సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం


అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి.

సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల సృష్టి ఉండాలంటే నెలకు 150,000 ఉద్యోగాలు నికరంగా సృష్టించబడాలని సాధారణ అంచనా కాగా, ప్రస్తుత సంక్షుభిత పరిస్ధితుల్లో నిరుద్యోగానికి ఎదురీదుతూ జనాభా వృద్ధితో పోటీ పడాలంటే ఉపాధి సృష్టి అందుకు అనేక రెట్లు వేగంతో జరగవలసి ఉంటుంది.

అయితే, సెప్టెంబరు నెలలో నివేదించబడిన నికర ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు ఒక్క వెరిజాన్ కంపెనీవే కావడం గమనార్హం. అవి కూడా కొత్త ఉద్యోగాలు కావు. ఆగష్టు నెలలో రెండు నెలలపాటు సమ్మెలోకి వెళ్లిన 45,000 మంది వెరిజాన్ ఉద్యోగులు సెప్టెంబరు నెలలో తిరిగి విధుల్లోకి చేరారు. వారిని కూడా ఉపాధి సృష్టిలోకి లెక్కించడంతో కొత్త ఉద్యోగాల సంఖ్య 103,000 గా తేలింది. అంటే వాస్తవంగా సెప్టెంబరు నెలలో సృష్టించబడిన నికర ఉద్యోగాల సంఖ్య 58,000 మాత్రమే కావడం గమనార్హం.

అయితే అమెరికా ప్రభుత్వం గానీ కార్పొరేట్ పత్రికల గుంపు గానీ సెప్టెంబరు నెల ఉపాధి నివేదికను పాజిటివ్ పరిణామంగా పేర్కొంటున్నాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి రికవరీ దిశగా సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా పేర్కొంటున్నారు. ఒబామా ప్రతిపాదించిన ‘అమెరికా ఉపాధి చట్టం’ ను ప్రచారం చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. దిక్కుతోచని పరిస్ధితుల్లో ఏ చిన్న సానుకూల వార్త సైతం సంక్షుభిత అమెరికా అధికారులకు వీనుల విందుగా తోచడంలో ఆశ్చర్యం లేదు.

జులై, సెప్టెంబరు రెండు నెలల్లో మొత్తం 99,000 ఉద్యోగాలు లభించాయని నివేదిక తెలిపింది. ఇది గతంలోని నివేదిక తెలిపినదాని కంటే స్వల్పంగా అధికమని నివేదిక తెలిపింది. పైకి రివైజ్ చేసిన ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఏప్రిల్ నెలనుండి నెలవారీ సగటు ఉపాధి సృష్టి 72,000 మాత్రమే. ఇది సాధారణ సగటులో (150,000) కూడా సగం మాత్రమే ఉండడం గమనార్హం. ఏప్రిల్ నెల ముందు వరకు ఉన్న 14 నెలల కాలానికి నెలకు సగటున 123,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయని “ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్” (ఇ.పి.ఐ) తెలిపిన సంగతి గమనిస్తే ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకూ పరిస్ధితి ఎంత దిగజారినదీ అర్ధం కాగలదు.

అధికారిక అంచనా ప్రకారం అమెరికా నిరుద్యోగం 9.1 శాతం ఉండగా, అది వాస్తవానికి రెట్టింపు ఉంటుందని ఆర్ధికవేత్తలు, విశ్లేషకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు. అమెరికాలొ ప్రస్తుతం 14 మిలియన్ల మంది (1.4 కోట్లు) నిరుద్యోగులు ఉన్నారని ఇ.పి.ఐ అంచనా వేస్తోంది. పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతుండడం ఒక ధోరణిగా కొనసాగుతోంది. అమెరికాలో ఇరు పార్టీలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పొదుపు చర్యల వలన ప్రభుత్వ ఉద్యోగాలు మరింత వేగంగా క్షీణించడం ఖాయం.

