ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం


అమెరికా ప్రవేటు బహుళజాతి కంపెనీల ఇష్ట సఖుడు, భారత ఆర్ధిక వ్యవస్ధ ను అమెరికాకు కట్టిపడవేయడానికి దీక్షగా కృషి చేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన తప్పును అంగీకరించాడు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతున్నప్పటికీ తగ్గుతుందంటూ దొంగ కబుర్లు చెప్పి ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరికి తన పొరపాటు అంగీకరించాడు. ద్రవ్యోల్బణం తగ్గడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కేవలం ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదల పైనే పూర్తిగా ఆధారపడుతూ వచ్చిన ప్రణాళికా సంఘం, ద్రవ్యోల్బణం అంచనా వేయడంలో విఫలమయ్యిందని అంగీకరించాడు.

పొరబాటు అంగీకరించే సయంలో కూడా తప్పును నెట్టివేయడానికి మాంటెక్ సింగ్ విఫల ప్రయత్నం చేశాడు. స్వల్పకాలిక అంచనాలలో తప్పులు దొర్లడానికి ఎల్లప్పుడూ అస్కారం ఉంటుందంటూ తప్పుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ మాటల ద్వారా దాదాపు మూడు సంవత్సరాలనుండి ద్రవ్యోల్బణం తగ్గకుండా ఉన్న సంగతీ, ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందక నానా పాట్లు పడ్డ సంగతినీ కప్పి పెట్టాలని అహ్లూవాలియా ప్రయత్నించాడు. మధ్య కాలికం నుండీ దీర్ఘకాలికం వరకూ చూసినా ద్రవ్యోల్బణం ఏ మాత్రం తగ్గుదల నమోదు చేయక పోగా అంతకంతకూ పెరుగుతూ పోయిన సంగతిని ప్రజలకు అనుభవం అవుతూనె ఉంది. ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండగానే మరో పక్క అనేకసార్లు పెట్రోల్, డీజెల్, గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచి తద్వారా మరింతగా ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదపడిన ప్రభుత్వ చర్యలను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇంకా సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం క్షమార్హం కాదు.

“ద్రవ్యోల్బణం గతం నాటికే ఒక మాదిరి స్ధాయికి తగ్గుతుందని అంచనా వేసిన మాట నిజం. ఆ మేరకు మా విశ్వసనీయతపై అనుమానాలు ఏర్పడ్డాయి” అని మాంటెక్ సింగ్ ప్రముఖ ‘డెవిల్స్ అడ్వకేట్’ కార్యక్రమంలో పేర్కొన్నాడు. “స్వల్పకాలిక అంచానాలు తప్పుకావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని గుర్తించాలి” అంటూ తప్పుకోవడానికి మాంటెక్ ప్రయత్నించాడు. మళ్ళీ తన పాత అబద్ధాలను పునరుల్లేఖిస్తూ ద్రవ్యోల్బణం రానున్న మార్చి 2012 నాటికి 7.0 – 7.5 మధ్యకు చేరుకునే అవకాశం ఉందని సింగ్ చెప్పాడు. ప్రధాన ద్రవ్యోల్బణం అక్టోబరు నాటికి 9.73 శాతం గా నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం, నవంబరు 5 నాటికి 10.63 శాతంగా నమోదయ్యింది. ఇది ఏడు శాతానికి తగ్గినా చాలా ఎక్కువగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం మూడు శాతం ఉండడం ఆరోగ్యకరం అని ప్రపంచవ్యాపితంగా విశ్లేషకులు భావిస్తుండగా ఆర్.బి.ఐ మాత్రం ఇండియా విషయంలో అది ఐదు శాతం ఉంటే చాలని చెబుతోంది. అది కూడా సాధించడంలో ఆర్.బి.ఐ, భారత ప్రభుత్వాలు పదే పదే విఫలం అవుతున్నాయి.

ద్రవ్యోల్బణం తగ్గుతుందని ప్రధాని మన్మోహన్ నుండి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం, ఆర్ధిక మంత్రి తదితరులంతా సందర్భం వచ్చినప్పుడల్లా శుష్క వాగ్దాలాలు చేస్తూ వచ్చారు. అసలు వారు ద్రవ్యోల్బణం సంగతిని సీరియస్ గా తీసుకున్నట్లుగా వారు ఎప్పుడూ కనిపించలేదు. పత్రికలు అడిగినప్పుడల్లా నోటికొచ్చిన అంకె చెప్పి తప్పించుకోవడం తప్ప ద్రవ్యోల్బణం తగ్గుదలకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలన్న ధ్యాసే లేదు. అదేమంటే ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పెంచడం తద్వారా రుణాలను ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేయడం తప్ప అసలు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం వారు చేయలేదు. ఆర్ధిక వ్యవస్ధకు సమాంతరంగా నల్లధనం మరొక ఆర్ధిక వ్యవస్ధను నడుపుతున్నదని ప్రభుత్వాలు కూడా చెప్పడం తప్పించి దాన్ని అరికట్టడాని ప్రయత్నాలను ప్రభుత్వాలు చెయ్యలేదు. విదేశాల్లో నల్లడబ్బు దాచుకున్న వారి పేర్లను దాచిపెట్టడంలో ఉన్న ఆసక్తి భారత ప్రభుత్వ పెద్దలకు నల్లడబ్బును వెనక్కి తీసుకురావడంలో లేదని నిర్ద్వంద్వంగా అనేకసార్లు రుజువయ్యింది.

