దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!


దళితులకంటే దళితులు స్త్రీలని మరోసారి రుజువైంది. ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న ఓ ధనిక దళిత కుటుంబం తోటి పేద దళిత మహిళను నగ్నంగా గ్రామంలో ఊరేగించిన దారుణం చోటు చేసుకుంది. కక్ష సాధించే క్రమంలో డబ్బుకీ, రాజకీయ పలుకుబడికీ స్త్రీలే ప్రధమ లక్ష్యమని ఈ సంఘటన మరొకసారి చాటి చెప్పింది.

విడాకులు తీసుకున్న తమ కూతురు వేరే యువకుడితో కలిసి గ్రామం నుండి వెళ్ళిపోవడానికి సాయం చేశాడని బాధిత మహిళ భర్తపైన సదరు ధనిక దళిత కుటుంబం అనుమానం కలిగింది. ఆమెను కిడ్నాప్ చేసి ఓ రాత్రంతా గదిలో బంధించి ఉంచినా వారి కూతురు ఎక్కడికి వెళ్ళిందీ, ఎవరితో కలిసి వెళ్ళిందీ కూడా తెలియదని చెప్పడంతో ఆగ్రహించి వివస్త్రని చేసి కొట్టుకుంటూ గ్రామంలో ఊరేగించారని మెయిల్ టుడే పత్రిక తెలిపింది.

బాధిత మహిళ రాం ప్యారీ 45 ఏళ్ళ వయస్కురాలు. ధనిక దళిత కుటుంబం అనుమానించింది కనీసం ఆమెను కూడా కాదు. ఆమె భర్త దర్బారీ లాల్‌ని. ధనిక దళిత కుటుంబం కూతురు జయంతి భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె గ్రామానికి చెందిన మన్ను తో కలిసి ఊరినుండి వెళ్ళిపోయింది. విడాకులు తీసుకున్న తమ కూతురి బ్రతుకు బాగుపడనుందని సంతోషించడానికి బదులు ఆ కుటంబం పరువు తక్కువగా భావించి, ఈ ఘాతుకానికి పాల్పడింది.

నేరస్ధులు కూడా దళితులే అయినందునో ఏమో, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు చాలా చురుకుగా వ్యవహరించారు. ఘాతుకానికి పాల్పడిన కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లుగా ఎస్.పి అమిత్ చంద్ర తెలిపాడు. “ఇది ముందుగా వేసుకున్న పధకంతో జరిగిన నేరం. జయంతి తండ్రి హరిద్వారీ లాల్, దర్బాది లాల్ పైన ఐసా నగర్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసున్న సమయంలోనే అతని కుటుంబ సభ్యులు గ్రామంలో రామ్ ప్యారినీ చిత్ర హింసలు పెడుతున్నారు” అని అమిత్ పేర్కొన్నాడు.

“శుక్రవారం రాత్రి ఆమెను కిడ్నాప్ చేసి తమ ఇంటిలో బంధించారు. జయంతి ఎక్కడ ఉన్నదీ ఆమె చెప్పలేక పోవడంతో మరుసటి రోజు ఉదయం గ్రామంలో నగ్నంగా ఊరేగించారు” అని ఎస్.పి అమిత్ తెలిపాడు. తనను ఊరేగిస్తున్నప్పటికీ 500 మంది గ్రామస్ధులలో ఒక్కరు కూడా తనకు సాయం చేయలేదని రాం ప్యారీ తర్వాత పోలీసులకు తెలిపింది.

“నన్ను పట్టుకెళ్ళి ఓ గదిలో బంధించారు. జయంతి ఎక్కడ ఉన్నదీ నాకు తెలియదనీ, ఆమె ఎవరితో వెళ్ళింది కూడ తెలియదనీ నేను చెప్పడంతో వారికి కోపం వచ్చింది. నన్ను వీధిలోకి ఈడ్చుకెళ్ళి బట్టలు ఊడబీకారు. ఒళ్ళంతా తడిమారు. బెత్తంతో, బెల్టుతో వీధుల్లోనే నన్ను చావబాదారు” అని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది.

