‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి


పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో జరుగుతున్న విచారణను వేగవంతం చేస్తుందని మాలిక్ చెప్పాడు. మాల్దీవుల లో సార్క్ సభల సందర్భంగా పాకిస్ధాన్, ఇండియాల ప్రధాన మంత్రులు ఇరువురూ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను ఈ సమావేశంలో సమీక్షిస్తారని తెలుస్తోంది.

పాకిస్ధాన్ జ్యుడిషియల్ కమిషన్ ఇండియా సందర్శించడానికి పాక్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నదనీ, కొన్ని సాక్ష్యాలను సేకరించాక, అది విశ్వసనీయమైనది అయిన పక్షంలో నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి సహాయపడగలదని భావిస్తున్నట్లుగా మాలిక్ తెలిపాడు.

“జ్యుడిషియల్ కమిషన్ ఇండియా వెళ్ళాక అది కనుగొనే అంశాలు పాకిస్ధాన్ లో జ్యుడిషియల్ కార్యక్రమాలకి ముఖ్యమయిందిగా ఉంటాయి. సాక్ష్యాలు చేతికి వచ్చాక అవి అన్నివైపులనుండి ఎదురయ్యే చట్టపరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవు. అనంతరం న్యాయపరంగా సంతృప్తికరమైన ప్రకటన ఇవ్వడానికి వీలవుతుంది” అని మాలిక్ అన్నాడు. జ్యుడిషియల్ కమిషన్ ఎన్నాళ్ళు ఇండియాలో ఉంటుందన్న ప్రశ్నకు ఆయన, “మూడు నాలుగురోజుల పాటు, మీరు వారిని అతిధులుగా అంగీకరించినంతవరకూ ఉంటారు” అని తెలిపాడు.

ట్రయల్స్ ఎప్పుడు ముగుస్తాయన్న ప్రశ్నకు మాలిక్, “జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చాక ప్రాసెస్ మొదలవుతుంది. అది ఎన్నాళ్ళలో ముగుస్తుందన్నది అప్పుడే చెప్పలేం” అని చెప్పాడు. టెర్రరిస్టు సంస్ధల జాబితా నుండి ‘జమాత్-ఉద్-దవా’ ను తొలగించడంపై అడిగిన ప్రశ్నలకు ఆయన, “సమాచారం సాక్ష్యం కాజాలదు. వారిని టెర్రరిస్టు జాబితాలో ఉంచడానికి నిర్ధిష్టమైన గట్టి సాక్ష్యాలు కావాలి” అని అన్నాడు.

జమాత్-ఉద్-దవా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ ను  విడుదల చేయడం పట్ల విలేఖరులు ప్రశ్నించారు. దానికాయన “పాకిస్ధాన్ లోని అత్యున్నత కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆ విషయంలో ప్రభుత్వం చేయగలిగిందేదీ లేదు” అని చెప్పాడు. మరో ప్రశ్నకు సమాధానంగా ఒసామా బిన్ లాడెన్ పాక్ లో ఉన్న సంగతి తమకు తెలియదని చెప్పాడు. బిన్ లాడెన్ గూఢచార సంస్ధలు సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల వద్ద శిక్షణ పొందాడు. అతనికి ఎలా దాక్కోవాలో తెలుసు” అని మాలిక్ వ్యాఖ్యానించాడు.

ఇటీవల కాలంలో ఓ పక్క పాక్, అమెరికాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండగా, అనూహ్యంగా ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అమెరికా ఒత్తిడితో మొదలైన భారత్, పాక్ ల చర్చలు, ఇపుడు అమెరికా ప్రమేయం లేకుండానే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భారత్ పాక్ ల మధ్య ‘నమ్మకం రాహిత్యం’ నానాటికి తగ్గుతున్నదని రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించడం దీనికి తార్కాణం.

