
అమెరికాలో ఇప్పుడు “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమం హోరెత్తిస్తోంది. అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలని అణచివేయడానికీ అది వీలు కాకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికీ పావులు కదపడంలో బిజీగా ఉన్న అమెరికా తన ప్రజలు ఈజిప్టు ఉద్యమం తరహాలో చేస్తున్న ఉద్యమంతో కూడా సతమతమవుతోంది.
అమెరికాలో నిరసనకారులు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమం చేయకపోవచ్చు గానీ అక్కడి ప్రజల్లో అమెరికా అవినీతి ప్రభుత్వంపైనా, విఫలమైన వ్యవస్ధపైన దాచిపెట్టుకున్న వ్యతిరేకత, ఎదుర్కొంటున్న నిరాశా నిస్పృహలు నిరసనల రూపంలో, “వాల్‌స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం” ఉద్యమం రూపంలో బట్టబయలవుతోంది.
ఈ ఉద్యమంలో సమీకృతులవుతున్న జనం ప్రధానంగా వాల్‌స్ట్రీట్ కంపెనీలనూ, బ్యాంకర్లనూ, కార్పొరేట్ వ్యాపార సామ్రాట్టులనూ లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరు కార్పొరేట్ కంపెనీల అత్యాశకూ, ప్రభావానికీ, సామాజిక అసమానతలకూ, ధనిక పేకల మధ్య ఎల్లెడలా వ్యాపించి ఉన్న తీవ్రమైన అంతరాలకూ బాధ్యులని నిరసనకారులు భావిస్తున్నారు.
శనివారం రాత్రి “వాల్‌స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమకారులకూ, పోలీసులకూ న్యూయార్క్ పోలీసులకూ పెద్ద ఘర్షణ జరిగింది. బ్రూక్లిన్ బ్రిడ్జి పైన చోటు చేసుకున్న ఈ ఘర్షణ అనంతరం కొన్ని వందలమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బిలియనీర్ బ్యాంకర్లకూ, బిజినెస్ మాగ్నెట్లకూ సేవ చేస్తున్న రాజకీయ వ్యవస్ధపైన నిరసనకారుల ఆగ్రహం ఈ ఘర్షణలో పెల్లుబుకింది. అరెస్టయినవారిలో 13 ఏళ్ళ బాలిక ఉండడం విశేషం. బాలికను వదిలేయాలని నిరసనకారులు నినదిస్తుండగానే పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
గత వారం న్యూయార్క్ పోలీసులు “వాల్‌స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమంలో భాగంగా ఉద్యమిస్తున్న మహిళలపై పెప్పర్ జల్లినందుకు తీవ్రంగా విమర్శలకు గురయ్యారు. ఉద్యమంలో భాగంగా శాంతి యుతంగా మహిళను నిరసన ప్రదర్శనలో పాల్గొన్నప్పటికీ వారిపైన పెప్పర్ జల్లడం నిరసనలను సహించలేని తత్వాన్ని పోలీసులు రుజువు చేసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా నిరసనకారులపై పోలీసులు పెప్పర్ జల్లుతున్న దృశ్యం ఇక్కడ చూడవచ్చు.
పెప్పర్ జల్లుతున్న పోలీసు తాను జల్లుతున్నట్లు తెలియకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం కూడా పై వీడియో చూపుతోంది. నిరసనలను అణచివేయడానికి అమెరికా పోలీసులు ఎంతకైనా తెగిస్తారని ఈ వీడియో నిర్ధారిస్తోంది. ఆంధ్ర పోలీసులు ఏం చేసినా బహిరంగంగా కెమెరాల ముందే చేస్తారు. జూట్టు పట్టి లాగి జీపుల్లో పడేస్తారు. లాగేదీ చీరో, జాకెట్టో తెలియకుండా లాక్కిళ్ళి కుదేస్తారు. తమ చర్యలను దాచుకోవడానికి వారు ప్రయత్నించరు. కాని అమెరికా పోలీసులు పెప్పర్ జల్లింది తాము కాదన్నట్లుగా కామ్ గా వచ్చి పెప్పర్ జల్లేసి ఏమీ తెలియనట్లు పక్కకు వెళ్ళిపోయిన దృశ్యం చూస్తే వారి క్రూరత్వం అర్ధం అవుతుంది.
“వాల్‌స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అపఖ్యాతి పాలైన వాల్ స్ట్రీట్ వద్దనే ప్రారంభంలో కేంద్రీకృతమైనప్పటికీ, ఆ తర్వాత ఉద్యమం క్రమంగా ఇతర రాష్ట్రాల నగరాలకు కూడా వ్యాపించింది. లాస్ ఏంజిలిస్, Albuquerque, న్యూ మెక్సికో నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా వందలమంది అరెస్టయినట్లు సి.బి.ఎస్ న్యూస్ సంస్ధ తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు నికొలస్ క్రిస్టాఫ్ ఈ ఉద్యమాలపై ఓ విశ్లేషణ రాస్తూ అవి ఈజిప్టు రాజధాని కైరోలో తాహ్రిరి స్క్వేర్ వద్ద జరిగిన ఆందోళనలను గుర్తుకు తెచ్చాయని రాసాడు. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను ఈజిప్టు ప్రజల ఆందోళనలు ఈ సంవత్సరం జనవరిలో కూలదోసిన సంగతి తెలిసిందే.
అమెరికా ఆందోళనలు ఉద్యోగాలు లేని హీప్పీల ఉద్యమంగా కొంతమంది అమెరికన్ విశ్లేషకులు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కాని జీరోహెడ్జ్ అన్న పేరుతో బ్లాగ్ నడుపుతున్న ఓ బ్లాగర్ జీవనానికి అష్టకష్టాలు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు -పైలట్లు, అమెరికా మెరైన్లు (సైనికులు), వృద్ధ మహిళలు, యువ నిరుద్యోగులు- ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని వెల్లడించాడు.
నిరసనకారులు “మేము 99 శాతం” అంటూ ఆందోళనలలో నినాదం ఇస్తున్నారు. 2008 నాటి సంక్షోభం రోజుల్లో వాల్ స్ట్రీట్ కంపెనీలకు బిలియన్ల కొద్దీ బెయిలౌట్లు ఇచ్చిన ఫలితంగా అమెరికా సమాజంలో తీవ్రమైన ఆదాయ అంతరాలను ప్రస్తావిస్తూ వారా నినాదాన్ని ఇస్తున్నారు. అమెరికాలో ఒక్క శాతంగా ఉన్న అత్యంత ధనికులు దేశంలో 99 శాతం ఆదాయాలను, ఆస్తులను సొంతం చేసుకున్నారన్న దాన్ని వారి నినాదం సూచిస్తోంది.

చూద్దాము, ఏమి జరుగుతుందో!!!
రాము గారు, పెద్దగా జరిగేదేమీ ఉండదు. కాకపోతే అమెరికా ప్రజలు కూడా నిరసనలకు అలవాటు పడే అవకాశాన్ని ప్రస్తుత ఆందోళనలు కల్పిస్తున్నాయి. ఆ ఒరవడిని అమెరికన్లు కొనసాగిస్తే వారిపైన అనివార్యంగా నిర్బంధం అమలు చేయవలసిన అవసరం రావచ్చు. అది మళ్లీ మరిన్ని ఆందోళనలకు దారి తీయవలసి ఉంది. ఇవన్నీ అమెరికన్ల సంసిద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.