
నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలతో 450 మంది నిరసనకారులు, 46 మంది పోలిసులు గాయపడ్డారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, గాలిలోకి కాల్పులు జరిపారు. ఈజిప్టు పోలీసులు ఐదుగురిని ఇజ్రాయెల్ సైనికులు చంపాక ఇజ్రాయెల్ ఎంబసీపై దాడి జరగడం ఇది రెండవసారి. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి అరబ్ దేశం ఈజిప్టే. ప్రజాస్వామ్యం కోసం ఆందోళనలు జరిగి నియంత ముబారక్ గద్దె దిగాక ఇజ్రాయెల్ పరిస్ధితి దిగజారింది. అరబ్ దేశాల్లో నమ్మకమైన అనుచరుడుగా ఉన్న ఈజిప్టుతో సంబంధాలు దెబ్బతినడం ఇజ్రాయెల్ కు దౌత్య పరంగా నష్టకరం. ఈ పరిణామం ఇజ్రాయెల్‌కు తమపై తమకు గల అతి నమ్మకాన్ని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. పాలస్తీనీయుల హక్కులను కాలరాస్తుండడం పట్ల టర్కీ గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ పైన కారాలు మిరియాలు నూరుతోంది. మిత్రులుగా ఉన్న రెండు ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్ కు గల సంబంధాలు శతృదశకు చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ ఎంబసీ ముందు శుక్రవారం ప్రారంభమైన ఆందోళన శనివారం తెల్లవారు ఝాము వరకూ కొనసాగుతూనే ఉంది. కనీసం 2000 మంది వరకూ ఉన్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసన కొనసాగడంతో వారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టి వీధులపై పడేశారు. పెట్రోలు బాంబులు, రాళ్ళు విసిరారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్ధితి తీవ్రంగా మారడంతో ఈజిప్టు ప్రధాని ఎస్సామ్ షరాఫ్ కేబినెట్‌తో సంక్షోభ సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. శనివారం ఉదయంగానీ, మధ్యాహ్నం గానీ ఇది జరగనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పోలీసుల సెలవులను రద్దు చేసి అప్రమత్తతగా ఉండాలని ఆర్డర్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతర్జాతీయ బాధ్యతలను గౌరవించాలని ఈజిప్టుని కోరాడు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఆందోళనకారులు ఇజ్రాయెల్ ఎంబసీకి రక్షణగా ఉన్న గోడను బద్దలు కొట్టడంతో ఒబామా ఈ ప్రకటన చేశాడు. ఇజ్రాయెల్‌తో ఈజిప్టు కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని ఒబామా పరోక్షంగా కోరుతున్నాడు. పేరుకి శాంతి ఒప్పందమే అయినా దానివలన పాలస్తీనీయులకు శాంతి లేకుండా పోయింది. ఇజ్రాయెల్ పాల్పడిన అన్ని రకాల జాత్యహంకార విధానాలకు ముబారక్ నేతృత్వంలోని ఈజిప్టు మద్దతునిస్తూ వచ్చింది. అమెరికాకు నమ్మినబంటుగా ఉంటూ అరబ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టింది.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ అయితే రాయబార కార్యాలయాలకు సంబంధించిన వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలని ఈజిప్టు విదేశాంగ మంత్రి మహమ్మద్ కామెల్ అమిర్ ని కోరింది. ఈ అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించిన చరిత్ర అమెరికాకూ లేదు, ఇజ్రాయెల్ కూ లేదు. గాజాలో నివసిస్తున్న రెండు లక్షల మంది పాలస్తీనీయులకు నిత్యావసర సరుకులు, ఇంటి నిర్మాణ సరుకులతో పాటు ఇతర అవసరలేవీ అందకుండా నాలుగు సంవత్సరాలనుండీ బ్లాకేడ్ విధించడం ఏ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం సరైనదో అమెరికా, ఇజ్రాయెల్ లు చెప్పవలసి ఉంది. పాలస్తీనీయుల భూభాగలను ఆక్రమించి వారిని తమై ఇళ్ళలో నుండి తరిమి కొట్టి, వినకఫోతే జైళ్ళల్లో కుక్కి సెటిల్మెంట్లు నిర్మించడం ఏ చట్టాల ప్రకారం సాగుతున్నదో అవి చెప్పవలసి ఉన్నది.
ఇజ్రాయెల్ రాయబారి యిట్జక్ లెవనాన్ శనివారం ఉదయాన్నే తన కుటుంబం సిబ్బందితో సహా దేశం విడిచి పోయాడని ఈజిప్టు ప్రభుత్వ టి.వి తెలిపింది. ఈజిప్టులోని తమ రాయబార కార్యాలయాన్ని కాపాడాలని ఇజ్రాయెల్ ఈజిప్టు ప్రభుత్వాన్ని కోరవలసి ఉండగా అది చేయకుండా ఇజ్రాయెల్ అమెరికాను కోరడం విశేషం. అయితే అదనపు పోలీసుల్ని పంపింది మాత్రం ఈజిప్టు ప్రభుత్వమే.