దళిత మహిళ పాలన అయినా, మరొకరి పాలన అయినా భారత దేశంలో ఉన్నది ఆధిపత్య వర్గాల కనుసన్నల్లో నడిచే వ్యవస్ధ. దళితులు సైతం కాలం కలిసి వచ్చి ధనికవర్గంలో చేరిపోయాక వారు కూడా ఆధిపత్య వర్గాల భావజాలాన్ని తలకెక్కించుకుంటారని ఈ ఘటన రుజువు చేస్తోంది.

ధనిక దళితుడు పేద దళితులని ఆధిపత్య భావజాలంతో వేధించడమే కాదు, ధనిక అగ్రవర్ణులు కూడా పేద అగ్రవర్ణులపై ఇదే రకమైన ఆధిపత్య భావనలను కలిగి ఉంటారు. ఎన్నికల సమయంలో అక్కరకు వచ్చినపుడు కుల సామీప్యతను వినియోగించుకున్నప్పటికీ దోపిడీ, ఆధిపత్యం లకు సంబంధించి ధనికులంతా ఒకటిగానే పరిగణించవచ్చు. అయితే ధనిక దళితులు ధనిక అగ్రవర్ణులతో సమానంగా వ్యవహరించగల అవకాశాలు లేని పరిస్ధితి కూడా కొనసాగుతున్నదని ఈ సందర్భంగా అంగీకరించవలసి ఉంది.

18 thoughts on “దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!

  1. “ధనిక దళితులు ధనిక అగ్రవర్ణులతో సమానంగా వ్యవహరించగల అవకాశాలు లేని పరిస్ధితి కూడా కొనసాగుతున్నదని”.

    ఎందుకు లేదు. వ్యాసం మొత్తంగా మీరే చెప్పారు కదా. ధనిక అగ్రవర్ణులు వ్యవహరిస్తున్నట్లే ధనిక దళితులు కూడా పేద దళితులను ఆదిపత్య భావజాలంతో పీడిస్తున్నారని. ధనిక దళితులు ధనిక అగ్రవర్ణులతో సమానంగా వ్యవహరించడం కాదా ఇది?

    ఈ దేశంలో కొందరు పేదవాళ్లుగా పుడతారు. మరికొందరు ఆడవాళ్లుగా పుడతారు అని కొడవటిగంటి కుటుంబరావు గారు చాలా కాలం క్రితమే చెప్పారు కదా. పేదవాళ్లలో కూడా వాళ్లు ఆడవాళ్లుగానే పుడుతున్నట్లున్నారు.

  2. అంబేద్కర్ కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన వద్ద బంట్రోతుగా ఉన్న అగ్రవర్ణుడిని ఓ సారి ఫైలు ఇమ్మన్నపుడు కొంచెం దూరంనుండి ఫైలు విసిరేసాడని ఎక్కడో చదివాను. నిజమో కాదో తెలియదు కాని అటువంటి ఘటనలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇప్పటికీ మర్యాదస్తుల ప్రపంచంలో జరుగుతున్నాయి.

    ఉదాహరణకి ఎల్.ఐ.సి, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నత స్ధానాలకు దళితులు వెళ్ళడం ఇతరుల కంటే కష్టం. కింది స్ధాయి ప్రమోషన్లలో రిజర్వేషల రీత్యా ప్రమోషన్లు వస్తుంటాయి గానీ ఉన్నత స్ధాయిలో ప్రమోషన్లకు మొదట దళితులను, ఆ తర్వాత బి.సి కులాల వాళ్ళను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎల్.ఐ.సి లో అయితే యూనియన్లో కూడా కులాల ప్రభావం ఉంటుంది. అగ్రవర్ణులే యూనియన్లలో పై స్ధాయికి ఎగబాకుతుంటారు. మేనేజ్‌మెంట్ అధికారాలను యూనియన్ నాయకులే చెలాయించగలిగిన సందర్భాల్లో కూడా అగ్రవర్ణాలకే ప్రాధాన్యం లభిస్తుంది. మొదటి అగ్రవర్ణం వారు తమ కులానికి ప్రాధాన్యం ఇవ్వడం చూసి ఇతర అగ్రవర్ణులు కూడా యూనియన్ నాయకత్వ స్ధానికి వచ్చినపుడు తమ కులంవారికి మేలు చేసుకుంటున్నారు.

