బాబా రాందేవ్ పై విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసు


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విభాగం బాబా రాందేవ్ పై గురువారం విదేశీ మారకద్రవ్య చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇ.డి అధికారులు గురువారం విలేఖరులకు సమాచారం అందించారు. బాబా రాందేవ్, ఆయాన్ ట్రస్టు అమెరికా, న్యూజీలాండ్, బ్రిటన్ ల నుండి అనధికారికంగా ఆర్ధిక సహాయం అందుకున్నాడని ఇ.డికి సాక్ష్యాలు దొరికాయని, దానితో కేసు నమోదు చేశామనీ అధికారులు చెబుతున్నారు.

బాబా రాందేవ్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది వారాల క్రితం ఆమరణ నిరాహర దీక్ష తలపెట్టడం, దానిని రెండో రోజే పోలీసులు అర్ధ రాత్రి దాడి చేసి విఘ్నం కావించడం తెలిసిన విషయమే. విదేశీ బ్యాంకుల్లో భారత సంపన్నులు దాచిపెట్టిన లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తిరిగి దేశంలోకి రప్పించాలన్న డిమాండ్ తో రాందేవ్ నిరాహార దీక్షను తలపెట్టాడు. మొదటి రోజు ఆయనను రిసీవ్ చేసుకోవడానికి నలుగురు కేంద్ర మంత్రులను పంపిన కేంద్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి దీక్షను విరమించకపోవడంతో పోలీసుల చేత అరెస్టు చేయించి ఢిల్లీనుండి బైటికి తరలించింది.

అప్పట్లోనే బాబా రాందేవ్ పైనా, ఆయన ట్రస్టుపైనా అవినీతి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆగస్టు16 నుండి అన్నా హజారే తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షపై కూడా అదే స్ధాయిలో ఆరోపణలు చేయబోయి కాంగ్రెస్ పార్టీ భంగపడింది. రాందేవ్ లాగా అరెస్టు చేసి జైల్లో పెట్టినా పరిస్ధితిని అదుపులోకి తెచ్చుకోలేకపోయింది. అంతిమంగా మద్యంతరంగా పుట్టుకొచ్చిన మూడు డిమాండ్లపై పార్లమెంటు తీర్మానం చేయడంతో ఆయన దీక్షా ముగిసింది. అన్నా దీక్ష విరమించాడు గానీ జన్ లోక్ పాల్ బిల్లు పరిస్ధితి ఏంటో దేశ ప్రజలకు చెప్పినవారు లేరు. మూడు డిమాండ్లకు, జన్ లోక్ పాల్ కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పినవారు లేరు. పత్రికలూ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అంతర్జాతీయంగా చెడ్డపేరు వచ్చింది. బలహీన ప్రభుత్వంగా, దారీ తెన్నూ లేని ప్రబుత్వంగా ముద్ర పడింది. మరోవైపు అన్నా దీక్షకు అమెరికా నుండి అనుకోని మద్దతు రావడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఈ నేపధ్యంలో నిరహారా దీక్షలు మళ్లీ ఎవరూ చేయకూడదనుకుందేమో ప్రభుత్వం, రాందేవ్ పై మొదటిసారిగా కొరడా ఝుళిపించింది.

రాందేవ్ ప్రతినిధి వేద్ ప్రతాప్ వైదిక్ కూడా బాబాపై కేసు దాఖలు చేయడం ప్రతీకారంతొనేనని అంటున్నాడు. విదేశీమారక ద్రవ్య నిర్వహణా చట్టం (Foreign Exchange Management Act) క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బ్రిటన్ నుండి ఇటీవల 7 కోట్ల రూపాయలు అక్రమంగా జమ అయ్యాయన్న సాక్ష్యాలు లభించాయని ఇ.డి చెబుతోంది. స్కాట్లండ్ వద్ద రాందేవ్ కు “లిటిల్ కుంబ్రే” పేరుతో ఒక ద్వీపం, అందులో ఓ భవంతి ఉన్న విషయం పై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లుగా ఇ.డి చెప్పింది. లార్గ్స్ పట్టణంలో బాబా రాందేవ్ కి మరొక భవనం ఉన్నదనీ ఆయన భారతేతర కార్యకలాపాలు అక్కడినుండే జరుగుతాయని తెలుస్తోంది.

రాందేవ్ ట్రస్టులయిన పతంజలి యోగ్‌పీఠ్ ట్రస్టు, దివ్య యోగ మందిర్ ట్రస్టు లతొ సహా వివిధ ట్రస్టులకు విదేశీ నిధులు జమ అయినట్లుగా సాక్ష్యాధారాలు లభించాయని ఇ.డి తెలిపినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా ఏజన్సీ తెలిపింది. అయితే ఇవి ఎప్పుడు జమయిందీ, ఇ.డివారికి ఎప్పుడు తెలిసిందీ వివరాలు తెలియలేదు. అన్నా హజారే ట్రస్టులపై కూడా త్వరలో ఇవే రకమైన ఆరోపణలు రావన్న గ్యారంటీ ఏమీ లేదు.

వ్యాఖ్యానించండి