బడ్జెట్ లోటు తగ్గించాలని ఆదేశిస్తూ అందుకోసం వేతనాలూ, సదుపాయాలలో తీవ్రమైన కోత విధించేలా గ్రీసు ప్రభుత్వం చేత పొదుపు ఆర్ధీక విధానాలను అమలు చేయించాయి. ఇపుడు గ్రీసు ప్రభుత్వం కార్మికులను పని నుండి తొలగించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలలొ పని చేస్తున కార్మికుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని కోరుతున్నాయి. ఇవి వాలవన్నట్లు గ్రీసు తన సార్వభౌమాధికారంలో కొంత భాగాన్ని వదులుకోవాలని జర్మనీ పాలక పార్టీకి చెందిన డెప్యుటీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిఖాయిల్ ఫఛ్స్ శనివారం కోరాడు.
గ్రీసు దివాలాకు దగ్గరిలో ఉందనీ, అది తన సార్వభౌమాధికారంలో కొంత భాగాన్ని వదులుకుంటే తప్ప తన అప్పును కొంతమేరకైనా రద్దు చేసుకునే అవకాశం రాదనీ మిఖాయిల్ ఓ పత్రికతో మాట్లాడుతూ అన్నాడు. పాలక క్రిస్టియన్ డెమొక్రట్ పార్టీ నాయకుడు మిఖాయిల్ ‘రియల్ న్యూస్’ పత్రికతో మాట్లాడుతూ అసలు గ్రీసు యూరోజోన్ నుండి బైటికి వెళితే ఇంకా మంచిదని పేర్కొన్నాడు. “మీరు దివాళా తీయడానికి దగ్గరలో ఉన్నావు. విషమ షరతులు లేనిదే బడ్జెట్ కోతను మేము అంగీకరించలేము. కనుక గ్రీసు ఏదో ఒక దానిని కొంతమేరకు వదులుకోవాల్సిందే. కనీసం తాత్కాలికంగానైనా గ్రీసు తన సార్వభౌమాధికారంలో ఒక భాగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది” అని ఫఛ్స్ పేర్కొన్నాడు.
సార్వభౌమాధికారాన్ని వదులుకోవడం అంటే ఏమిటి? సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఒక దేశాన్ని పేర్కొంటున్నామంటే దానర్ధం ఆ దేశం తన నిర్ణయాలను తానే తీసుకోగలిగిన స్ధితిలో ఉన్నదని అర్ధం. ఆ దేశం పాలనాధికారాలన్నీ ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి తప్ప వేరోక దేశం ఆ అధికారాలను చెలాయించదు. సార్వభౌమాధికారాలను కోల్పోవడం అంటే ఈ అధికారాలను కోల్పోవడమే. పాక్షికంగా కోల్పోవడం అంటే సార్వభౌమాధికారాలలో కొన్నింటిని వదులుకోవడంగా చెప్పవచ్చు. తన బడ్జెట్ రూపొందించుకోవడంలో కానీ, వేతనాల చెల్లింపులో కానీ, దేశ జిడిపి వృద్ధికి తీసుకునే నిర్ణయాలలో కానీ కొంత భాగాన్ని విదేశాలకు (ఇక్కడ బహుశా ఇ.యుకి) అప్పజెప్పాలన్నమాట.
నిజానికి గ్రీసు గానీ, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల దగ్గర రుణాలు తీసుకున్న ఇతర ఇ.యు దేశాలు గానీ, ఆ మాటకొస్తే ఐ.ఎం.ఎఫ్ దగ్గర రుణాలు తీసుకున్న ఏ దేశమైనా గానీ తమ సార్వభౌమాధికారాన్ని చాలావరకు వదులుకుంటూనే ఉన్నాయి. రుణాలిస్తూ ఐ.ఎం.ఎఫ్ ఆ దేశాల బడ్జెట్ లను శాసిస్తున్న సంగతి బహిరంగ రహస్యం. ఏ రంగానికి ఎంత కేటాయించాల్సిందీ నిర్ణయించడం, ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ ఆ దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవేటు కంపెనీలకు అయినకాడికి అమ్మేయడం, వేతనాల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు తదితర చర్యలన్నీ ఆ దేశాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమే. వారి ప్రయోజనాలను హరించివేసేవే. కాని ప్రభుత్వాలు వాటిని కేవలం షరతులు మాత్రమే పేర్కొంటూ తమ ప్రజలను మోసం చేస్తున్నాయి.
ఎక్కడైనా రుణం తీసుకునేటపుడు రుణాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకునే హక్కు రుణ గ్రహీత దేశాలకు ఉండాలి. కాని ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు, ముఖ్యంగా ఐ.ఎం.ఎఫ్ స్వతంత్ర దేశాలపై విధించే షరతులు ఆదేశాల స్వతంత్ర నిర్ణయాధికారాన్ని హరించివేస్తాయి తప్ప సదరు రుణం ద్వారా రుణ గ్రహిత దేశాలు లాభపడేలా ఉండవు. రుణాలు పేరుజెప్పి మూడో ప్రపంచ దేశాల వనరులను, పాలనాధికారాన్నీ విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పినట్లే రుణ సంక్షోభంలో ఉన్న యూరోజోన్ దేశాలపై కూడా విషమ షరతులు విధించి అక్కడి వనరులనూ, మార్కెట్లనూ ధనిక యూరప్ దేశాల బహుళజాతి కంపెనీలకు అప్పజెపుతున్నారు.
ఈ విషమ షరతులన్నీ ఆచరణలో అవి అమలు చేసే దేశాల సార్వభౌమాధికారాన్ని హరించి వేస్తున్న సంగతిని అక్కడి ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయి. జర్మనీ నాయకుడి ప్రకటన ద్వారా అటువంటి విషమ షరతుల అసలు ఫలితమేమిటో వెల్లడయింది. ఇక పరోక్షంగా సార్వభౌమాధికారాన్ని హరించి వేసే విధానాలు కాకుండా ప్రత్యక్షంగానే హరించే విధానాలను అమలు చేయాలని ఆయన చెబుతున్నాడు. అంటే గ్రీసు ప్రజలపై అమలు చేసే ఆర్ధిక విధానాలు ప్రత్యక్షంగా దోపిడీ చేసేటట్లుగానే ఉంటాయని భావించవచ్చు.
అక్టోబరు 17 18 తేదీలలో బ్రసెల్స్ లో ఇ.యు సమావేశాలు జరగనున్నాయి. అందులో గ్రీసుకు తదుపరి వాయిదా రుణాన్ని ఇచ్చే విషయమై చర్చలు జరుగుతాయి. గ్రీసు రుణంలో పెట్టుబడి పెట్టిన ప్రవేటు మదుపుదారులను తమ రుణంలో కొంత భాగాన్ని వదులుకోవాలని కోరడానికి నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. గత జులైలో కుదిరిన అంగీకారం మేరకు 21 శాతం వదులుకోవాలని నిర్ణయించగా అంతకంటే ఎక్కువే వదులుకోవాలని ఈ సమావేశాల్లో కోరవచ్చని భావిస్తున్నారు.
