
“శాకాహారం మాత్రమే భోంచేస్తానని” మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ నిర్వహించిన పులి గారు తన దీక్ష విరమించి నెలరోజులు కూడా కాక మునుపే తన “మాంసాహార” లక్షణాలను దాచి ఉంచుకోలేకపోయింది. తనకు తెలిసిన నిజాన్ని వెల్లడి చేసిన పొలీసు అధికారి సంజీవ్ భట్ పై కానిస్టేబుల్ చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరెస్టు చేసింది. కనీసం ఆయన భార్యను గానీ, లాయర్ ను గానీ కలవనీయకుండా నిర్భంధించింది.
“నిన్నటి నుండీ సంజీవ్ ను కలవడానికి నన్ను అనుమతించడం లేదు. కనీసం లాయర్ని కూడా ఆయనని కలవడానికి పోలీసు అధికారులు అనుమతించడం లేదు. ఆయనని కలవకుండా మేము ఆయన బెయిల్ పిటిషన్ ను ఎలా ఫైల్ చేయగలం?” అని సంజీవ్ భార్య శ్వేతా భట్ ప్రశ్నిస్తున్నది. తన భర్త ప్రాణాలు తీస్తారన్న భయం ఉందని ఆమె తెలిపింది. పోలీసు కానిస్టేబుల్ కె.డి.పంత్ తాను గుజరాత్ సి.ఎం నరేంద్ర మోడి ముస్లింలపై హిందువులను ప్రతీకారం తీర్చుకోవడానికి అనుమతించాలని కోరిన సమావేశానికి హాజరైనాని గతంలో సంజీవ్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశాడు.
అయితే సంజీవ్ భట్ తనను బలవంతం చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసేలా ఒత్తిడి తెచ్చానని అఫిడవిట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు తీయగలనని బెదిరించాడనీ తాజాగా ఎఫ్.ఐ.ర్ దాఖలు చేశాడు. ఈ ఎఫ్.ఐ.ఆర్ వెనుక ఎవరి ఒత్తిడులు పని చేసిందీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుజరాత్ మారణహోమంలో విగతులైనవారి బంధువులపై తీవ్ర ఒత్తిళ్ళు తెచ్చి నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని పాలనా వ్యవస్ధ ఫిర్యాదులను ఉపసంహరింపజేయించింది. అదే ఎత్తుగడ కానిస్టేబుల్ పంత్ పైన కూడా తెచ్చారనడంలో ఎట్టి సందేహమూ అవసరం లేదు.
