చేయిదాటుతున్న ఇటలీ సంక్షోభం, యూరోపియన్ యూనియన్ చీలిక తప్పదా?


ఇటలీలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం చేయిదాటి పోతోంది. దాని ఫలితంగా యూరోపియన్ యూనియన్, ఒక యూనియన్ గా నిలబడలేక పోవచ్చన్న భయాలు ఏర్పడుతున్నాయి. యూరప్ లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఇటలీ సావరిన్ బాండ్లపైన వడ్డీ డిమాండ్ ఏడు శాతాన్ని మించి పలుకుతుండడంతో ఇటలీ రుణ సేకరణ అసాధ్యంగా మారుతోంది. దానితో ఇటలీకి రుణ సేకరణ కష్టంగా మారి ఇ.యు రక్షణ నిధి నుండి బెయిలౌట్ ఇవ్వవలసి ఉంటుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన ఇటలీకి బెయిలౌట్ ఇవ్వగల సామర్ద్యం ఇ.యు కి లేకపోవడమే ఆ భయాలకు కారణం. దానితో ఇ.యు చీలిపోవచ్చన్న భయాలు కూడా మార్కేట్లను వెన్నాడుతున్నాయి.

జర్మనీ, ఫ్రాన్సు అధికారులు రెండంచెల యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నట్లుగా ఇ.యు అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. ముఖ్యమైన యూరో జోన్ దేశాలతో ఖచ్చితమైన నిబంధనలతో కూడిన యూరో జోన్ ఒకటి కాగా, ఇతర బలహీన దేశాలు దాని చుట్టూ ఫ్లెక్సిబుల్ సంబంధాలు కలిగి ఉండే యూరో జోన్ మరొకటి అని వారు చెబుతున్నారు. అన్ని దేశాలకూ కఠినమైన ఫిస్కల్ విధానాలు అమలు చేయడం వలన కొన్ని దేశాలు అమలు చేయలేక బైటికి వెళ్ళిపోయే పరిస్ధితి తలెత్తుతున్నదనీ, దాన్ని నివారించడానికి అటువంటి దేశాలకు పరిమిత మైన నిబంధనలతో సరిపుచ్చాలన్న ఆలోచనను వారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదింకా సిద్ధాంత రూపంలో, చర్చల రూపంలోనే ఉన్నట్లు వారు తెలిపారు. ఇ వ్యూహం ద్వారా యూరోజోన్ కూలిపోకుండా కాపాడుకోవాలని జర్మనీ, ఫ్రాన్సులు భావిస్తున్నాయి. అయితే, జర్మనీ అటువంటి చిన్న యూరోజోన్ ఆలోచన తలపెట్టలేదని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి గురువారం తెలిపాడు.

ఇ.యు సంక్షోభంతో ఆసియా షేర్లు మూడు శాతం పైగా పడిపోయాయి. ఇండియాలో సైతం షేర్లు ఒక శాతం పైగా పడిపోయాయి. బుధవారం వాల్ స్ట్రీట్, ఇ.యు ల షేర్ మార్కెట్లు సైతం పెద్ద ఎత్తున నష్టాలను చవి చూశాయి. దక్షిణ యూరప్ దేశాలన్నింటి లోనూ జర్మనీ సావరిన్ బాండ్లతో పోలిస్తే వడ్డీ రేటు క్రమంగా పెరుగుతూ పోతోంది. ఇటలీ త్వరలో బాండ్ల అమ్మకం చేపట్టనుంది. అది ఇటలీకి పరీక్ష కానున్నది. సంక్షోభం తీవ్రం అవుతుండడంతో యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం వలన జరిగే దుష్పరిణామాల పట్ల యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జోస్ మాన్యువల్ బారోసో హెచ్చరిక జారీ చేశాడు. “యూరప్ దక్షిణాన, తూర్పున శాంతి, సంపన్నతలు లేనట్లయితే ఉత్తరాన, పశ్చిమాన కూడా శాంతి సంపన్నతలు ఉండబోవు” అని ఆయన హెచ్చరించాడు.

