‘గాలి’ గారిని జైల్లో బంధించడం సాధ్యమవుతుందని నెల రోజుల క్రితం వరకూ ఎవరూ భావించి ఉండరు. కాని దేశంలోని దర్యాప్తు సంస్ధలను వాటిమానాన వాటిని పనిచేయనిస్తే ఒక్క “గాలి” గారినేం ఖర్మ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న యువరాజు గార్లను కూడా బంధించ వచ్చు. ఆ సంగతినే సి.బి.ఐ రుజువు చేస్తోంది. ఈ క్రియాశీలత ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాని, ఒక్కప్పుడు ఊహించనలవి కాని దృశ్యాలను భారత ప్రజ ప్రత్యక్షంగా, టి.వి ఛానెళ్ళలో సంతృప్తిగా, సంతోషంగా, కసిగా, కావలసిందే అన్నట్లుగా చూస్తూ తరిస్తున్నారు.
భారత ప్రజల సొత్తయిన ఇనుప గనులను అనుమతించినదానికన్నా తొవ్వి పోసి విదేశాలకు అమ్ముకుని కొద్ది సంవత్సరాల తేడాలోనే లక్షల కోట్లకు పడగలెత్తిన గాలి జనార్ధన రెడ్డి, ఆయన గారి ఇలాకా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎం.డి, శ్రీనివాస రెడ్డి లను హైద్రాబాద్ లోని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. నిందితులిద్దరిని కోర్టులో హాజరుపరుస్తూ, సి.బి.ఐ 15 రోజులపాటు వారిని తమ కష్టడీలో తీసుకోవడానికి అనుమతించాలని కోరింది. చిత్రంగా ఈ అక్రమ మైనింగ్, అక్రమ లీజుల కేసులో మొదటి ముద్దాయిగా ఒ.ఎం.సి మేనేజింగ్ డైరెక్టర్ బి.వి.శ్రీనివాస రెడ్డినీ, రెండో ముద్దాయిగా గాలి జనార్ధన రెడ్డినీ సి.బి.ఐ పేర్కొన్నది. సూత్రధారిని అప్రధానం చేసి పాత్రధారిని ప్రధానం చేసింది. ఆదిలోనే హంసపాదుగా ఇది మారకుండా ఉండాలని కోరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
సి.బి.ఐ నిందుతుల కస్టడీ కోరుతూ ‘మెమో’ సమర్పించగా అది ప్రొసీజర్ కి విరుద్ధం కనుక కస్టడీకి తరలించడానికి వీల్లేదు అని డిఫెన్స్ లాయర్ వాదించాడు. నిందితుల సంస్ధ ఒ.ఎం.సి అన్ని నిబంధనలూ ఉల్లంఘించినందునా, అక్రమ మైనింగ్ లో కోట్ల రూపాయల డబ్బు ఇమిడి ఉన్నందునా నిందితులిద్దరినీ తమ కస్టడీకి అనుమతించాలని సి.బి.ఐ కోరింది. అయితే గాలి జనార్ధన రెడ్డి గౌరవనీయమైన వ్యక్తి (!) అనీ, మాజీ మంత్రి అనీ కనుక వెంటనే బెయిల్ ఇవ్వాలనీ డిఫెన్స్ లాయర్ రాఘవాచారి కోరాడు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాడనీ, పాస్‌పోర్టు కూడా సరెండర్ చేస్తాడనీ డిఫెన్స్ కౌన్సిల్ కోరాడు. అయితే జడ్జి సి.బి.ఐ కస్టడీకీ ఇవ్వలేదూ, ఇటు బెయిలూ ఇవ్వలేదు. ఇద్దరినీ రెండువారాలు జ్యుడిషియల్ కస్టడీకి పంపించాడు.
అయితే జడ్జి, సి.బి.ఐ కస్టడీకి ఏ కారణాల వలన అనుమతించనిదీ తెలియలేదు. కస్టడీ కోరడానికి పిటిషన్ దాఖలు చేయవలసి ఉండగా, హడావుడిగా మెమో దాఖలు చేయడం వల్లనే సి.బి.ఐ కస్టడీకి తరలించడానికి బదులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించి ఉండవచ్చన్నది ఒక అంచనా.
గాలి జనార్ధన రెడ్డి, బి.వి.శ్రీనివాస రెడ్డి ఇళ్లపైన సి.బి.ఐ, నేటి తెల్లవారు ఝాము గం.5:30ని.లకు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఇరువురినీ జె.డి లక్ష్మీనారాయణ రోడ్డు మార్గంలో, గట్టి పోలీసు పహారా మధ్య హైద్రాబాద్ కీ తీసుకొచ్చారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇరువురిని కోర్టులో హాజరుపరిచాక జడ్జి పద్నాలుగు రొజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించాడు.
తాజా ఘటనతో జగన్మోహర్ రెడ్డికి మద్దతుగా రాజీనామా చేసిన ఎం.ఎల్.ఎ లు ఎంతమంది ఆయనతో నిలిచేదీ ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఐదుగురు ఎం.ఎల్.ఎ లు సోమవారం నాటి సమావేశానికి హాజరు కాలేదని వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. మరింతమంది జారిపోవచ్చని పత్రికలు, ఛానెళ్ళూ ఊహాగానాలు చేస్తున్నాయి. అంధ్రప్రదేశ్ లోని అవినీతి బకాసురుడిని కూడా కటకటాల వెనుక చూసే భాగ్యం తెలుగు ప్రజలకు వస్తుందో లేదో మరి!

ఇప్పుడు కూడా సి.బి.ఐ దాని మానాన అది పని చేస్తున్నట్టుగా అనిపించటం లేదు. ఇప్పుడు కూడా కొందరికి అనుకూలంగా స్పందిస్తున్నట్టుగానే తోస్తుంది. అయినా ఎంత మందిని చేయలేదు ఇలాంటి అరెస్టులు, కనీసం నామమాత్రమైన శిక్ష పడ్డ సంతోషమే అన్న స్థాయికి వచ్చేసాము. చూద్దాం ఇంకా ఎన్ని మలుపులున్నాయో.
అవున్నిజం.