశాల మేరకు మైక్ ముల్లెన్ కు చేరవేశానంటూ “ఫైనాన్షియల్ టైమ్స్” పత్రికలో ఆర్టికల్ రాయడంతో ఈ వ్యవహారం బహిరంగం అయ్యింది.
పాకిస్ధాన్ తాలిబాన్, హక్కాని గ్రూపులతో పాక్ ఆర్మీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ కి సంబంధాలు ఉన్నాయనీ వారి ఆదేశాల మేరకే హక్కానీ గ్రూపు ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా టార్గెట్ లపైన దాడులు చేస్తున్నదనీ, నిజానికి హక్కానీ గ్రూపు ఐ.ఎస్.ఐ, పాక్ మిలట్రీల చేతుల్లో సాధనమనీ రెండు నెలల క్రితం అమెరికా సెనేట్ కి ఇచ్చిన సాక్ష్యంలో మైక్ ముల్లెన్ ఆరోపించాడు. ఈ ఆరోపణలను పాకిస్ధాన్ తీవ్రంగా తిరస్కరించింది. అసలు హక్కానీ గ్రూపు సి.ఐ.కి తయారు చేసినదేననీ, ఒకప్పుడు హక్కానీ గ్రూపుకి ఆయుధాలు, నిధులు ఇచ్చి పెంచి పోషించింది సి.ఐ.ఏ మాత్రమేననీ అలాంటి హక్కానీ గ్రూపుకి పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో సంబంధాలు అంటగట్టడం తగదనీ పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బానీ తీవ్రంగా నిరసించింది. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలకు పాక్ ని బాధ్యురాలుగా చేయడం అమెరికా మానుకోవాలని కూడా రబ్బానీ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ వివాదంలో మైక్ ముల్లెన్ వాదనకు మద్దతుగానే తాను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు అక్టోబరు 10 తేదీన ఆర్టికల్ రాశానని మన్సూర్ ఇజాజ్ చెబుతున్నాడు. పాక్ ఆర్మీ, ఐ.ఎస్.ఐ లపైన మైక్ ముల్లెన్ ఆరోపణలలో నిజం ఉందని చెప్పడానికే తాను ఆ ఆర్టికల్ రాశానని ఆయన చెబుతున్నాడు. అయితే మైక్ ముల్లెన్ తనకు నోట్ అందలేదని మొదట చెప్పినప్పటికీ వివాదం ముదిరాక నోట్ అందినమాట వాస్తవమేననీ కాని విశ్వసనీయత లేనందున దానిని తాను నమ్మకుండా ఎటువంటి చర్యా తీసుకోలేదనీ చెబుతున్నాడు. అమెరికాలో పాక్ రాయబారి హుస్సేన్ హక్కానీ మాత్రం మెమో వెనుక తాను లేనని గట్టిగా నిరాకరిస్తున్నాడు. పాక్ ప్రభుత్వం హుస్సేన్ హక్కానీని స్వయంగా వివరణ ఇవ్వాలని కోరడంతో పాకిస్ధాన్ కు బయలుదేరాడు. తన రాయబారి పదవికి రాజీనామా చేయడానికి హక్కానీ సిద్ధపడ్డాడు.
నవంబరు 18 తేదీన పాకిస్ధాన్ ఆంగ్ల పత్రిక ‘ది న్యూస్’, ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెబ్ సైట్ లు మెమో పూర్తి పాఠాన్ని ప్రచురించాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆదేశాల మేరకు రాసినట్లుగా చెబుతున్న ఈ మెమోలో ప్రధానంగా ఈ క్రింది అంశాలు చోటు చేసుకున్నాయి. 1. బిన్ లాడెన్ ను అమెరికా ప్రత్యేక బలగాలు హత్య చేసిన అనంతరం పాకిస్ధాన్ ఆర్మీ అధికారి జనరల్ ఆష్ఫక్ పర్వేజ్ కయాని పాక్ పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలి. మైక్ ముల్లెన్ నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. 2. అందుకు ప్రతిఫలంగా పాకిస్ధాన్ రక్షణ కోసం కొత్త భద్రతా సలహా బృందాన్ని పాక్ ప్రభుత్వం నియమిస్తుంది. ఆ బృందంలో ఎవర్ని నియమించాలనే విషయంలో అమెరికా సలహాలను పాకిస్ధాన్ స్వీకరిస్తుంది. 3. బిన్ లాడేన్, పాకిస్ధాన్ లో ఎలా ఆశ్రయం సంపాదించాడన్న అంశంపై దర్యాప్తు చేయడానికి పాకిస్ధాన్ పరిశోధనా బృందాన్ని నియమిస్తుంది. అందులో ఎవరు ఉండాలన్నది అమెరికా ప్రతిపాదించవచ్చు. 4. ఆల్ ఖైదా నాయకుడు ఐమన్ ఆల్-జవహరి, తాలిబాన్ అధిపతి ముల్లా ఒమర్ లాంటి వారిని టార్గెట్ చేసి చంపడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాక్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుంది. 5. పాకిస్ధాన్ వద్ద ఉన్న అణ్వస్త్రాల విషయంలో అమెరికా పర్యవేక్షణను పాకిస్ధాన్ ప్రభుత్వం అనుమతిస్తుంది.
