పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అమెరికా సాయం కోరిన అధ్యక్షుడు జర్దారీ


పాకిస్ధాన్ దివంగత మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ చుట్టూ ‘మెమో గేట్’ కుంభకోణం ముసురుకుంటోంది. అమెరికా ప్రత్యేక బలగాలు పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేసిన అనంతరం పాకిస్ధాన్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి మిలట్రీ ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుతుందన్న భయంతొ అది జరగకుండా ఉండడానికి పాక్ అధ్యక్షుడు అమెరికా సహాయం కోరినట్లుగా ఒక మెమో వెల్లడి కావడంతో ‘మెమో గేట్’ కు తెరలేచింది.

అమెరికాలో పాక్ రాయబారిగా పని చేస్తున్న హుస్సేన్ హక్కానీ పాక్ అధ్యక్షుడు తరపున అమెరికా ప్రభుత్వానికి ఏ మెమో పంపినట్లుగా వెల్లడయ్యింది. వార్త వెలువడ్డాక పాక్ రాయబారి రాజీనామా చేసి పాకిస్ధాన్ కు వెనుదిరిగాడు. అమెరికా మాజీ జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు నేరుగా ఈ మెమో అందినట్లుగా తెలుస్తోంది. మిలట్రీ గనక పాకిస్ధాన్ లో మళ్ళీ అధికారాన్ని లాక్కునే పనైతే అమెరికా దాన్ని నివారించాలని ఆ లేఖలో కోరినట్లుగా తెలుస్తోంది. హక్కాని బుధవారం రాజీనామా చేసినప్పటికీ దానిని ఇంకా ఆమోదించలేదు. హక్కానీ ఆదేశాల మేరకు సదరు మెమోను మైక్ ముల్లెన్ కు చేరవేసినట్లుగా పాకిస్తాని-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ వెల్లడించాడు.

అమెరికా సహాయం కోరడం ద్వారా పాక్ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా కాళ్ళపైన పడేసిందని  పార్లమెంటు లోపలా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హక్కాని పాక్ జాతీయ అసెంబ్లీకి వివరణ ఇవ్వవలసిందిగా కోరామనీ పాక్ రాజకీయ నాయకులు రాజకీయ పరిపక్వత కనబరచాలనీ పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కోరుతున్నాడు. ప్రతిపక్ష నేత చౌదరి నిసార్, ఉభయ సభలను సమావేశపరచి మెమో విషయం చర్చించాలని డిమాండ్ చేస్తున్నాడు. రెండు రోజూల క్రితం వరకూ మెమో లోని కొన్ని అంశాలు మాత్రమే బహిర్గతమయ్యాయి. మన్సూర్ ఇజాజ్, ఫైనాన్షియల్ టైమ్స్ లో రాసిన ఆర్టికల్ ద్వారా ఈ అంశాలు వెల్లడి అయ్యాయి. ఐతే శుక్రవారం మెమో లోని పూర్తి వివరాలు వెల్లడి కావడంతో పాక్ రాజకీయ యవనికపై తుఫాను పరిస్ధితులు నెలకొన్నాయి. అందులో బిన్ లాడెన్ హత్యకు బాధ్యులను చేస్తూ పౌర ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర జరుగుతున్నట్లుగా పాక్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’ నడుస్తున్నట్లుగా మెమోలో పేర్కొనబడింది. “పెద్ద ఎత్తున మార్పులు జరగడానికి ఆర్మీ తెస్తున్న ఒత్తిడిని పౌరులు భరించలేరు. అధికారం నుండి పౌరులను తొలగించినట్లయితే, పాకిస్ధాన్ బిన్ లాడేన్ వారసులకు నిలయంగా మారుతుంది. ఆల్-ఖైదా బ్రాండుకి చెందిన మత పిచ్చి పాకిస్ధాన్ లో ఇక వేగంగా వ్యాపిస్తుంది. ఒసామా బిన్ లాడెన్ విషయంలో సైనిక, గూఢచార సంస్ధలు కుమ్మక్కు అయి ఉన్నందున పాకిస్ధాన్ పౌరులకు ఆ రెండింటిపైన ఆధిక్యం సంపాదించగల కీలకమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది” అని మెమో పేర్కొంది. అంటే ఒసామా బిన్ లాడెన్ అనేక సంవత్సరాలపాటు పాక్ లో తలచాచుకునేలా పాక్ అర్మీ, ఐ.ఎస్.ఐలు సహకరించాయని అందువలన ప్రజల్లో వారిపై ఆగ్రహం ఉందనీ, ఈ పరిస్ధితిని ఆసరాగా చేసుకుని పౌర ప్రభుత్వం బలపడడానికీ, సైనిక వ్యవస్ధను పౌర ప్రభుత్వం ఏలుబడిలోకి తీసుకురావడానికీ మంచి అవకాశాం వచ్చిందనీ మెమో రాసిన హక్కానీ, పాక్ అధ్యక్షుడు జర్దారీ తరపున పేర్కొన్నాడు.

