
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిపతి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సి.బి.ఐ కోర్టు ముందు హాజరయ్యాదు. హాద్రాబాద్ లో కోఠి సెంటర్ వద్ద ఉన్న సి.బి.ఐ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు హాజరయినట్లుగా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. గాలి జనార్ధనరెడ్డి పాల్పడిన అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించడం కోసం సి.బి.ఐ సమన్లు జారీ చేయడంతో జగన్ సి.బి.ఐ ముందు హాజరు కావలసి వచ్చింది.
గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘ఓబులాపురం మైనింగ్ కంపెనీ’ (ఒ.ఎం.సి)కి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇనుపగనుల తవ్వకానికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లుగానూ, తవ్వకాలలో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఓ.ఎం.సి అక్రమాలపై సి.బి.ఐ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్ధన రెడ్డితో పాటు ఆయన బంధువు శ్రీనివాసుల రెడ్డి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.
ఈ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 161 కింద జగన్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్ ప్రకారం ఒక కేసుకు సంబంధించి నిజాలు, నేరానికి దారితీసిన పరిష్దితుల సమాచారం తెలిసినవారిని ఎవరినైనా పోలీసు అధికారులు విచారణ చేయవచ్చు. ఈ సెక్షన్ కింద అరెస్టు చేయగల అవకాశాలు లేవని మాత్రం తెలుస్తోంది. విచారణ ఎదుర్కొంటున్నవారు తమకు తెలిసిన నిజాలను అధికారులకు చెప్పవలసి ఉంటుంది.
ఎమార్ కుంభకోణంలో కోనేరు ప్రసాద్ ను సి.బి.ఐ గురువారం ప్రశ్నించడానికి సమన్లు జారీ చేసి రోజంతా ప్రశ్నించాక నిర్భంధంలోకి తీసుకుంది. ఈ నేపధ్యంలో జగన్ కి కూడా సమన్లు జారీ కావడంతో ఆయనని కూడా అరెస్టు జారీ చేస్తారేమోనన్న ఊహాగానాలు వ్యాపించాయి. కాని ఎమార్ కుంభకోణానికి సంబంధించి కోనేరు ప్రసాద్ పాత్రకూ, మైనింగ్ కుంభకోణంలో జగన్ పాత్రకూ చాలా తేడా ఉంది. సెక్షన్ 161 ప్రకారం సమాచారం తెలుసు అని భావించినవారిని ఓరల్ గా విచారించడానికి మాత్రమే వీలు కలుగుతుంది. కనుక జగన్ అరెస్టు అయ్యే అవకాశాలు లేవు.
జగన్ ను కేవలం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి మాత్రమే ప్రశ్నించడానికి సి.బి.ఐ సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుత సమన్లు జారీ కాలేదు. జనార్ధన రెడ్డి, జగన్ ల మధ్య ఉన్న సంబంధాలపైన కూడా సి.బి.ఐ విచారణ జరుపుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఒ.ఎం.సి కంపెనీకి ఇనుప ఖనిజం తవ్వకానికి లీజు మంజూరు అయ్యింది.
సి.బి.ఐ ఇటీవల రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కూడా అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించింది. గాలి సోదరులకు మైనింగ్ లీజు మంజూరు అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డి మైనింగ్ శాఖ మంత్రిగా ఉంది. గాలి కంపెనీ ఒ.ఎం.సి కి ఇనుప ఖనిజం తవ్వకాలకు లీజు అసాధారణమైన రీతిలో తొందరగా జారీ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఇంతకీ జగన్ అక్రమాస్తుల కేసు ఏమయ్యిందీ అంతుబట్టడం లేదు. ఆ మధ్య ప్రతిరోజూ జగన్ అక్రమాస్తుల కేసుపై సి.బి.ఐ చురుకుగా కదిలినప్పటికీ ఆ తర్వాత కదలిక లేదు. ఢిల్లీ వెళ్ళి సొనియా గాంధి కాళ్ళు పట్టుకున్నందునే, జగన్ కేసు విషయంలో సి.బి.ఐ నత్తనడక మొదలుపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