    ఈ మధ్య ఎల్.ఐ.సిలో టెంపరరీగా పని చేస్తున్న అటెండర్లను సుప్రీం కోర్టు తీర్పు మేరకు నామ మాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పర్మినెంట్ చేసారు. టెంపరరీగా పని చేస్తున్నవారెవరో సంబంధిత బ్రాంచి మేనేజర్లే జాబితా రూపొంచించి పంపించాలి. బ్రాంచి మేనేజర్ల అధికారాలను యూనియన్ (తమకు తగనివాటిని కూడా) తమ చేతులోకి తీసుకుంటాయి. దానివలన టెంపరరీ అటెండర్ల జాబితా తయారిలో దాదాపు డివిజనల్ యూనియనే ప్రధాన పాత్ర వహించింది. ఎ.పిలోని ఒక డివిజన్ లో (మూడు జిల్లాలు కలిపి ఒక డివిజన్) అన్ని బ్రాంచిలలో టెంపరరీ వాళ్ళే అటెండర్ పోస్టుల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ఎవరూ అగ్రవర్ణులు లేనందున ఆ డివిజన్ మొత్తంలో ఎవరూ టెంపరరీ వాళ్ళు లేరన్నట్లుగా ఖాళీ జాబితా పంపారు. దాదాపు ఒక్కొక్కరు మూడు నుండి పదేళ్ల వరకూ ఎల్.ఐ.సి ఆఫీసుల్లో గొడ్డు చాకిరీ చేస్తూవచ్చారు. వారందరికీ ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారని యూనియనే ఆరోపణలు ఎదుర్కోంటోంది.

    యూనియన్ లో కుల భావాలు చొచ్చుకుని రావడంతో నలభై యాభై మంది పని చేసే బ్రాంచి ఆఫీసు కార్యవర్గం ఎన్నికలు కూడా కులాల ప్రాతిపదికన జరుగుతుంటాయి. కులాల వారిగా కూటమిలు కడతారు. కులాల వారీగా పోస్టులను పంచుకుంటారు. దాదాపు ప్రతి ఎన్నికకూ (బ్రాంచి ఆఫీసు ఎన్నికలు సంవత్సరానికొకసారి జరుగుతాయి) కుల సమీకరణలు మారుతుంటాయి. జనరల్ బాడీ సమావేశాల్లో మంచి చెబుతున్నాడా, చెడు చేస్తున్నాడా అన్నది చూడకుండా కులాలు చూసుకుని చప్పట్లూ, మద్దతూ ఇస్తుంటారు. ఇవన్నీ అంటరానితనం కిందికి రాకవోవచ్చుగానీ ఉద్యోగ జీవితాల్లో ప్రధాన అంశాలైన ప్రత్యేక రిక్రూట్‌మెంట్లు, ప్రమోషన్లలో కులపరమైన ఫేవర్ చేస్తున్నపుడు అది అంతిమంగా దళితులు ఆర్ధికంగా ఎదగడానికి ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎల్.ఐ.సిలో అతి పెద్దదిగా ఉన్న యూనియన్, సి.పి.యం పార్టీకి అనుబంధంగా ఉన్న సి.ఐ.టి.యు కు అనుబంధంగా ఉండడం దీనికంతటికీ కొసమరుపు.