గత మూడు సంవత్సరాలలో స్ధానిక సంస్ధలు పొదుపు పేరు చెప్పి 641,000 మంది ఉద్యోగులకు స్వస్తి పలికాయి. ఉద్యోగాలకు స్వస్తి పలికిన మేరకు ప్రవేటు సంస్ధలకు అవకాశాలను అప్పగించినప్పటికీ పోయినమేరకు ప్రవేటురంగంలోనైనా ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. స్ధానిక సంస్ధలు కోత పెట్టిన ఉద్యోగాలలో దాదాపు సగం వరకూ (247,000) స్దానిక పబ్లిక్ పాఠశాలలకు చెందినవే. ఈ కోత ఫలితంగా ఉపాధ్యాయుల అవసరానికీ వాస్తవ ఉపాధ్యాయుల సంఖ్యకు మధ్య తేడా 326,000 ఉన్నదని ఇ.పి.ఐ తెలిపింది.

అమెరికాలో పాక్షిక నిరుద్యోగం (underemployment) కూడ పెరుగుతున్నదని ఇ.పి.ఐ గణాంకాలతో పాటు లేబర్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. అమెరికాలో ఉపాధి పరిస్ధితి ఉద్యోగాల సృష్టికి సంబంధించిన గణాంకాల కంటే ఈ పాక్షిక నిరుద్యోగ గణాంకాలు సరిగ్గా ప్రతిబింబిస్తాయని భావించవచ్చు. లేబర్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం పాక్షిక నిరుద్యోగం గత ఆగష్టు నెలలో 16.2 శాతం ఉండగా, సెప్టెబరుకు 16.5 శాతానికి పెరిగింది. ఉద్యోగం అవసరమైనప్పటికీ ఉద్యోగం వెతుకులాటను వదిలిపెట్టినవాళ్లనూ, పూర్తికాల ఉద్యోగం అవసరమైనప్పటికీ దొరకక పాక్షిక ఉపాధితో సరిపెట్టుకునవాళ్లనూ పాక్షిక నిరుద్యోగులుగా పరిగణిస్తారు.

లేబర్ డిపార్ట్‌మెంటు అధికారిక నిరుద్యోగుల సంఖ్యకు పైన చెప్పిన పాక్షిక నిరుద్యోగుల సంఖ్యను కలిపి మొత్తం సంఖ్యను అండర్ ఎంప్లాయ్‌మెంటు కేటగిరి కింద నివేదిస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 25.8 మిలియన్లని (2.59 కోట్లు) లేబర్ డిపార్ట్‌మెంటు నివేదించింది. వీరిలో 14 మిలియన్లు అధికారికంగా నిరుద్యోగులు కాగా, 2.6 మిలియన్ల మంది కార్మిక ఉపాధికి పాక్షికంగా జతచేయపడినవారిగా పేర్కొన్నది. 9.3 మిలియన్ల మంది గత్యంతరం లేక పార్ట్ టైమ్ ఉద్యోగులుగా ఉన్నవారుగా పేర్కొన్నది.

నిరుద్యోగ కాలానికి సంబంధించి అమెరికా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఉపాధికి సంబంధించిన రికార్డుల నిర్వహణ అమెరికా 1948 నుండి ప్రారంభించింది. సగటు నిరుద్యోగ కాలం ఆగష్టులో 40.3 వారాలు కాగా సెప్టెంబరులో 40.5 వారాలుగా రికార్డయ్యింది. లెక్కలు ప్రారంభించినప్పటినుండి ఇదే అత్యధిక కాలమని తెలుస్తోంది. ఇంకా వివరంగా చెప్పుకుంటే, 1980 వ దశాబ్దపు చివరివరకూ నిరుద్యోగ కాలం 10 నుండి 15 వారాల వరకూ రికార్డయ్యింది. ఆ తర్వాత మే 2009 వరకూ ఏ నెలలోనూ 21.2 వారాలకు మించలేదు. ఇప్పుడది దానికి దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