ఇ.సి.బి అదే పనిగా బలహీన సభ్యదేశాల సావరిన్ బాండ్లను కొంటూ ఉంటుందని భావించవద్దని ఇ.సి.బి ఛీఫ్ ఆర్ధికవేత్త హెచ్చరించాడు. “చివరి దశలో అప్పులిచ్చే పరిస్ధితి ఇ.సి.బి కి లేదు. అటువంటి సలహాను ఇ.సి.బి సభ్యదేశాలకు నేను ఇవ్వను” అని జ్యుయెర్గన్ స్టార్క్ పేర్కొన్నాడు. సావరిన్ బాండ్లను కొంటూ పోయే పరిస్ధితి వస్తే ఇ.సి.బి స్వతంత్రత ప్రమాదంలో పడుతుందనీ, ఆ పరిస్ధితి వస్తే తాను రాజీనామా చేస్తాననీ స్టార్క్ హెచ్చరించాడు. బుధవారం ఇ.సి.బి పెద్ద మొత్తాల్లో ఇటలీ బాండ్లను కొనుగోలు చేసి ఆ బాండ్లపై వడ్డీ రేటు పెరగకుండా ఉండడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఇటలీ బాండ్లపైన వడ్డీ డిమాండు ఏడు శాతాన్ని దాడిపోయింది.

యూరో జోన్, ఇటలీకి బెయిలౌట్ ఇవ్వడానికి ప్రయత్నాలేమీ చేయడం లేదని ఒక అధికారి తెలిపాడని రాయిటర్స్ తెలిపింది. ముందస్తు లోన్ కూడా ఇటలీకి ఇవ్వడం లేదు ఆయన తెలిపాడు. అయితే, బెయిలౌట్ ఇవ్వక తప్పని పరిస్ధితి తలెత్తవచ్చని మరొక అధికారి పేర్కొన్నాడు. యూరప్ దేశాలలో లోతైన వ్యవస్ధాగత సర్దుబాటు వేగంగా ప్రారంభించి పూర్తి చేయాలనీ మార్కెట్లు దాని కోసం అగవనీ జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ పేర్కొంది. కొన్ని దేశాలు యూరో జోన్ వదిలి పోక తప్పదని ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ పరోక్షంగా సూచిస్తున్నాడు. రెండంచెల యూరోజోన్ ఆలోచన ఆయనదే. నిన్న మొన్నటివరకూ యూరప్ సంక్షోభం కేంద్ర స్ధానంలో గ్రీసు ఉండగా, ఇపుడా స్ధానాన్ని ఇటలీ ఆక్రమించింది.

పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన ఇటలీ ప్రధాని బెర్లిస్కోని రాజీనామాకు రంగం సిద్ధమయ్యింది. అయితే యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేక ఎన్నికలు జరపాలా అన్నది తేలకున్నది. బెర్లుస్కోని ఎన్నికలు జరపాలని చెబుతుండగా ప్రతిపక్షాలు యూనిటీ ప్రభుత్వం వైపుకు మొగ్గు చూపుతున్నాయి. రెండు అంశాలపైనా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటలీలో రాజకీయ స్పష్టత రావాలని ఐ.ఎం.ఎఫ్ ఎం.డి కోరింది. యూరప్ ఈ పరిస్ధితుల్లో ‘పోగుట్టుకున్న దశబ్దాన్ని” (లాస్ట్ డికేడ్) ఎదుర్కోవచ్చని ఆమె హెచ్చరించింది. బీజింగ్ పర్యటనలో ఉన క్రిస్టిన్ లాగార్దే, “ఎవరు నాయకత్వ పాత్రలో ముందుకు వస్తారన్నది తెలియడం లేదు. అదే అనిర్ధిష్టతను సూచిస్తోంది” అని పేర్కొంది.