ఈజిప్టు రాజధాని కైరోలోని తాహ్రిరి కూడలి వద్ద ఈజిప్టు ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామిక సంస్కరణలను తీసుకురావడానికి ఒక టైం టెబుల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక సైనిక ప్రభుత్వం అత్యంత నెమ్మదిగా వాగ్దానాలను అమలు చేస్తుండడం పట్ల ఈజిప్టు ప్రజలు అసహనంగా ఉన్నారు. పౌరులను మిలట్రీ కోర్టు విచారణ చేయడాన్ని ఆపాలని కోరుతున్నారు.
శుక్రవారం ప్రార్ధనలు ముగిశాక వాతు కూడలికి చేరుకుని నిరసనలు ప్రారంభించారు. “ప్రభుత్వ పధాన్ని సవరించే” నిరసనగా వారు తమ ఆందోళనకు పేరుపెట్టారు. కొందరు గిజాలోని నైలు నదీ తీరానికి మార్చింగ్ ప్రారంబించారు. నైలు నది ఒడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చేరుకుని దానికి రక్షణగా ఉన్న గోడను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఐదుగురు ఈజిప్టు పోలీసులను ఇజ్రాయెల్ సైన్యం చంపివేశాక ప్రతిరోజూ ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద ఆందోళనలు జరుగుతుండడంతో ఈ గోడను ఈజిప్టు ప్రభుత్వం గత నెలలోనే నిర్మించింది.
గాజా నుంచి వచ్చిన మిలిటెంట్లు మొదట ఈజిప్టుకి చెందిన సినాయ్ ద్వీపకల్పానికి చేరుకుని అక్కడి నుండి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి ఇజ్రాయెల్ సైనికులని ఎనిమిది మందిని చంపివేయడంతో, ఇజ్రాయెల్ సైన్యం వారిని వెంటాడింది. వెంటాడుతూ సినాయ్ లోకి ప్రవేశించిన సైనికులు అక్కడ సరిహద్దు కాపలా కాస్తున్న పోలీసులపై కూడా కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనతో ఈజిప్టు ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులను చంపినవారిని శిక్షించాలంటూ అప్పటికప్పుడు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యాలయం పై ఎగురుతున్న ఇజ్రాయెల్ జెండాను చించివేసి ఈజిప్టు జెండాను ఎగర వేశారు. పోలీసుల మరణంతో, ప్రజల ఒత్తిడి మేరకు ఈజిప్టు ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వం వారి సైనికులనుఇ విచారించాలని డిమాండ్ చేసింది. లేకుంటే తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి వెనక్కి పిలుస్తామని హెచ్చరించింది. దానితో ఇజ్రాయెల్ విచారణ జరుపుతామని హామి ఇచ్చింది.
శుక్రవారం కూడా ఆందోళనకారులు రాయబార కార్యాలయంపైకి ఎగబాకి ఇజ్రాయెల్ జెండా తొలగించి దానికి కాల్చివేశారు. కొందరు ఎంబసీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ప్రవేశ ద్వారానికి ఆనుకుని ఉన్న ఎంట్రన్స్ హాల్ వరకు వెళ్లారు గాని కార్యాలయం లోపలికి వెళ్లలేదని ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. దీనిని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఆందోళనకారులు సమీపంలో ఉన్న పోలీసు కార్యాలయంపై కూడా దాడి చేశారు. పోలీసులపై రాళ్ళు రువ్వుతూ నాలుగు వాహనాలను దహనం చేశారు. పోలీసుల భవనాన్ని ఆనుకుని ఉన్న భవనానికి నిప్పు పెట్టారు. ఈజిప్టు ప్రజలు పాల్పడుతున్న ఈ చర్యలన్నీ ఇజ్రాయెల్ విధానాల పట్ల వారిలో పెరుగుతున్న అసహనం, నిస్పృహలను సూచిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శుక్రవారం నిరసనలను సెక్యులర్ సంస్ధలు నిర్వహించాయని రాయిటర్స్ తెలిపింది. సంస్కరణలు తేవాలనీ, నూతన రాజ్యాంగం రూపొందించాలనీ, మిలట్రీ కోర్టుల్లో పౌరులను విచారించడం ఆపాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలనుండి ముస్లిం బ్రదర్ హుడ్ దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈజిప్టు మిలట్రీ పాలకులు, ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఈ సంవత్సరంలోనే జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రజల డిమాండ్ మేరకు ముబారక్‌ను విచారించడం ప్రారంభించింది. అవినీతిపైనా, తాహ్రిరి కూడలివద్ద నిరసన చేస్తున్నవారిలో 850 మందిని చంపినందుకూ ముబారక్‌ని విచారిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఇవి జరుగుతుండగానే ఇజ్రాయెల్ చేసిన అతి సాహసం ఈజిప్టు ప్రజలను రెచ్చగొట్టింది. యధావిధిగా ఈజిప్టు, ఇజ్రాయెల్ ఏమి చేసినా పట్టించుకోదన్న భ్రమలో ఈజిప్టు పోలీసులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపి ఈజిప్టు ప్రజల ఆగ్రహాన్ని ఇప్పుడు చవిచూస్తున్నారు.
