అయితే, నిజానికి దుండగుడు అని చెబుతున్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ పైన దాడి చేయలేదనీ, అతను చెప్పు విసిరింది కూడా అరవింద్ కేజ్రీవాల్ పైన కాదనీ సంఘటనా స్ధలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డి.ఎన్.ఎ (డెయిలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్) పత్రిక ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్ అనుచరుల అత్యుత్సాహమే చెప్పు విసరడానికి దారి తీసింది తప్ప అరవింద్ కేజ్రీవాల్ అతని లక్ష్యం కాదని సాక్షులు తెలిపారని డి.ఎన్.ఎ తెలిపింది.
ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్న సందర్బంగా లక్నోలో జరిగిన ర్యాలీకి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యాడు. ఆయన కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 7 గం. సమయంలో వేదికను సమీపిస్తుండగా అతని మద్దతుదారులు ఆయన చుట్టూ గుమికూడారు. వాళ్ళలో భాగంగానే చెప్పు విసిరాడని చెబుతున్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ను దగ్గరినుండి చూడడానికి ప్రయత్నించాడు. దానితో వాలంటీర్లు అతనిని దూరంగా నెట్టి వేశారు. నెట్టివేయడంతో ఆ యువకుడు ఆగ్రహం చెంది తనను నెట్టినవారిపైకి చెప్పు విసిరాడు. అదసలు అరవింద్ కేజ్రీవాల్ సమీపానికి కూడా వెళ్లలేదు. అరవింద్ కేజ్రీవాల్ పైన దాడి చేస్తున్నాడని పొరబడిన వాలంటీర్లు అతన్ని పట్టుకుని చావవాది అనంతరం పోలీసులకు అప్పగించారు.
అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన వ్యక్తి పట్ల దయతో వ్యవహరించాడు. అసలు దాడే చేయని వ్యక్తిని దాడే చేసినా క్షమించినట్లు ప్రకటించాడు. అతనిపై ఎటువంటి కేసూ దాఖలు చేయవద్దని పోలీసులను కోరాడు. ఎవరో చెప్పు విసిరారు, విసిరిన వ్యక్తిని అరవింద్ కేజ్రీవాల్ అనుచరులు కొట్టారు అన్న వార్తను అందిపుచ్చుకున్న విలేఖరులు మిగిలిన వార్తను తామే రాసుకున్నారు. అన్నా బృందంపై దాడులు ఆగవా? అని ప్రశ్నిస్తూ వార్తలు రాశారు. నిన్న ప్రశాంత్ భూషణ్, నేడు అరవింద్ కేజ్రీవాల్, రేపు ఇంకెవరు? అని ప్రశ్నిస్తూ విశ్లేషణలు రాశారు. పనిలో పనిగా అరవింద్ దయాగుణాన్ని ఎత్తి చూపారు.
“అదిగో పులి అంటే ఇదిగో తోక” అంటే ఇదే కాబోలు

ఆరవింద్ కేజ్రీవాల్ అన్నాగుంపులొ అత్యంత ముఖ్యుడు. నాకెందుకో శీతాకాల సమావేశాల్లో లోక్ పాల్ బిల్లు సంగతేమో కానీ.. అప్పటి దాకా టీం అన్నా సభ్యులు ఎంత మంది మిగిలుంటారనేది ఆసక్తి కలిగించే అంశంగా అనిపిస్తుంది.
ప్రతిభ పేరుతో రిజర్వేషన్‌లని వ్యతిరేకించే అరవింద్ కెజ్రివాల్ అన్నా హజారే వెనుక ఉండడంతో అది అగ్రకుల ఉద్యమమనే అభిప్రాయం దళితుల్లో ఉంది. అవినీతి లేని మంచి పాలన పేరుతో కుల వ్యవస్థని లీగలైజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రతిభకి కులంతో సంబంధం లేదు అనుకుంటే దళితులకి లేని ప్రతిభ అగ్రకులాలవాళ్ళకి కూడా ఉండదు అనుకోవాలి కదా. రిజర్వేషన్‌ల వల్ల ప్రతిభ దెబ్బతింటుంది అనే వాదాన్ని దళితులు అంగీకరించలేకపోతున్నది అందుకే. కులగజ్జిని ఓపెన్‌గా ప్రదర్శించే అరవింద్ కెజ్రివాల్ లాంటి వాళ్ళతో ఉద్యమం నడిపితే అన్నా హజారే టీమ్‌లో మిగిలేది కొద్ది మందే. అవినీతి పోవాలి కానీ కులవ్యవస్థ లాంటి అభివృద్ధి నిరోధక కట్టుబాట్లు పోకూడదు అంటే ఎంత మంది అర్థం చేసుకుంటారు? వ్యక్తిగతంగా కులాన్ని నమ్మేవాళ్ళు కూడా అర్థం చేసుకోరు.