జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు


జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు” అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ దల్వీర్ భండారి నేతృత్వం లోని డివిజన్ బెంచి ఈ మేరకు తీర్పునిస్తూ జగన్ పిటిషన్ ను కొట్టివేసింది. పేరు మోసిన మహా లాయర్లు రాం జేఠ్మలాని, రోహ్‌తగి లు జగన్ తరపున వాదించినా ఫలితం లేకపోయింది.

అసలు హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా జగన్ సుప్రీం కోర్టుకి వెళ్ళడమే అతి నమ్మకంతోనో లేక నిస్పృహతోనో వేసిన అడుగు. హై కోర్టు మొదటి నుండీ ఒక పద్ధతి ప్రకారం పి.శంకరరావు, యెర్రం నాయుడుల పిటిషన్ లపై వ్యవహరిస్తూ వచ్చింది. మొదట ప్రాధమిక ఆధారాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని సి.బి.ఐని ఆదేశిస్తూ రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ ఆదేశలపైనా జగన్ పిటిషన్ వేసి భంగపడ్డాడు. రెండు వారాల నివేదిక చూసి మరో వారం గడువు సి.బి.ఐ కి హైకోర్టు ఇచ్చింది. అనంతరం సమర్పించబడిన నివేదికను చూసిన హైకోర్టు జగన్ అక్రమాస్తులపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని తేల్చుకుంది. అదే వాద ప్రతివాదులకు తెలిపింది.

ప్రాధమిక ఆధారాలున్నాయని హైకోర్టు భావించాక అది కేసును అంతటితో వదిలేస్తుందా? వదిలేస్తే అది న్యాయస్ధానం ఎందుకవుతుంది? ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని భావించాక పూర్తి విచారణ చేయించడం హైకోర్టు విధి. అటువంటి విధిని నిర్వర్తించరాదంటూ సుప్రీం కోర్టుకి జగన్ వెళ్ళడమే ఒక వింత. నిస్పృహలో అన్ని దారులూ మూసుకుపోయిన స్ధితిలో మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు.

చెప్పుకోవలసింది ఏమన్నా ఉంటే సి.బి.ఐ కే చెప్పుకోమని సుప్రీం కోర్టు జగన్ లాయర్లకు తెలిపింది. సి.బి.ఐ విచారణ చేయడమే నేరమన్నట్లుగా జగన్ వర్గ ఎం.ఎల్.ఎ లు పదవులకి రాజీనామా చేయడం అత్యంత నీతిమాలిన చర్య. అవినీతికి వ్యతిరేకంగా పట్టణాలన్నీ అన్నా హజారే ఉద్యమం వైపు చూస్తుండగా, ఆంద్ర ప్రదేశ్ ఎం.ఎల్.ఎ లు ముప్ఫై మంది నిస్సిగ్గుగా జగన్ కి మద్దతుగా రాజీనామా చేయడం ఏమని అభివర్ణించాలి? పైగా వై.ఎస్.ఆర్ పేరు ఎఫ్.ఐ.ఆర్ లో ఉండకూడదట! ఈ ఎం.ఎల్.ఎ లంతా వై.ఎస్ అవినీతిలో భాగం పంచుకున్నారు కనుకనే వారిని రాజీనామా చేసేలా జగన్ వత్తిడి తీసుకురాగలిగాడు.

విమర్శలకి వై.ఎస్.ఆర్ అతీతుడా? ఒక ఫ్యాక్షనిస్టు, దశాబ్దాలపాటు ఎదురుచూసి ముఖ్యమంత్రి పీఠాన్ని సంపాదించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడితే దానిపైన విచారణ జరగకూడదని రాజీనామా చేసిన ఈ ప్రజా ప్రతినిధులు తామేదో పెద్ద వీరోచిత కార్యక్రమం చేసినట్లు టీ.వీ ఛానెళ్లలో ఫోజులిస్తుంటే, పార్లమెంటరీ రాజకీయాలు ఎంతకు దిగజారతాయో అర్ధం అవుతోంది. ఇదంతా రాజకీయంలో భాగంగానే చూడడం, మాట్లాడడం చేస్తున్నారు. వీళ్ళా రాజకీయ నాయకులు? హవ్వ! నవ్విపోదురుగాక!

సి.బి.ఐ విచారణ ప్రారంభం కాగానే దాన్ని ఆపాలంటూ జగన్ కోర్టుల చుట్టూ తిరగడంతోనే అర్ధం అవుతోంది, ఆయన అవినీతి ఎంత నిఖార్సైనదో. తన చర్యలతో తన నిజస్వరూపం ఏమిటో తానే రుజువు చేసుకుంటున్న జగన్ అవినీతిని ప్రజలు నమ్మడానికి కోర్టు తీర్పులెందుకిక?

One thought on “జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

  1. రాం జేఠ్మలాని దగ్గరకు విషయం వెళ్ళిందంటనే దానర్థం, ముద్దాయి అన్ని ఆశలు వదులుకొని, ఆఖరి అస్త్రంగా రాం జేఠ్మలాని దగ్గరకు వెళతారు కేసు గెలిపిస్తారని కాదు, కనీసం సంవత్సరాలపాటు సాగదీయగలరని.

    రాం జేఠ్మలాని ట్రాక్ రికార్డ్ అస్సలు బాగోలేదు.. చాలా వరకు ఓటమి, ముద్దాయిలు కారగారపాలు.. ఫీజు బొక్క!

వ్యాఖ్యానించండి