231 మంది పార్లమెంటు సభ్యత్వం సస్పెండ్ చేసిన పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్


ఎన్నికల సంస్కరణల గురించి భారత దేశ నాయకులు ఇంకా మాట్లాడడం ప్రారంభమే కాలేదు. పాకిస్ధాన్ మాత్రం ఆ విషయంలో ఓ పెద్ద ముందడుగు వేసింది. తమ ఆస్తులను నిర్ణీత వ్యవధిలోగా ప్రకటించనందుకు గాను ఏకంగా 231 మంది చట్ట సభల సభ్యుల సభ్యత్వాన్ని పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల సంస్కరణలపై కూడా తాను పోరాడుతానని అన్నా హజారే గతంలో ప్రకటించాడు. ఆయన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రకటన చేసినందుకే రాజకీయ నాయకులు తలా ఒక రకంగా మాట్లాడుతూ తమ అయిష్టతను పరోక్షంగా వ్యక్తం చేసారు.

పాకిస్ధాన్ ప్రజా ప్రతినిధుల ఆస్తుల లెక్కలపై నియమించబడిన ప్యానెల్ ప్రతినిధి తాము తీసుకున్న నిర్ణయం వివరాలను వివరించాడు. సెనేట్ (ఎగువ సభ) సభ లో 13 మంది సభ్యత్వాన్నీ, నేషనల్ అసెంబ్లీ (దిగువ సభ) లో 103 మంది సభ్యత్వాన్నీ, పంజాబ్, సింధ్, ఖైబర్-పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్ రాష్ట్రాల అసెంబ్లీలలో 115 మంది సభ్యుల సభ్యత్వాన్నీ తమ ప్యానెల్ సస్పెండ్ చేసిందని ఆయన వివరించాడు. సస్పెండ్ అయిన సభ్యుల్లో పాకిస్ధాన్ అంతర్గత శాఖా (హోం) మంత్రి రెహ్మాన్ మాలిక్, రక్షణ మంత్రి చౌదరీ అహ్మద్ ముఖ్తార్ లు కూడా ఉండడం గమనార్హం. వీరే కాకుండా ఆర్ధిక మంత్రి హఫీజ్ షేక్, వాణిజ్య మంత్రి మఖ్దూం అమీన్ ఫాహిమ్, ప్రధాన మంత్రి పుత్రుడు సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలాని లూ కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో మొత్తం 1170 మంది సభ్యులుండగా వారిలో 936 మంది తమ ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించారని తెలుస్తోంది. 1976 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం చట్ట సభలకు చెందిన ప్రతి సభ్యుడూ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 30 నాటికి తమ ఆస్తులు, అప్పుల లెక్కలను పార్లమెంటుకు సమర్పించాలి. అలా సమర్పించనివారి సభ్యత్వం మరుసటిరోజు నుండి సస్పెండ్ చేయబడుతుంది. వారు తమ ఆదాయం, ఆస్తుల లెక్కల ను సమర్పించేవరకూ వారి సభ్యత్వం సస్పెన్షన్ లోనె ఉంటుందని ప్యానెల్ ప్రతినిధి తెలిపాడు.

అవినీతి అంతం కోసం భారత దేశ వ్యాపిత యాత్ర చేస్తున్న అద్వాని సైతం ఎన్నికల సంస్కరణలలో భాగంగా ముందుకొస్తున్న ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికయిన సభ్యుడిని వెనక్కి పిలిచే హక్కు) పట్ల అయిష్టతను వ్యక్తం చేసిన నేపధ్యంలో పాక్ లో జరిగిన పరిణామం ఇండియాకు ఆదర్శం కావలసి ఉంది. ఎన్నికల చట్టాల రీత్యా భారత దేశంలో పార్లెమెంటు సభ్యుల సభ్యత్వం సస్పెండ్ అయిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. పాలక ప్రతిపక్ష పార్టీలవారు కొట్టుకున్నపుడు తప్ప సభ్యులు సస్పెండ్ అవడం ఇండియాకు అరుదైన వ్యవహారం. సైనిక వ్యవస్ధకు విశేష అధికారాలు ఉండే పాకిస్ధాన్ లోనే ఆస్తుల విషయం సీరియస్ గా తీసుకున్నపుడు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే ఇండియాలో అందుకు ఎన్నో రెట్లు ప్రజాస్వామిక స్వభావం మన పాలనా వ్యవస్ధకు ఉన్నదని భారత పార్లమెంటు రుజువు చేసుకోవలసి ఉంది.

వ్యాఖ్యానించండి