ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. రీబాక్ కంపెనీ, ఫెడరల్ ట్రెడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) లు పరస్పర అంగీకారం మేరకు ఈ వడ్డన అమలు చేస్తారు. వినియోగదారులకు చేసే చెల్లింపులకు దీనిని ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ఎఫ్.టి.సి, రీబాక్ కంపెనీ ప్రచారంపైన విచారణ జరుపుతుండగానే అది తన ప్రకటనను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ఎఫ్.టి.సి తో జరిగిన ఒప్పందానికి అంగీకరిస్తూనే, తన ప్రచారంలో అబద్ధం లేదనీ, అది నిజమేననీ కంపెనీ అధికారులు చెబుతూనే ఉన్నారు. ఒకవైపు తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటూనే మరోవైపు అందులో అబద్ధాలు లేవని చెప్పడం తమ బూట్ల అమ్మకాలను పడిపోకుండా కాపాడుకోవడానికి అని చెప్పనవసరం లేదు.
తాము ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడడం వలన ఇతర బూట్లను వాడినవారి కంటె తొడలు, పిక్కలు 11 శాతం అధికంగా శక్తివంతం అయ్యాయనీ, అలాగే పిరుదల అవాంఛిత సైజు 28 శాతం కంటె తగ్గాయని రిబాక్ కంపెనీ అమెరికాలో ప్రకటనలు జారీ చేసింది. ఈ ప్రకటనలపైన ఎఫ్.టి.సి విచారణ చేపట్టింది. విచారణ కొనసాగుతుండగానే, తమ ప్రచారం తప్పని పరోక్షంగా అంగీకరిస్తూ ఆ ప్రకటనని కంపెనీ ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఆ అర్ధం వచ్చే ప్రతి భాగాన్ని ఇతర ప్రకటనలనుంచి తొలగించిందని ఎఫ్.టి.సి లోని కన్సూమర్ ప్రొటెక్షన్ బ్యూరో అధిపతి డేవిడ్ వ్లాడెక్ తెలిపాడు.
ఇతర బూట్లకంటె తమ బూట్లు ఎందుకు అధిక, వేగవంతమైన ఫలితాన్ని ఇస్తాయన్న దానికి కంపెనీ ఇచ్చిన వివరణ వింతగా ఉంది. వారి బూట్లు ధరించినవారు తమ పొజిషన్ లో కొద్దిగా అస్ధిరంగా ఉండేలా డిజైన్ చేశారట. బూట్ల వలన ఎదురైన అస్ధిరత్వాన్ని స్ధిరత్వం కిందికి మార్చుకోవడానిమి బూట్లు ధరించినవారు ఎకువ శ్రమిస్తారనీ ఆ విధంగా అధిక ఫలితాన్ని తమ బూట్లు ఇస్తాయని కంపెనీ చెబుతోంది. మరేదో కారణం ద్వారా వ్యాయామంలో అధిక శ్రమ చేసే బదులు స్వయంగా పూనుకోవడం ద్వారానో వ్యాయామంలో అధిక శ్రమ చేసినా ఆ ఫలితాలను సాధించవచ్చన్న అనుమానం ఇక్కడ తలెత్తుతున్నది.
విచారణ జరుతుండగానే తమ ప్రకటనను విరమించుకోవడాన్ని బట్టె ఆ ప్రచారంలోని నిజం ఎంతో అర్ధం అవుతోంది. బాలెన్స్ బాల్ శిక్షణ ద్వారా స్ఫూర్తి పొంది తమ బూట్లు ప్రచారం చేసినట్లు చెబుతున్నప్పటికీ దానికి కట్టుబడి ఉండకుండా ఎందుకు ఉపసంహరించుకున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు.
