
ఇది 18 నెలల కాంబోడియా పసి బాలుడి కధ. ఈ బాలుడు నెల రోజులకు పైగా నేరుగా ఆవు పొదుగుని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. అయినా బాలుడు క్షేమంగానే ఉన్నాడని బాలుడి తాత చెబుతున్నాడు. బాలుడి పేరు ధా సోఫత్. బాలుడు గత జులై నుండీ నేరుగా ఆవు పొదుగునుండి పాలు తాగుతున్నాడని వెల్లడించాక ఆ వార్త అంతర్జాతీయంగా పతాక శీర్షికలను ఆక్రమించింది. ఇటీవల సంభవించిన తుఫాను దెబ్బకి బాలుడి తల్లిదండ్రుల ఇల్లు పాడైపోయింది. జీవనానికి ఆదరువు కోల్పోవడంతో వారు పనిని వెతుక్కుంటూ ధాయిలాండ్ వెళ్ళిపోయారు. దానితో బాలుడు ఆవుకి అలవాటు పడ్డాడని తెలుస్తోంది.
తల్లి వద్ద నుండి పాలు మానేశాక బాలుడి ఆరోగ్యం దెబ్బతిన్నదని 46 సంవత్సరాల తాత పత్రికలకు తెలిపాడు. ఆవుదూడ తన తల్లి ఆవు వద్ద పాలు తాగడం గమనించిన బాలుడు తాను కూడా ఆవు పొదుగునుండి నేరుగా పాలు తాగడం ప్రారంభించాడు. ఈ అలవాటు ఇక రోజు వారీ కార్యక్రమంగా మారిపోయిందని తాత ఊమ్ యూంగ్ తెలిపాడు. మొదట బాలుడిని ఆవు పొదుగునుండి పాలు తాగకుండా వెనక్కి లాగడానికి ప్రయత్నించినపుడు గట్టిగా ఏడ్వడంతో అతనికి ఏం చేయాలో పాలు పోలేదు. కాని బాలుడు ఆవు వద్ద పాలు తాగడం పట్ల పొరుగువారు ఏమాత్రం సంతోషంగా లేరు.
కాంబోడియా రాజధాని ఫోం పెన్ కు 315 కి.మీ దూరంలో ఉన్న సీమ్ రీప్ రాష్ట్రంలోని ఫియాస్ గ్రామంలో ఈ వ్యవహారం నడుస్తోంది. “వారు నన్నే తప్పు పడుతున్నారు. ఆవునుండి పాలు తాగనియకుండా బాలుడిని నిరోధించాలని చెబుతున్నారు. బాలుడు పెద్దయ్యాక సిగ్గుపడతాడనీ, తుంటరిగా తయారవుతాడనీ చెబుతున్నారు” అని ఊమ్ తెలిపాడు. శనివారం నుండి రోజుకి ఒకసారి మాత్రమే పాలు తాగడానికి పరిమితం చేశాడని తాత వివరించాడు. “బాలుడి ఆరోగ్యం భేషుగ్గా ఉంది. శక్తివంతంగా కూడా ఉన్నాడు. డయేరియా సూచనలేవీ లేవు” అని ఊం యూంగ్ తెలిపాడు.
బాలుడిలోని రోగ నిరోధక శక్తి తనకి ఆనారోగ్యం రాకుండా కాపాడుతోందని భావించవచ్చు. పాలు గ్లాసులో పట్టి తాగడానికి పొదుగు వద్ద నోరు పెట్టి తాగడానికి ఒకే తేడా ఉంది. గ్లాసు శుభ్రంగా ఉంచుకుంటాము. కాని ఆవు పొదుగు శుభ్రంగా ఉండడానికి అవకాశం లేదు. అందునా గ్రామాల్లొ ఆ అవకాశం ఇంకా తక్కువ. పల్లెల్లో ఆవుల పొదుగు ఒక్కటే కాదు అపరిశుభ్రంగా ఉండేది. పేదల ఇళ్ళు, అలవాట్లు, జీవన విధానం అన్నీ శుభ్రమైన జీవన విధానాన్ని గడపడానికి అనుకూలంగా ఉండవు. కనుక ఇతర అశుభ్ర పరిస్ధితులను తట్టుకుని జీవిస్తున్న బాలుడు ఆవు పొదుగు వద్ద శుభ్రత లేనంత మాత్రాన ఆరోగ్యం చెడిపోతుందని భావించనక్కర్లేదు.