అమెరికా నిరుద్యోగుల్లో 44.6 శాతం లేదా 6.2 మిలియన్లమంది సెప్టెంబరులో ఆరు నెలలకు పైగా నిరుద్యోగులుగా ఉన్నారు. ఇది 2010 లో రికార్డయిన అత్యధిక శాతం 45.6 కు దగ్గరగా ఉంది. సెప్టెంబరు నెలలొ ఆరు నెలలకు పైగా నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య 208,000 మేరకు పెరిగిందని ఇ.పి.ఐ తెలిపింది. సంవత్సరానికి పైగా (52 వారాలు) నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య 2010 సెప్టెంబరు నెలలో 4.3 మిలియన్లు కాగా అది ఈ సెప్టెంబరు నెలలో 4.4 మిలియన్లకు పెరిగింది.

అమెరికా నిరుద్యోగానికి సంబంధించిన ఈ లెక్కలు అక్కడి సామాజిక సంక్షోభం తీవ్రతను తెలియజేస్తున్నాయి. మైనారిటీ జాతుల్లో నిరుద్యోగం ఇంకా అధికంగా ఉండడంతో వివిధ రంగుల ప్రజానీకం మధ్య కూడా అంతరాలు పెరుగుతున్నాయి. ఇది క్రమంగా ఉపాధి కల్పించని ప్రభుత్వంపై ఆగ్రహం పెంచడానికి బదులుగా వివిధ వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలకు దారితీస్తున్నది. ఉదాహరణకి ఆఫ్రికన్ అమెరికన్లలో 16 శాతం నిరుద్యోగం ఉండగా, హిస్పానిక్ లలో 11.3 శాతంగా రికార్డయ్యింది.

భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలకు ప్రభుత్వ, ప్రవేటు సంస్ధలు ఇప్పటికే పధకాలు ప్రకటించాయి. పోస్టల్ విభాగం 2015 నాటికల్లా 220,000 ఉద్యోగాలు కత్తిరిస్తానని ప్రకటించింది. గత నెలలో ఇది 5,000 ఉద్యోగాలను రద్దు చేసింది. ఉపాధికర్తలు భవిష్యత్తులో 115,730 ఉద్యోగాలు రద్దు చేస్తామని సెప్టెంబరు నెలలో ప్రకటించారు. ఆగష్టులో ఈ సంఖ్య 51,114 గా నమోదయ్యింది. ఈ సంవత్సరం మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) లో ఈ సంఖ్య 233,258గా నమోదయ్యింది. ఇది రెండో క్వార్టర్ కంటే రెట్టింపు కంటె ఎక్కువ కాగా 2009 నుండీ ఇదే అత్యధికం.

గత 19 నెలల్లో 2.6 మిలియన్ల ఉద్యోగాలను ప్రవేటు రంగం ఇచ్చిందని ఒబామా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే మాంద్యం ఏర్పడినప్పటినుండీ 6.6 మిలియన్ల ఉద్యోగాలను అమెరికన్లు నష్టపోయారన్న విషయాన్ని అది దాచిపెడుతోంది. మాంద్యంలో నష్టపోయిన ఉద్యోగాలను తిరిగి పొంది, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగాలంటే ఇప్పటికిప్పుడు 11.1 మిలియన్లు కొత్త ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. ఈ సంఖ్యకు కనుచూపు మేరలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న లెక్కలు లేవని సులభంగా అర్ధమవుతోంది.

నిరుద్యోగం సృష్టించిన సామాజిక సంక్షోభం ఫలితంగానే అమెరికాలోని అనేక నగరాల్లో “ఆకుపై వాల్‌స్ట్రీట్”, “వుయ్ ఆర్ 99 పర్సెంట్” ఉద్యమాలు ఊపందుకుంటున్నాయన్నది ఎవరూ నిరాకరించలేని చేదు నిజం.

వ్యాఖ్యానించండి