    ఆర్ధికంగా ఉన్నత స్ధానాల్లోకి వెళ్ళే కొద్దీ కులపరమైన వివక్ష ఎదుర్కోవడం తగ్గుతుందని చెప్పగలం గానీ పూర్తిగా వివక్ష తగ్గిపోతుందనడానికి మాత్రం అవకాశం లేదు. పైకి వెళ్ళే కొద్దీ కుల వివక్ష అధునాతన రూపాలనూ, కొన్ని సెన్సిబుల్ రూపాలనీ సంతరించుకుంటోంది తప్ప పూర్తిగా రద్దు కావడం లేదు.

  3. రాజుగారూ, ధనిక దళితులు, పేద దళితుల మధ్య ఉన్నది వర్గ వైరుధ్యం.
    కాని ధనిక అగ్రవర్ణులకు, ధనిక దళితులకు మధ్య కుల వైరుధ్యం కొనసాగుతున్నదని నేను చెప్పదలిచాను.
    ఆర్ధికంగా సమానుడైనప్పటికీ అగ్రకులం వాళ్ళు దళితుడితో సామాజిక సంబంధాలకు అంగీకరించడం లేదు. గ్రామాల్లో కనీసం సహపంక్తి భోజనాలైనా ఉండవు.
    ఉత్తర భారతంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న బిడ్డలను తల్లిదండ్రులే చంపుకుంటున్నారు.
    బ్లాగింగ్ ప్రపంచంలో మనం చూస్తూనె ఉన్నాం, మత మౌఢ్యంతో ఎంతటి అసహ్యానికి పాల్పడుతున్నదీ.
    ప్రవీణ్ పైన ఇన్‌డైరెక్టుగా కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు కూడా చేయడం నేను చదివాను.
    ఒకరి ఆర్ధిక పరిస్ధితి మరొకరికి తెలిసే అవకాశం ఇక్కడ లేదు.
    అయినా వివక్షను వర్చువల్ ప్రపంచంలోకి కూడా తెచ్చారంటే వీరికి ఏ నరకం సరైన శిక్ష విధించగలుగుతుంది?

  4. రంగనాయకమ్మ గారు వ్రాసిన దళిత సమస్య పుస్తకం చదివారా? ఒకరిద్దరు దళితులు ధనవంతులైనంతమాత్రాన కుల సంబంధాలు మారవు. ధనవంతులైన దళితులు కూడా తమ అవకాశాలని కాపాడుకోవడానికి ధనవంతులైన అగ్రకులాలవాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తుతారు.

  5. ధనవంతులైన దళితులకీ, అగ్రకుల ధనవంతులకీ మధ్య అవకాశాలలో సమానత్వం లేకపోవచ్చు. ఉదాహరణకి మూలింటి మారెప్ప సూటు-బూటు వేసుకునే ధనిక దళితుడు. కానీ అతను తన పార్టీకి చెందిన అగ్రకుల ధనవంతుల అడుగులకి మడుగులు ఒత్తబట్టే అతనికి మంత్రి పదవి వచ్చింది. కర్నూల్ జిల్లాలోని ఒక సభలో జిల్లాలో అంటరానితనం లేదంటూ బహిరంగంగా ప్రకటన చేసి తన కులంవాళ్ళ విమర్శలకి గురయ్యాడు. అయినా అతను సిగ్గుపడలేదు. ఎందుకంటే అలా అగ్రకులాలవాళ్ళకి అనుకూలంగా ఉంటేనే అతని పదవులు నిలబడతాయని అతనికి తెలుసు.

  6. ప్రవీణ్. చదివాను. కుల సమస్య పైన కమ్యూనిస్టు విప్లవకారులు విప్లవం ముందునుండీ కృషి చేయవలసిన అవసరం ఉంది. వారు తమ సాంస్కృతిక జీవనంలో కులాలకు తావు లేదు అని తమ జీవిత విధానం ద్వారా చూపిస్తే తప్ప దళిత సమస్యకు నిబద్ధులైన దళిత మేధావుల్ని ఒప్పించడం సాధ్యం కాదని అనిపిస్తుంది.

