సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా రాజధానిలో నివసిస్తున్నవారు దరిద్రంలో మగ్గడం ఎవరి నిర్వాకం కిందకు వస్తుంది? సహజంగానే ఆ దేశ ప్రభుత్వం మీదికే వస్తుంది. సౌదీ అరేబియాలో ఉన్నది రాచరిక ప్రభుత్వమే తప్ప ప్రజా ప్రభుత్వం కాదు. దేశ సంపదని రాజు దోచుకు తిని ప్రజలకు దరిద్రం మిగులుస్తున్నాడని వీడియో చెప్పకనే చెప్పింది. దానితో ఫెరాస్ బగ్నా అరెస్టయ్యాడు.
పెద్ద దొంగను పట్టిస్తే జైలుకి వెళ్ళేది పెద్ద దొంగ కాదు, అతనిని పట్టించాలనుకున్నవాడేనని సౌదీ అరేబియాకే చెందిన కార్టూనిస్టు అబ్దుల్లా జాబర్ గీసిన కార్టూన్ ఇది.