పౌర ప్రభుత్వ వ్యవస్ధలను కూల్చివేయాలన్న ఆలోచనలను విరమించుకోవాలని అమెరికా, ఆర్మీ అధిపతి జనరల్ కయానీకి గట్టిగా, అత్యవసరంగా చెప్పాలని మెమో కోరింది. దానికి ఫలితంగా టెర్రరిజం, ఆఫ్ఘనిస్ధాన్, ఇండియాల విషయంలో పాక్ ప్రభుత్వం అప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాలను త్యజించడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని హామీ లభించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా పాకిస్ధాన్ జాతీయ భద్రతా వ్యవస్ధలను అమెరికాతో చారిత్రక సంబంధాలు కలిగిన వ్యక్తులతో నింపుతామనీ, తాలిబాన్, హక్కానీ గ్రూపలతో వ్యవహరించడానికి ఐ.ఎస్.ఐ లొ ఏర్పర్చిన ‘ఎస్’ విభాగాన్ని రద్దు చేస్తామనీ పాక్ ప్రభుత్వం అమెరికాకు హామీ ఇస్తున్నట్లుగా మెమోలో పేర్కొనబడింది.

అంతేకాకుండా, పాకిస్ధాన్ గడ్డపై రక్షణ పొందుతున్న ఐమన్ ఆల్-జవహరి, తాలిబాన్ నాయకులు ముల్లా ఒమర్, సిరాజుద్దీన్ హక్కానీ తదితర నాయకులపైన తగిన చర్యలను తీసుకుంటామనీ, లేదా పాకిస్ధాన్ లో అవసరమైన దాడులు చేసి తీవ్రవాదులను చంపేయడానికి మిలట్రీ ఆపరేషన్లకు అమెరికాకు అనుమతి ఇస్తామనీ పాక్ ప్రభుత్వం చెప్పినట్లుగా మెమో తెలిపింది. ఈ పధకానికి పౌర ప్రభుత్వంలో ఉన్నత వర్గాల మద్దతు ఉన్నదనీ మెమో తెలిపింది. పాకిస్ధాన్ లోకి తన ఇష్టం వచ్చిన రీతిలో జొరబడడానికి అమెరికాకి గల సామర్ధ్యం పైన ఆర్మీకి భయాలు తలెత్తాయనీ, పాకిస్ధాన్ కి చెందిన అణు బాంబుల భద్రత దృష్ట్యానే ఈ భయాలు ఏర్పడ్డాయనీ కనుక పౌర ప్రభుత్వం మునుముందు అణు బాంబుల నిర్వహణ విషయంలొ ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకుంటుందనీ మెమో ద్వారా తెలిసింది.

మెమో విషయాన్ని పాక్ రాయబార కార్యాలయం గానీ పాక్ అధ్యక్ష కార్యాలయంగానీ మొదట మెమో ఉన్న సంగతిని నిరాకరించారు. మైక్ ముల్లెన్ కార్యాలయం కూడా మెమో అందనట్లుగా చెప్పినప్పటికీ అటువంటి మెమో ఒకటి ఉందన్న విషయాన్ని ధృవీకరించింది. ఒక మెమో అందినా దానిపైన పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అంత సీరియస్ విషయం, అందునా ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో జరుగుతున్న యుద్ధాల భవితను తేల్చనున్న విషయాన్ని అంత సీరియస్ గా పట్టంచుకోలేదనడం వాస్తవదూరం.

స్వార్ధ ప్రయోజనాల కోసం పాకిస్ధాన్ దేశ సారభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడానికి కూడా పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ సిద్ధపడినట్లుగా తాజా వెల్లడి చెబుతోంది.

వ్యాఖ్యానించండి