  7. నేను వైట్ కాలర్ కుటుంబానికి చెందినవాణ్ణని తెలిసీ నన్ను కులం పేరుతో తిట్టారంటే వాళ్ళకి రాజకీయ నాయకులకి ఉన్నంత కులగజ్జి ఉన్నట్టే. నిజ జీవితంలో మనిషి కులానికి అంత ప్రాధాన్యత ఇవ్వడు. చాలా మందికి జీవితంలో కులం అనేది సెకండరీ విషయం, డబ్బు అనేది ప్రాథమిక విషయం. అందుకే ఆ గ్రామంలో డబ్బున్న దళితులు పేద దళిత మహిళపై అత్యాచారం చేశారు. ఒకే కులంవాళ్ళు మాత్రమే ఉండే గ్రామం నుంచి వచ్చిన మా నాన్నగారు కూడా కులం గురించి అంతగా ఆలోచించలేదు. మా నాన్న గారి సొంతూరు ఒరిస్సాలోని రాయగడ జిల్లా పిపిలిగూడ గ్రామం. ఆ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో టీచర్ కుటుంబం, రేషన్ డీలర్ కుటుంబం తప్ప మిగితావన్నీ గిరిజన కుటుంబాలే. పట్టణాలలో అయితే పక్కింటివాళ్ళది ఏ కులమో కూడా తెలియదు. బ్లాగర్ల విషయానికొస్తే వీళ్ళు పట్టణాలలో ఉంటూ కులాన్ని నమ్ముతున్నారంటే వీళ్ళ మెదళ్ళు బాగా కంపుతో ఉన్నట్టే.

  8. డబ్బున్న దళితులకీ, అగ్రకుల ధనికులకీ మధ్య సాధారణంగా అవకాశాలలో పోటీ ఉంటుంది. కత్తి మహేశ్ గారు రిజర్వేషన్ల గురించి వ్రాసినప్పుడు అగ్రకుల బ్లాగర్లు అతన్ని బండబూతులు తిట్టేవాళ్ళు. రిజర్వేషన్ల వల్ల తమకి అవకాశాలు ఉంటాయనిపించినవాళ్ళు వాటిని సమర్థిస్తారు, తమ అవకాశాలు పోతాయనిపించినవాళ్ళు వాటిని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి వ్యక్తిగతంగా కులం మీద నమ్మకం లేకపోయినా కేవలం అవకాశాల కోసం ఇతరుల మీద కులం పేరుతో బురదజల్లుతారు. డబ్బున్న దళితులకీ, పేద దళితులకీ మధ్య ఉన్నది 100% వర్గ వైరుధ్యమే. దళిత సర్పంచ్ కొడుకు దళిత కూలీవాని కూతురుని పెళ్ళి చేసుకోగలడా? ఎన్నికల టైమ్‌లో ఆ సర్పంచ్ కులం పేరు ఎంత చెప్పుకున్నా సరే తన కొడుకుని తన కులానికి చెందిన కూలీవాని కూతురుకి ఇచ్చి పెళ్ళి చెయ్యగలడా? వర్గ సమాజంలో డబ్బు సంబంధాలు మాత్రమే నిజమైనవి. మిగితా సంబంధాలు మిథ్య. అవి కుల సంబంధాలైనా, మత సంబంధాలైనా.