ఈ ఐదు అంశాలు పాకిస్ధాన్ సార్వభౌమత్వాన్ని చాలా వరకూ అమెరికా కాళ్ళదగ్గర పడవేసేవే. వ్యాపారి మన్సూర్ ఇజాజ్, పాక్ రాయబారి హుస్సేన్ హక్కాని ల మధ్య బ్లాక్ బెర్రీ మెసెంజర్ ద్వారా జరిగిన సంభాషణను కూడా ‘ది న్యూస్’ పత్రిక ప్రచురించింది. ఇందులో ఇజాజ్ ను మెమో విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నట్లుగా సంభాషణ ఉన్నది.
అసలు ఈ తతంగమంతా పాకిస్ధాన్ మిలట్రీ చేస్తున్న కుట్ర అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి పాక్ ఆర్మీ ఈ కుంభకోణానికి రూపకల్పన చేసిందని వారు భావిస్తున్నారు. పాకిస్ధాన్ రాయబారిగా ఉన్న హుస్సేన్ హక్కానీ పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీకి నమ్మకమైన మనిషి ఐనందున అతన్ని తొలగించడానికి పాకిస్ధాన్ ఆర్మీ ఈ పన్నాగం పన్ని ఉండవచ్చునని కూడా వారు భావిస్తున్నారు. డాన్ పత్రికలో వ్యాఖ్యానిస్తూ రాజకీయ వ్యాఖ్యాత ‘సిరిల్ ఆల్మీదా’ “హక్కానీ/జర్దారీ వాస్తవంతో ఆ విధంగా సంబంధం లేకుండా ఎలా ఉండగలరు?” అని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వం కూల్చివేతకు ఆర్మీ ప్రయత్నించడం అన్నది పూర్తిగా అవాస్తవమనీ, అటువంటి అవాస్తవాన్ని హక్కాని గానీ జర్దారీ గాని ఎలా నమ్ముతారన్నది అతని ప్రశ్న. “పాక్ సైన్యం మళ్ళీ తన మాయోపాయాలను తెరమీదకు తెస్తోంది” అని సిరిల్ వ్యాఖ్యానించాడు.
పాకిస్ధానీ అమెరికా వ్యాపారి మన్సూర్ ఇజాజ్ కు అమెరికా రాజకియ నాయకులు చాలామంది తనకు తెలుసని చెప్పుకుంటాడనీ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నపుడు ‘బిన్ లాడెన్ అప్పగించడానికి సూడాన్ క్లింటన్ తో ఒప్పందానికి రావడానికి అంగీకరించిందనీ అయితే సూడాన్ తో వ్యవహారం నడపడం ఇష్టం లేక క్లింటన్ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్గర్ అందుకు నిరాకరించాడనీ మన్సూర్ చెప్పినట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక తెలిపింది. అయితే దీనిని బెర్గర్ వెంటనే ఖండించినట్లుగా తెలుస్తోంది. మెమో వెల్లడితో పాక్ ప్రభుత్వం, ఆర్మీల ఇరు పక్షాల వైపు చేరిన విశ్లేషకులు తమ వాదనలను జోరుగా వినిపిస్తున్నారు. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య సంబంధాల మెరుగుకు హుస్సేన్ హక్కానీ సమర్ధవంతంగా పని చేశాడనీ ఆయనను తొలగిస్తే పాకిస్ధాన్ నష్టపోతుందనీ కొందరు చెబుతున్నారు.
ఏదేమైనా పాకిస్ధాన్ రాజకీయాల్లో పౌర ప్రభుత్వం, సైన్యము పరస్పరం డీకొంటూ మధ్యలో అమెరికా చొరబాటుకి అవకాశం ఇవ్వడం పాకిస్ధాన్ ప్రజలకు తీరని ద్రోహం చెయ్యడమే అవుతుంది. వీరికి పాక్ ప్రజల ప్రయోజనాలు పట్టవు గనక పాక్ ప్రజలు తమకు కావలసినవారిని నియమించుకోవలసిన అగత్యం ఉంది. అది పార్లమెంటు ద్వారానే కావలసిన అవసరం లేదు.