అమెరికా వ్యాపార రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన చైనీయుడు


అమెరికాలో స్ధిర నివాసం ఏర్పరచుకున్న చైనా శాస్త్రవేత్త ఒకరు అమెరికా వ్యాపార రహస్యాలను చైనాకు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ‘డౌ ఆగ్రో సైన్సెస్’ కంపెనీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేస్తూ వ్యాపార రహస్యాలను అందజేసాననీ, కార్గిల్ కంపెనీలో పని చేస్తుండగా వ్యాపార రహస్యాలను దొంగిలించానని సదరు శాస్త్రవేత్త ‘కీక్సూ హువాంగ్’ అంగీకరించాడని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ (డి.ఒ.జె) డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. గత ఆగస్టులోనే ఇదే విధంగా ‘జున్ వాంగ్’ అనే చైనీయుడు అత్యున్నత సామర్ధ్యంగల న్యూక్లియర్ రియాక్టర్ పెయింట్ ను 360 గ్యాలన్ల మేరకు పాకిస్ధాన్ కు ఎగుమతి చేస్తుండగా పట్టుబడ్డాడు. పాకిస్ధాన్ లో చైనా నిర్మిస్తున్న ఛస్మా అణు రియాక్టర్ కోసం ఈ పెయింట్ ను ఎగుమతి చేస్తునట్లుగా వెల్లడి కావడంతో జున్ వాంగ్ ను అరెస్టు చేశారు.

డౌ కంపెనీలో కీక్సూ ముఖ్యమైన ఆపరేషన్స్ విభాగంలోనే పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేశాడు. ఆగ్రో కెమికల్ మరియు బయో టెక్నాలజీ ఉత్పత్తులను ఆ కంపెనీ తయారు చేస్తుంది. 2005లో అతను ‘ప్రత్యేకమైన ప్రొప్రయిటరీ జీవ సంబంధిత కీటకనాశనుల నమూనాను అభివృద్ధి చేసే పరిశోధనకు నాయకుడుగా ఎన్నికయ్యాడు. వీటిని ప్రపంచవ్యాపితంగా మార్కెట్ చేస్తారని డౌ అధికారులు తెలిపారు. ఆ సీనియర్ పాత్రలో కీక్సూ, డౌ కంపెనీతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. దాని ప్రకారం అతను కంపెనీకి మాత్రమే పరిమితమైన సమాచారం అతని ఆధీనంలో ఉంటుంది. అందులో వ్యాపార రహస్యాలు కూడా ఉంటాయి. డౌ కంపెనీ అనుమతి లేకుండా సదరు సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదు.

కంపెనీ రహస్యాలు వెల్లడికాకుండా ఉండడానికి, అనుమతి లేకుండా వినియోగం కాకుండా ఉండడానికి కంపెనీ విధించుకున్న అనేక భద్రతా పొరలను కీక్సూ ఛేదించగలిగాడు. 2007, 2010 మధ్య కాలంలో డౌ కంపెనీ వ్యాపార రహస్యాలను దొంగిలించి జర్మనీ, చైనాలలో ఉన్న కొద్ది మంది వ్యక్తులకు చేరవేశానని కీక్సూ అంగీకరించాడు. ఆ సమయంలో అప్పటికే కీక్సూ పైన నిఘా ఉన్నట్లుగా కంపెనీ తెలిపింది. 2008లో కార్గిల్ కంపెనీ కీక్సూకు ఆహ్వానించిందనీ అక్కడ కూడా కీక్సూ బయో టెక్నాలజిస్టుగా జులై 2009 వరకు పని చేసి వ్యాపార రహస్యాలను కాపాడతానన్న ఒప్పందంపై సంతకం చేసి ఉల్లంఘించాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

ఒక కొత్త ఆహార ఉత్పత్తిని తయారు చేసే ప్రక్రియలో ఉపయోగించే కీలకమైన పదార్ధానికి సంబంధించిన వివరాలు కార్గిల్ కంపెనీకి వ్యాపార రహస్యాల కిందికి వస్తాయి. ఈ రహస్యాలను చైనాలోని హూనాన్ నార్మల్ యూనివర్సిటీ విద్యార్ధికి అందజేశానని కీక్సూ అంగీకరించినట్లుగా డి.ఒ.జె డాక్యుమెంట్లు తెలుపుతున్నాయి. కీక్సూ పాల్పడిన ఈ నేరపూరిత కార్యకలాపాల వలన మొత్తం నష్టం 7 నుండి 20 మిలియన్ డాలర్ల మధ్యలో ఉందని తెలుస్తోంది. ఆర్ధిక గూఢచర్యం కు పాల్పడినందుకు గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, వ్యాపార రహస్యాలను దొంగిలించినందుకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను కీక్సూ అనుభవించవలసి ఉంటుంది. నేరం అంగీకరించినందున శిక్షాకాలం తగ్గవచ్చు.

అమెరికాకు చెందిన అనేక కంపెనీల కంప్యూటర్లలోకి చైనా హ్యాకర్లు జొరబడి రహస్యాలు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని అమెరికా ఎప్పటినుండో ఆరోపిస్తున్నది. అమెరికా రక్షణ తదితర రంగాల ప్రభుత్వ కంప్యూటర్లలోకి కూడ చైనా హ్యాకర్లు జొరబడుతున్నారని కూడా అమెరికా ఆరోపిస్తున్నది. ఈ హ్యాకర్లు చైనా ప్రభుత్వం ఆదేశాల మేరకే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అమెరికా ప్రధాన ఆరోపణ. అయితే, చైనా ప్రభుత్వం ఆరోపణలను తిరస్కరిస్తున్నది. స్వయంగా తానే హ్యాకింగ్ బాధితురాలినని చెబుతుంది. గూగుల్ కంపెని రెండేళ్ల క్రితం ఇవే ఆరోపణలను చైనా ప్రభుత్వంపై చేసింది. చైనా గూగుల్ ల మధ్య వైరుధ్యాలు తీవ్రమై, ఒక దశలో గూగుల్ చైనా నుండి విరమించుకుంటుందని కూడా అంచనాలు ఏర్పడ్డాయి. చివరికి గూగుల్ సంస్ధే చైనా షరతులకు తలొగ్గి కొనసాగడానికి సిద్ధపడింది.

వ్యాపార రహస్యాలను దొంగిలించడం, ఆర్ధిక గూఢచర్యానికి పాల్పడడం ఇవన్నీ చైనాకే పరిమితం కాదు. చైనా కొత్తగా మొదలు పెట్టినవి కూడా కాదు. ఈ నేరాలలో అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ దేశాలది అందెవేసిన చెయ్యి. ఈ దేశాల గూఢచార సంస్ధలు సమస్య రంగాలలోనూ గూఢచర్యానికి పాల్పడడం సర్వసామాన్యం. గూఢచర్యాన్ని అత్యున్నత స్ధాయికి అభివృద్ధి చేసింది కూడా ఈ దేశాలే. నిరంతరం గూఢచర్యంలో మునిగి ఉండే దేశాలు తమపైన ఎవరూ గూఢచర్యానికి పాల్పడకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకోవడం అనివార్యం. ఆ చర్యలవల్లనే కీక్సూ లాంటి శాస్త్రవేత్తలు దొరికిపోతుంటారు.

వ్యాఖ్యానించండి