అమెరికా ఒత్తిడితో కాక భారత దేశ అవసరాల కోసం, భారత ప్రజల అవసరాల కోసం పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకోల్పుకోవలసిన అవసరం భారత ప్రభుత్వం పైన ఉంది. పాక్ తో నెరిపే సంబంధాలలో భారత్, పాక్ దేశాల ప్రజల ప్రయోజనాలే ప్రధమ స్ధానం ఆక్రమించాలి తప్ప అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కాదు.

4 thoughts on “‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి

  1. కసబ్ ఒక టెర్రరిస్టు అన్నది నిజమే కాని అతడికి మరణశిక్షను అమలు జరిపే దమ్ముందా మన దొరతనానికి? ఎక్కడ కొందరి మనోభావాలు దెబ్బతింటాయో నని ఘనతవహించిన మన భారత ప్రభుత్వంవారి భయం. అందుకే అతడిని పెళ్ళికొడుకులాగా మేపుతున్నారు. ఆ ఖర్చంతా ప్రజసనెత్తినే పడుతోందని గ్రహించాలి!

  2. కసబ్ అన్నవాడు బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం. ఇప్పుడు హాడావుడిగా అతన్ని ఉరి తీసినంత మాత్రాన ప్రయోజనమేమి? కసబ్ తరఫున నేను మాట్ల్లడట్లేదు. కసబ్ ని ఉరి తియ్యాలంటూ డిమాండ్ చేసే వాళ్ళు భారత రాజకీయాలని మర్చిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పరచేది రాజకీయ పక్షాలు. వారికి అవసరం ప్రజల వోట్లతో. కాబట్టి లాభ నష్టాల లెక్క రాజకీయ పక్షాలకి సహజం గానే ఉంటుంది. అందుకే అధికారం లో ఉన్నప్పుడొక మాట. ప్రతి పక్షం లో ఇంకో మాట. దీనకి ఏ రాజకీయ పక్షమూ మినహాయింపు కాదు.

  3. శ్యామలరావు గారూ, కసబ్ ను ఉరితియ్యడం ఒక సమస్యటండీ? అతన్ని ఉరితీయడానికి దమ్ములేదనడం కూడా సరికాదు. కసబ్ ఇప్పుడు ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య మెరుగుపడుతున్న సంబంధాల్లో ఒక పాచిక. పాకిస్ధాన్, ముంబై దాడులకు సంబంధించి సరైన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదానికి కసబ్ ఒక కొలబద్ద. అతను బతికుంటే, పాకిస్ధాన్ పైన ఒత్తిడి తేవడానికి పావుగా ఉపయోగపడతాడు. పైకి ముంబై దాడులపై చర్య తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ, లోపల మాత్రం పాకిస్ధాన్ లో భారత వ్యాపారస్తుల ప్రయోజనాలను నెరవేర్చడానికి బేరసారాలకు భారత ప్రభుత్వం దిగుతోంది. అందులో భాగంగానే పాకిస్ధాన్ ఇటీవల ఇండియాకి “మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (ఎం.ఎఫ్.ఎన్) హోదాను ఇచ్చినట్లు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినప్పటికీ అది అమలు కావడానికి సిద్ధంగా ఉంది. మాల్దీవుల్లో జరుగుతున్న సార్క్ సమావేశాల్లో ఎం.ఎఫ్.ఎన్ నుండి వెనక్కి తగ్గేది లేదని పాక్ మళ్ళీ ప్రకటించింది.

    మనోభావాలు దెబ్బతింటాయని కసబ్ ఉరితీత వాయిదా వెయ్యవలసిన సెన్సిబిలిటీ పాలకులకు అవసరం లేదు. కసబ్ విషయంలో అసలు అవసరం లేదు. ఎందుకంటే కసబ్ ఉరిశిక్ష వలన ఎవరికీ సమాధానం చేప్పుకోవలసిన అవసరం లేని నేరాన్ని కసబ్ చేశాడు కనుక.

వ్యాఖ్యానించండి