  9. పొరబడుతున్నావ్ ప్రవీణ్, వర్గేతర సంబంధాలన్నీ మిధ్య అని చెప్పడం కరెక్టు కాదు. వేల ఏళ్లనుండి కొనసాగుతున్న కుల అణచివేతను మిధ్య అని కొట్టి పారేయలేము. నిత్యం సామాజిక హింసకు, గృహ హింసకు బలవుతున స్త్రీల అణవివేతను మిధ్య అని కొట్టిపారేయలేము. ఇంకా అనేక రకాలా సామాజిక వైరుద్యాలను మిధ్యగా కొట్టిపారేయడం తగదు. కాకుంటే ఆర్ధిక వైరుధ్యాలతో పోల్చినపుడు వర్గ విముక్తి కోసం జరిగే పోరాటం నేపధ్యంలో చూసినపుడు వర్గేతర వైరుధ్యాలు అప్రధానంగా ఉంటాయని చెప్పవచ్చు. కానీ తక్షణ భవిష్యత్తులో తీసుకున్నా, విప్లవానంతర సామాజిక పరిస్ధితులను తీసుకున్నా వర్గేతర వైరుధ్యాలు ప్రధాన పాత్రలో కొనసాగడాన్ని గుర్తించాలి. కళ్లెదుట ఓ స్త్రీ, గృహ హింసకు బలవుతున్నపుడు ఆమెకు తక్షణ విముక్తికి దోహదపడడం మాని, మీ విముక్తి వర్గ వైరుధ్యాలు లేని సోషలిస్టు వ్యవస్ధలోనే సాధ్యం, కనుక అప్పుడే నీ గురించి పట్టించుకుంటాను అంటే ఎవరూ హర్షించరు. అది సరైంది కూడా కాదు. అన్ని రకాల వైరుధ్యాల పరిష్కారానికి పోరాడుతూనే ఆ పోరాటాలను వర్గ పోరాటంలో మమేకం చేయగలగాలి. లేదంటే వర్గ విప్లవానికి దోహదపడడానికి ఎవ్వరూ ముందుకురారు.

  10. నేను ఇక్కడ స్త్రీ-పురుష సంబంధాల గురించి వ్రాయలేదు కానీ స్త్రీ-పురుష సంబంధాల విషయానికొస్తే ఇక్కడ పై వార్తలో వ్రాసినదాన్ని ఉదహరించాలి. విడాకులు తీసుకున్న స్త్రీకి చట్టపరంగా రెండో పెళ్ళి చేసుకునే అవకాశం ఉన్నా ఆమె తల్లితండ్రులు ఆమె రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదంటే అది denial of rights కిందకే వస్తుంది కదా. పురుషాధిక్య సమాజంలో స్త్రీ-పురుష సమానత్వం గురించి పురుషులు ఎన్ని కబుర్లైనా చెపుతారు. విడాకులు, విధవా వివాహాల విషయానికొచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో రష్యాలోని చట్ట సభలలో 35% మంది మహిళా సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశాలు బాగా తగ్గిపోయాయంటే అందుకు కారణం వర్గ సమాజంలో కబుర్ల కంటే ఓవర్ట్ సుపీరియారిటీ కాంప్లెక్సే ప్రధాన భూమిక పోషిస్తుందనే కదా. ఎంత డబ్బున్నవాడైనా కేవలం డబ్బు సంపాదించడంతో సరిపెట్టుకోడు. ఏదో ఒక రకంగా సుపీరియారిటీని ప్రదర్శించుకోవాలనుకుంటాడు. స్త్రీ-పురుష సంబంధాల దగ్గర కూడా అలాగే చేస్తాడు.

  11. దళిత హక్కుల విషయానికొస్తే డబ్బున్న దళితులు ఒకవైపు తమ కులానికి చెందిన పేదవాళ్ళని అంటరానివాళ్ళుగా చూస్తూనే తమ కులానికి చెందిన డబ్బున్నవాళ్ళని అంటరానివాళ్ళుగా చూడొద్దంటే అగ్రకుల ధనికులు ఎలా ఒప్పుకుంటారు? ఈ విషయం డబ్బున్న దళితులని అడిగితే ఇది అంటరానితనం కాదు, ఆర్థిక అసమానత అని సమాధానం చెప్పగలరు. అలాగే అగ్రకుల ధనవంతులు ఇది అంటరానితనం కాదు, కుల అసమానత అని చెపితే డబ్బున్న దళితులు ఒప్పుకుంటారా? ఒక కులంలో ఒకరిద్దరు ధనవంతులైనంతమాత్రాన ఆ కులం మా కులంతో సమానమైపోదు అని అగ్రకుల ధనవంతులు అంటే డబ్బున్న దళితులు అంగీకరిస్తారా?