ఇటలీ ఎన్నికలు ఫిబ్రవరి లోపుగా జరిగే వీలు లేనందున ఈ కాలంలోనే మార్కెట్లలో విధ్వంసం చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. సంక్షోభ నివారణ కోసం ఇటలీ ప్రభుత్వం అప్పును తగ్గించుకోవాలనీ, కార్మీక చట్టాలను సరళీకరించాలనీ, పన్నుల ఎగవేతను అరికట్టాలనీ, ఉత్పాదకతను పెంచుకోవాలనీ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కోరుతున్నాయి. ఇవన్నీ ఇటలీలో సామాన్యప్రజానీకంపైనా, కార్మికులు, ఉద్యోగులపైనా భారాన్ని మోపే చర్యలే కావడం గమనార్హం. అప్పును తగ్గించుకోవడం అంటే ప్రజానికం కోసం తీసుకుంటున్న సంక్షేమ చర్యలపై ఖర్చు తగ్గించాలని అర్ధం. కార్మిక చట్టాలను సరళీకరించడం అంటే కార్మిక హక్కులను హరించే విధంగా చట్టాలు చేయాలనీ, ఉత్పాదకతను పెంచుకోవడం అంటే వేతనాలు తగ్గించుకుని లాభాలు పెంచుకోవాలనీ అర్ధం. కాగా పన్నుల ఎగవేత ప్రధానంగా చేసేది కార్పొరేట్ కంపెనీలే కనుక ఆ చర్యను చేపట్టే అవకాశాలు మాత్రం ఉండవు.

ఉరుము ఉరిమి మంగళం పైన పడ్డట్టుగా, యూరోజోన్ సంక్షోభం అంతిమంగా కార్మికులు, ఉద్యోగులు పైనే పడడం ఖాయం. దానికోసమే ఈ ప్రచారం, ఆందోళన, హెచ్చరికలూ అన్నీనూ.

4 thoughts on “చేయిదాటుతున్న ఇటలీ సంక్షోభం, యూరోపియన్ యూనియన్ చీలిక తప్పదా?

  1. విశేఖర్ గారికి దన్యవాదములు. మేము ఉస్మాయియా విద్యార్థులుగా ఒక మాస పత్రికను నడుపుతున్నాము. ఆ పత్రిక పేరు “క్యాంపస్ వాయిస్” మీరు చేస్తున్న ప్రయత్నం చాల అభినందనీయం…చాలా రోజులనుంచి మీ బ్లాగ్ ను ఫాలో అవుతున్నాను. మీరు అంతర్జాతీయ వార్తలను తెలుగు పాటకులకు అందించదం చాల బాగుంది… మీకు వీలైతే వంద రోజులు పూర్థి చేసుకున్న మమత బేనర్జి పరిపాలన గురించి ఒక పూర్తిస్థాయి వ్యాసం రాయండి. లేకపోతే ఎవరైన ఇప్పటికే రాసిఉంటే అనువాదమైనా చేయంది… మాకు బెంగాల్ పరిణామాలను తెలుసుకోవాలని ఉంది. ప్లేజ్ మీకు వీలైతే మా పత్రికకు కూఅడా వ్యాసాలు రాయండి

  2. డేవిడ్ గారూ, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.
    వందరోజులకే సమీక్షించాల్సిన గొప్ప పాలన మమత బెనర్జీది కాదని నా అభిప్రాయం.
    బెంగాల్ పరిణామాలు ఇతర రాష్ట్రాల కంటె భిన్నమైనవేమీ కాదు.
    చెప్పుకోవడానికి లెఫ్ట్ ఫ్రంట్ పాలన మొన్నటివరకూ ఉన్నా, అది పేరుకు మాత్రమే.
    మీ పత్రికకు ఆర్టికల్స్ రాయడానికి అభ్యంతరం లేదు. కానీ మీకు కావలసిన సమయానికి అందించడంలోనే కొన్ని సార్లు సమస్య ఎదురు కావచ్చు.
    -విశేఖర్

వ్యాఖ్యానించండి