“మౌలిక నిర్మాణాల రంగంలో ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని పరిశ్రమల వర్గాలు ఆ అంశంపైన కేంద్రీకరించాయి. ఆర్ధిక సంస్కరణలపైన వారి దృష్టి కేంద్రీకరణ లేదు. కాని ప్రభుత్వం మాత్రం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి కృతనిశ్ఛయంతో కృషి చేస్తోంది. అందుకోసం రాజకీయ ఏకీభావం కోసం ప్రయత్నిస్తోంది. జి.ఎస్.టి (గూడ్స్ అండ సర్వీసెస్ టాక్స్), డి.టి.సి (డైరెక్ట్ టాక్స్ కోడ్) లాంటి చర్యలతో పాటు ఇతర సంస్కరణలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుంటే దానర్ధం అవి ఇక అమలు జరగవని కాదు” అని మాంటెక్ సింగ్ కరణ్ ధాపర్ తో చెప్పాడు. అయితే వాస్తవానికి స్వదేశీ, విదేశీ ప్రవేటు బహుళజాతి కంపెనీలతో పాటు విదేశీ ప్రభుత్వాలు సంస్కరణలతో పాటు మౌలిక రంగాల నిర్మాణంపైన కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంపైన తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. రిటైల్ రంగం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే గాక రోడ్లు, రైల్వేలు, వంతెనలు, స్టోరేజి గిడ్డంగులు తదితర మౌలిక వసతుల నిర్మాణాలను కూడా ద్రవ్యోల్బణం కట్టడికి అవసరం అని చెబుతూ వాటిని కూడా విదేశీ కంపెనీలకు అప్పజెప్పాలని ఒత్తిడి తెస్తున్నాయి.

వాల్ మార్ట్ లాంటి విదేశీ రిటైల్ కంపెనీలను భారత దేశంలోకి త్వరలోనే అనుమతిస్తారని తాను ఆశాభావంతో ఉన్నట్లు అహ్లూవాలియా చెప్పాడు. బడా రిటైల్ కంపెనీల రాక వల్ల స్టోరేజి సౌకర్యాలు, రవాణా వాహనాలు మెరుగుపడి ద్రవ్యోల్బణం తగ్గుతుందని మాంటెక్ సింగ్ తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రధాని కూడా ద్రవ్యోల్బణం కట్టడికి విదేశీ కంపెనీలకు దేశీయ రిటైల్ రంగం ప్రవేటీకరించాలని బోధిస్తున్నాడు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు దానికోసం విదేశీ రిటైల్ కంపెనీలను తెస్తామని చెప్పడం ప్రభుత్వ కుట్ర తప్ప మరొకటి కాదు. ఆర్ధిక వృద్ధి 8.5 శాతం పైన ఉంటుందని కొన్నాళ్లూ, కాదు కాదు 8 శాతం ఉంటుందని ఇంకొన్నాళ్లూ, అబ్బే అదేం కాదు 7.5 శాతం పక్కా అని మరి కొన్నాళ్లూ చెబుతూ వచ్చిన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇప్పుడు దానిని మరింత తగ్గించి 7.0 – 7.5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాడు.

ప్రధాని మన్మోహన్, ఆయన ఆర్ధిక సలహా బృందం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్, హోం మంత్రి పి.చిదంబరం, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ… వీరంతా ప్రజావ్యతిరేక సంస్కరణ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నియమించుకున్న మేధావులు. వారి నాయకత్వంలో ప్రజలకు పెరిగుతున్నధరలనుండి ఎన్నడూ స్వాంతన ఉండదు గాక ఉండదు.

2 thoughts on “ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం

  1. పొరపాటు కాదు, కావాలని చేసిన తప్పే. కావాలని తప్పు చేసినా అది కప్పిపుచ్చడానికి అబద్దాలు కావాలి. ఒకే అబద్దాన్ని పదిసార్లు చెపితే నమ్మరు అనిపిస్తే చివరికి నిజం ఒప్పుకోవాలి. మాంటెక్ చేసినది అదే.

వ్యాఖ్యానించండి