  12. నిజానికి డబ్బు, కులం, మూఢ నమ్మకాలు, రాజకీయాలు అన్నీ ప్రధానదుష్పాత్రలనే పోషిస్తున్నాయి సమాజంలో. సందర్భాన్ని బట్టి యేదో ఒకటి పైచేయి చేసుకొని మనుషులు సాటివారిపై జులుం చెలాయించేందుకు తోస్తుంది. సమాజంలో అక్షరాస్యతశాతం నూటికి యెనభై దాటితే పరిస్థితిలో మార్పు రావచ్చునేమో. అన్ని సమస్యలకూ పేదరికం, నిరక్షరాస్యతలే కారణం కాకపోయినా అవి తగ్గితే తప్పక మార్పు ఆశించవచ్చునిపిస్తోంది.

  13. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా కులం పోకపోవడం చూస్తూనే ఉన్నాం కదండీ. ఇక చదువుల వల్ల ఏమవుతుంది?
    మన చదువులు సంస్కారం, నీతి, నియమాలు నేర్పే చదువులు కావు. ఏం చేసైనా డబ్బు సంపాదించాలని చెప్పే చదువులు.
    అందుకే అమెరికాకి వెళ్లి కూడా కట్నాలు డిమాండ్ చేయడం, కట్నాల కోసం వేధించడం, చంపడం కూడా చేస్తున్నారు.
    ఇక పేదరికం పోవడం ఇపుడున్న రాజకీయ ఆర్ధిక వ్యవస్ధల పరిధిలో అసంభవమేనేమో కదా!

  14. భూస్వామ్య భావజాలం ఉన్నంత వరకు ప్రజలు ఎన్ని చదువులు చదువుకున్నా భావజాలం మారదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్ళి చేసుకున్నారు. కులం, కట్నాలే కాదు, వయసు, ఎత్తు లాంటి పట్టింపులు కూడా చాలా మంది చదువుకున్నవాళ్ళలో ఉన్నాయి. నిజానికి కులంతో పోలిస్తే వయసు అనేది చాలా చిన్న విషయమే. అమ్మాయి వయసులో అబ్బాయి కంటే పెద్దదైనా వాళ్ళు పెళ్ళైన తరువాత వయసు గురించి మర్చిపోయి కాపురం చేసుకోగలరు. కానీ కులాంతర వివాహాలు అలా కాదు. కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్ళలో విడాకులు తీసుకున్నవాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ముంబైలో కులాంతర వివాహాలు చేసుకున్న కాశ్మీరీ బ్రాహ్మణ స్త్రీలలో చాలా మంది తమ భర్తలకి విడాకులు ఇచ్చేసినట్టు సర్వే రిపోర్టులు వచ్చాయి. దేశంలో విడాకులు తీసుకునేవాళ్ళ సంఖ్య 1% కంటే తక్కువే అయినా కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళలో విడాకుల శాతం ఎక్కువగా కనిపిస్తోంది. గొప్ప చదువులు చదువుకున్నంతమాత్రాన కుల పట్టింపులు పోవు అనడానికి ఇదో ఉదాహరణ.

  15. వర్గం మారితే వైరుధ్యం మారుతుంది కదా. దళితుడు ఎలైట్ క్లాస్‌వానిగా మారినా కులంతో సంబంధం లేకుండా అతను పేదవాళ్ళని దోచుకుంటాడు. కనుక రాజశేఖరరాజు గారు చెప్పినది 100% నిజం.

  16. కేవలం దళితవాదం వల్ల దళితులు పైకొస్తారని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఘటలు చూస్తోంటే దళితవాదం కూడా ధనికులు-పేదవాళ్ళు అనే వర్గ సంబంధాలకి అతీతం కాదని అర్థం కావడం లేదా?

వ్యాఖ్యానించండి